- జైస్వాల్.. సూపర్
- మూడో వన్డేలో 9 వికెట్ల తేడాతో ఇండియా గెలుపు
- సౌతాఫ్రికాపై 2-1తో సిరీస్ సొంతం
- రాణించిన రోహిత్, కోహ్లీ, కుల్దీప్, ప్రసిధ్
- డికాక్ సెంచరీ వృథా
విశాఖపట్నం: సౌతాఫ్రికా చేతిలో ఎదురైన టెస్ట్ సిరీస్ పరాజయానికి టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్ (4/41), ప్రసిధ్ కృష్ణ (4/66)కు తోడుగా బ్యాటింగ్‌లో యశస్వి జైస్వాల్ (121 బాల్స్‌లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లతో 116 నాటౌట్) సూపర్ సెంచరీతో చెలరేగడంతో.. శనివారం జరిగిన ఆఖరిదైన మూడో వన్డేలో ఇండియా 9 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాపై గెలిచింది.
ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–1తో సొంతం చేసుకుంది. టాస్ ఓడిన సౌతాఫ్రికా 47.5 ఓవర్లలో 270 రన్స్‌కు ఆలౌటైంది. క్వింటన్ డికాక్ (89 బాల్స్‌లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో 106) సెంచరీతో మెరవగా, కెప్టెన్ టెంబా బవూమ (48) ఫర్వాలేదనిపించాడు. తర్వాత ఇండియా 39.5 ఓవర్లలో 271/1 స్కోరు చేసి నెగ్గింది. రోహిత్ శర్మ (73 బాల్స్‌లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 75), విరాట్ కోహ్లీ (45 బాల్స్‌లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 65 నాటౌట్) దుమ్మురేపారు. జైస్వాల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, సిరీస్‌లో 302 రన్స్ చేసిన కోహ్లీకి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.
కుల్దీప్, ప్రసిధ్ అదుర్స్..
కెప్టెన్ రాహుల్ ఎడమ చేతితో టాస్ వేయడం 20 మ్యాచ్‌ల తర్వాత ఇండియాకు కలిసొచ్చింది. టాస్ నెగ్గడంతోనే రెండో ఆలోచన లేకుండా సౌతాఫ్రికాకు బ్యాటింగ్ అప్పగించింది. ఫలితంగా బ్యాటింగ్‌కు దిగిన సఫారీలను ఇండియా బౌలర్లు కుల్దీప్ (4/41), ప్రసిధ్ కృష్ణ (4/66) ముప్పుతిప్పలు పెట్టారు. ఇన్నింగ్స్ ఐదో బాల్‌కే ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (0)ను డకౌట్ చేసి అర్ష్‌దీప్ ఇచ్చిన శుభారంభాన్ని వీరిద్దరు కొనసాగించారు.
అయితే రెండో ఎండ్‌లో డికాక్‌కు బవూమా అండగా నిలిచాడు. తొలి స్పెల్‌లో ప్రసిధ్ లెంగ్త్‌లో తప్పులు చేయడంతో డికాక్ భారీ షాట్లు కొట్టాడు. తన రెండో ఓవర్‌లోనే 6, 6, 4తో 18 రన్స్ ఇచ్చుకున్నాడు. ఈ క్రమంలో డికాక్ 42 బాల్స్‌లో ఫిఫ్టీ పూర్తి చేశాడు. అయితే 21వ ఓవర్‌లో జడేజా (1/50) వేసిన స్లో టర్నింగ్ బాల్‌ను టచ్ చేసి బవూమ పాయింట్‌లో కోహ్లీకి చిక్కాడు.
రెండో వికెట్‌కు 113 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. బ్రీట్జ్‌కే (24) వేగంగా ఆడాడు. రెండో ఎండ్‌లో డికాక్ కూడా దూకుడు చూపడంతో స్కోరు బోర్డు పరుగెత్తింది. ఈ జోడీని విడదీసేందుకు పార్ట్‌టైమ్ స్పిన్నర్ తిలక్ వర్మను రంగంలోకి దించడం ఇండియాకు కలిసి రాలేదు. బ్రీట్జ్‌కే...తిలక్ బౌలింగ్‌లో భారీ షాట్లకు తెరలేపడంతో ప్రసిధ్‌ను రెండో స్పెల్‌కు తీసుకొచ్చారు. ఈ వ్యూహం సఫారీలకు ఉచ్చుగా మారింది. 29వ ఓవర్‌లో 4 బాల్స్ తేడాలో బ్రీట్జ్‌కే, మార్‌క్రమ్ (1)ను పెవిలియన్‌కు పంపాడు. 80 బాల్స్‌లో సెంచరీ చేసిన డికాక్‌ను మరో మూడు ఓవర్ల తర్వాత ఔట్ చేశాడు.
దీంతో ప్రొటీస్ స్కోరు 199/5గా మారింది. ఇక్కడి నుంచి కుల్దీప్ బాల్‌ను బాగా టర్న్ చేస్తూ లోయర్ ఆర్డర్‌ను కకావికలం చేశాడు. 39వ ఓవర్‌లో మూడు బాల్స్ తేడాలో బ్రేవిస్ (29), యాన్సెన్ (17)ను ఔట్ చేశాడు. ఆ తర్వాత తన వరుస ఓవర్లలో కార్బిన్ బాష్ (9), ఎంగిడి (1) వికెట్లు తీశాడు. మధ్యలో కేశవ్ మహారాజ్ (20 నాటౌట్) మెరిసినా.. చివర్లో బార్ట్‌మన్ (3)ను ప్రసిధ్ ఔట్ చేశాడు. 71 రన్స్ తేడాతో చివరి ఐదు వికెట్లు పడటంతో సఫారీలు తక్కువ స్కోరుకే పరిమితమయ్యారు.
భారీ భాగస్వామ్యాలు..
ఛేజింగ్‌లో సఫారీ బౌలర్లకు ఏమాత్రం చాన్స్ ఇవ్వకుండా జైస్వాల్, రోహిత్ రన్స్ రాబట్టారు. పవర్‌ప్లేలో 48 రన్స్ చేశారు. అయితే ఎక్కుగా స్ట్రయిక్ తీసుకున్న రోహిత్ భారీ షాట్లతో 54 బాల్స్‌లో ఫిఫ్టీ కొట్టాడు. దాంతో ఇండియా స్కోరు 19.4 ఓవర్లలో వందకు చేరింది. ఈ వెంటనే యశస్వి కూడా 75 బాల్స్‌లో హాఫ్ సెంచరీని అందుకున్నాడు. ఈ జోడీని విడదీసేందుకు బవూమ చేసిన ప్రయత్నాలు సక్సెస్ కాలేదు. చివరకు 26వ ఓవర్‌లో కేశవ్ మహారాజ్ (1/44) మిడిల్ స్టంప్ లక్ష్యంగా వేసిన బాల్‌ను షాట్ ఆడే క్రమంలో హిట్‌మ్యాన్ డీప్ స్క్వేర్ లెగ్‌లో బ్రీట్జ్‌కే చేతికి చిక్కాడు.
తొలి వికెట్‌కు 155 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. ఈ దశలో కోహ్లీ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. జైస్వాల్ కూడా లాంగాన్, లాంగాఫ్‌లో రెండు సిక్స్‌లు కొట్టాడు. 33 ఓవర్లలో ఇండియా స్కోరు 200లకు చేరింది. తర్వాత 111 బాల్స్‌లో జైస్వాల్ వన్డేల్లో తొలి సెంచరీని సాధించాడు. కొద్దిసేపటికే విరాట్ కూడా 40 బాల్స్‌లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఈ ఇద్దరు రెండో వికెట్‌కు 116 రన్స్ జోడించి మరో 61 బాల్స్ మిగిలి ఉండగానే విజయాన్ని అందించారు.
సంక్షిప్త స్కోర్లు
సౌతాఫ్రికా: 47.5 ఓవర్లలో 270 ఆలౌట్ (డికాక్ 106, బవూమ 48, కుల్దీప్ 4/41, ప్రసిధ్ 4/66).
ఇండియా: 39.5 ఓవర్లలో 271/1 (యశస్వి 116*, రోహిత్ 75, కోహ్లీ 65*, కేశవ్ 1/44).
4 ఇంటర్నేషనల్ క్రికెట్‌లో 20 వేల రన్స్ చేసిన నాలుగో ఇండియన్ క్రికెటర్ రోహిత్ శర్మ.
6 మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన ఆరో ఇండియన్ బ్యాటర్ యశస్వి జైస్వాల్.
