ఆసియా కప్ 2025లో భాగంగా ఇండియా, పాక్ మ్యాచులో చెలరేగిన షేక్ హ్యాండ్ వివాదం తీవ్ర దుమారం రేపింది. టాస్ సమయంలో.. మ్యాచ్ ఆయిపోయిన తర్వాత పాక్ ఆటగాళ్లతో టీమిండియా ప్లేయర్స్ కరచాలనం చేయలేదు. పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. మొత్తానికి షేక్ హ్యాండ్ ఇష్యూ క్రీడా వర్గాల్లో చర్చనీయాశంగా మారింది. కొందరు భారత్ తీరును సమర్ధిస్తుంటే.. మరికొందరు విమర్శిస్తున్నారు.
భారత్ క్రీడా స్ఫూర్తిని ఉల్లంఘించిందని కొందరు విమర్శిస్తుండగా.. పహల్గాం టెర్రర్ ఎటాక్ మృతుల కుటుంబాలకు భారత్ ఘన నివాళి ఆర్పించిందని ఇంకొందరు సపోర్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇండియా, పాక్ మ్యాచ్ షేక్ హ్యాండ్ వివాదంపై ఆసీస్ దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ స్పందించారని ప్రచారం జరుగుతోంది. భారత్ క్రీడా స్ఫూర్తిని ఉల్లంఘించిందని రికీ పాంటింగ్ విమర్శించారని.. పాకిస్తాన్ తీరును ఆయన మెచ్చుకున్నట్లు పాంటింగ్ పేరిట ఓ పోస్ట్ సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతోంది.
ALSO READ : Asia Cup 2025: పాక్ మాజీ ప్లేయర్ బలుపు మాటలు.. సూర్యను పంది అంటూ అవమానిస్తారా..
తాజా ఈ ఇష్యూపై పాంటింగ్ స్పందించారు. ఇండియా, పాక్ మ్యాచ్ తర్వాత తాను భారతదేశాన్ని విమర్శించానని, పాకిస్థాన్‌ను ప్రశంసించినట్లు తన పేరిట జరుగుతున్న తప్పుడు ప్రచారాన్నితీవ్రంగా ఖండించారు. తాను అలాంటి వ్యాఖ్యలు ఎప్పుడూ చేయలేదని స్పష్టం చేశారు పాంటింగ్. తాను భారత్‌ను విమర్శించినట్లు జరుగుతోన్న ప్రచారం అవాస్తవమని కొట్టిపారేశారు. ఆసియా కప్ గురించి తాను ఎలాంటి బహిరంగ ప్రకటన చేయలేదని వివరణ ఇచ్చారు.
