- 170 రన్స్ తేడాతో ఓడిన అఫ్గానిస్తాన్
- 2-0తో సిరీస్ టీమిండియా సొంతం
కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (154), ఇషాన్ కిషన్ (125) సెంచరీలతో దుమ్మురేపడంతో బుధవారం (జూన్ 18) జరిగిన రెండో వన్డేలో ఇండియా 170 రన్స్ భారీ తేడాతో అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. దాంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను హోమ్ టీమ్ 2–0తో సొంతం చేసుకుంది.
లక్నో: వన్డే వరల్డ్ కప్ సన్నాహాల్లో టీమిండియా దూసుకుపోతోంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (110 బాల్స్‌లో 22 ఫోర్లు, 2 సిక్స్‌లతో 154), ఇషాన్ కిషన్ (79 బాల్స్‌లో 14 ఫోర్లు, 7 సిక్స్‌లతో 125) సెంచరీలతో దుమ్మురేపడంతో.. బుధవారం జరిగిన రెండో వన్డేలో ఇండియా 170 రన్స్ భారీ తేడాతో అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. దాంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను హోమ్ టీమ్ 2–0తో సొంతం చేసుకుంది. టాస్ ఓడిన ఇండియా 49.5 ఓవర్లలో 402 రన్స్ చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (48) బాధ్యతాయుతంగా ఆడినా.. యశస్వి జైస్వాల్ (4) నిరాశపర్చాడు.
గిల్‌తో కలిసి రెండో వికెట్‌కు 87 రన్స్ జత చేసి హిట్‌మ్యాన్ వెనుదిరిగాడు. ఈ దశలో వచ్చిన ఇషాన్.. అఫ్గాన్ బౌలింగ్‌ను ఉతికి ఆరేశాడు. 52 బాల్స్‌లో తొలి హాఫ్ సెంచరీ చేసిన ఇషాన్ తర్వాతి 50 రన్స్‌ను 19 బాల్స్‌లోనే పూర్తి చేశాడు. ఈ ఇద్దరు మూడో వికెట్‌కు 224 రన్స్ జోడించారు. శ్రేయస్ అయ్యర్ (26), 43వ ఓవర్‌లో వరుస బాల్స్‌లో గిల్, కేఎల్ రాహుల్ (0) వెనుదిరిగారు. చివర్లో గుర్నూర్ బ్రార్ (3), అర్ష్‌దీప్ సింగ్ (3), సుందర్ (19), ప్రిన్స్ యాదవ్ (5) ఔటయ్యారు. నంగ్యాలియా ఖరోటే 4, రషీద్ ఖాన్ 3 వికెట్లు తీశారు. ఛేజింగ్‌లో అఫ్గానిస్తాన్ 44.3 ఓవర్లలో 232 రన్స్‌కే ఆలౌటైంది.
రహమత్ షా (79) టాప్ స్కోరర్. స్టార్టింగ్ నుంచే ఇండియా బౌలర్లు అర్ష్‌దీప్ సింగ్ (3/45), గుర్నూర్ బ్రార్ (3/60), ప్రిన్స్ యాదవ్ (2/56) కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో అఫ్గాన్ బ్యాటర్లు రన్స్ చేయడంలో విఫలమయ్యారు. రహమానుల్లా గుర్బాజ్ (41), సెడిఖుల్లా అటల్ (42), ఇబ్రహీం జద్రాన్ (21) మోస్తరుగా ఆడారు. గిల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
