
న్యూఢిల్లీ: ఇండియా, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల వేళ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది భారత్ వేదికగా జరగాల్సిన ఆసియా కప్ నుంచి వైదొలగాలని బీసీసీఐ నిర్ణయించినట్లు సమాచారం. బీసీసీఐ తన నిర్ణయాన్ని ప్రస్తుతం పాకిస్తాన్ క్రీడా మంత్రి మొహ్సిన్ నఖ్వీ నేతృత్వంలోని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC)కి ఇప్పటికే తెలియజేసినట్లు టాక్. పాకిస్తాన్ మంత్రి నేతృత్వం వహిస్తున్న ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) నిర్వహించే ఏ ఈవెంట్లలో పాల్గొనకూడదన్న నిర్ణయంలో భాగంగానే ఆసియా కప్‌తో పాటు ఇతర టోర్నీల నుంచి తప్పుకుంటున్నట్లు బీసీసీఐ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది పౌరులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టి.. ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు చేసింది. ఈ దాడులకు కౌంటర్‌గా పాక్ కూడా భారత్‌పై ప్రతి దాడులకు ప్రయత్నించింది. ఈ పరిణామాలతో భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ క్రీడా మంత్రి మొహ్సిన్ నఖ్వీ నేతృత్వంలోని ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్వహిస్తోన్న 2025 ఆసియా కప్ టోర్నీలో పాల్గొనవద్దని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.
‘‘ప్రస్తుతం పాకిస్తాన్ క్రీడా మంత్రి మొహ్సిన్ నఖ్వీ అధ్యక్షత వహిస్తున్న ఏసీసీ నిర్వహిస్తున్న టోర్నమెంట్‌లో భారత జట్టు పాల్గొనదు. ఇది దేశం కోసం తీసుకున్న నిర్ణయం. పురుషుల ఆసియా కప్‌తో పాటు, జూన్‌లో శ్రీలంకలో జరగనున్న మహిళల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్‌కు కూడా భారతదేశం జట్టును పంపదు’’ అని బీసీసీఐ ఏసీసీకి లేఖ రాసినట్లు సమాచారం.
►ALSO READ | బోర్డియక్స్ టోర్నీ రన్నరప్‌గా భాంబ్రీ జోడీ
పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు చైర్మన్‌గా ఉన్న మొహిసిన్ నఖ్వీ ఇటీవలే ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) చైర్మన్‌గా ఎన్నికయ్యాడు. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ సభ్య దేశాలుగా ఉన్నా ఆసియా క్రికెట్ కౌన్సిల్‌లో చైర్మన్ ఎంపిక ప్రక్రియ రోస్టర్ విధానంలో ఉంటుంది. ఈ సారి పాక్ వంతు కావడంతో మొహిసిన్ నఖ్వీ ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. ఆసియా కప్‌తో పాటు ఇతర కొన్ని టోర్నీలు ఏసీసీ ఆధ్వర్యంలో జరుగుతాయి.
ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరగనున్న పురుషుల ఆసియా కప్‌కు అతిథ్యం ఇచ్చేది భారతే. కానీ పాక్‌తో ఉద్రిక్తతల వేళ.. ఆ దేశ వ్యక్తి చైర్మన్‌గా ఉన్న ఏసీసీ నిర్వహిస్తోన్న టోర్నీలకు దూరంగా ఉండాలని బీసీసీఐ నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే ఆసియా కప్ 2025ను వైదొలుగాలని డిసైడ్ అయ్యింది. ఆసియా కప్‌లో హాట్ ఫేవరెట్ టీమ్ భారత్. అలాంటిది ఈ టోర్నీలో టీమిండియా లేకపోతే.. టోర్నీ జరగడం కష్టమే. టోర్నీలో భారత్ లేకపోతే పెద్దగా స్పాన్సర్ ముందు రారు.. అభిమానులు కూడా చూసేందుకు ఇష్టం పడరు. మరీ టోర్నీ జరగడానికి ఇంకొన్ని నెలల సమయం ఉండటంతో అప్పటి వరకు ఏం జరుగుతుందో చూడాలి.