వచ్చే మార్చి నాటికి నక్సల్స్ రహిత భారత్.. ఉగ్రవాద నిర్మూలనలో రాజీ పడబోం : బండి సంజయ్

వచ్చే మార్చి నాటికి నక్సల్స్ రహిత భారత్.. ఉగ్రవాద నిర్మూలనలో రాజీ పడబోం : బండి సంజయ్
  • దేశాన్ని నక్సలిజం, టెర్రరిజం నుంచి విముక్తి చేసేందుకు కృషి చేస్తున్నం: బండి సంజయ్
  • హర్యానాలోని మానేసర్‌‌‌‌‌‌‌‌లో ఎన్ఎస్‌‌‌‌జీ క్యాంపస్‌‌‌‌ను సందర్శించిన కేంద్ర మంత్రి 
  • సిబ్బంది భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన

న్యూఢిల్లీ, వెలుగు: వచ్చే ఏడాది మార్చి నాటికి నక్సల్స్- రహిత భారత్(నక్సల్ -ముక్త్ భారత్) లక్ష్యాన్ని సాధించేందుకు పూర్తి నిబద్ధతతో ముందుకెళ్తున్నట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇది సంకల్పం మాత్రమే కాదని, ఒక ఉద్యమంగా కొనసాగుతోందని చెప్పారు. భారత్‌‌ను నక్సలిజం, టెర్రరిజం నుంచి విముక్తి చేసి శాంతియుత, సుసంపన్న, అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. 

ఆ దిశలో 2010తో పోలిస్తే ప్రస్తుతం వామపక్ష తీవ్రవాద హింస 83 శాతం మేర తగ్గిందని వెల్లడించారు. మోదీ ప్రభుత్వ రణ నీతి, సుస్థిర పాలన విధానాల ఫలితంగానే ఈ మార్పు వచ్చిందన్నారు. బుధవారం హర్యానాలోని మానేసర్‌‌‌‌లోని నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్‌‌ఎస్‌‌జీ) క్యాంపస్‌‌ను మంత్రి సంజయ్ సందర్శించారు. 

ఈ సందర్భంగా తొలుత శౌర్యస్థల్ వద్ద విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఎన్ఎస్‌‌జీ వీరులకు నివాళులు అర్పించారు. అనంతరం ఎన్‌‌ఎస్‌‌జీ నివాస సముదాయాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. స్థానికంగా నిర్మించిన ఎన్ఎస్‌‌జీ స్టేడియాన్ని, స్విమ్మింగ్ పూల్‌‌ను ప్రారంభించి, మాట్లాడారు. 2047 నాటికి మనదేశం ‘వికసిత భారత్’లక్ష్యాన్ని అధిగమించి విశ్వగురు స్థానంలో నిలవాలన్నదే మోదీ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. 

ఉగ్రదాడి చేయాలంటేనే వణుకు పుట్టాలి..

భారత్‌‌పై దాడి చేయాలనే ఆలోచన వస్తేనే టెర్రరిస్టులకు వణుకు పుట్టేలా తమ ప్రభుత్వం తిరిగి దాడి చేస్తోందని బండి సంజయ్‌‌ అన్నారు. ఉగ్రవాద నిర్మూలనలో రాజీ లేదని, దేశ భద్రత, గౌరవమే తమకు మొదటి ప్రాధాన్యత అని చెప్పారు. టెర్రరిస్టులను ఎదుర్కోవడంలో ఎన్ఎస్‌‌జీ చూపిన ధైర్య సాహసాలు దేశమంతా ఎన్నోసార్లు గర్వపడేలా చేసిందని గుర్తుచేశారు. 

ఉగ్రవాదంపై కచ్చితమైన దాడులు, హైజాక్ వ్యతిరేక ఆపరేషన్లు, బాంబ్ నిర్వీర్య కార్యకలాపాలు, జాతీయ విపత్తుల సమయాల్లో చేపట్టే సహాయక చర్యల సమయంలో ఎన్ఎస్‌‌జీ అసాధారణ ప్రతిభను చాటుతోందని కొనియాడారు. పహల్గాం ఉగ్రదాడికి భారత్‌‌ ధీటైన జవాబు ఇచ్చిందన్నారు. ఇండియన్‌‌ ఆర్మీ పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిందని చెప్పారు. భారత్ వైపు కన్నెత్తి చూసే వాళ్లు, ఇకపై మళ్లీ చూసే పరిస్థితిలో ఉండరనే సంకేతాలను ‘ఆపరేషన్ సిందూర్‌‌‌‌’ద్వారా శత్రు దేశాలకు పంపించామన్నారు. 

మోదీ ప్రభుత్వం రక్షణ, భద్రతా రంగాల్లో ఆత్మనిర్భరతకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని, అందుకే 2025ను ‘రక్షణ సంస్కరణల సంవత్సరం’గా ప్రకటించినట్లు గుర్తుచేశారు. అనంతరం ఎన్ఎస్‌‌జీ డైరెక్టర్ జనరల్ బి.శ్రీనివాసన్, ఐజీలు దీపక్ కుమార్ కేడియా(హెడ్ క్వార్టర్స్), మేజర్ జనరల్ ప్రవీణ్ చాబ్రా(ఆపరేషన్స్), మేజర్ జనరల్ వికాస్ చౌదరి(ట్రైనింగ్), ప్రిన్సీ రాణి(ప్రొవిజనింగ్)లతో కలిసి ఎన్ఎస్‌‌జీ సిబ్బంది చేపట్టిన ఆపరేషనల్ డెమో ప్రదర్శనలను బండి సంజయ్‌‌ తిలకించారు.