ఇండియా విమెన్స్‌‌‌‌ గోల్డెన్​ హిస్టరీ.. ఫైనల్లో 3–2తో థాయ్‌‌‌‌లాండ్‌‌‌‌పై గెలుపు

ఇండియా విమెన్స్‌‌‌‌ గోల్డెన్​ హిస్టరీ.. ఫైనల్లో  3–2తో థాయ్‌‌‌‌లాండ్‌‌‌‌పై గెలుపు
  • ఆసియా బ్యాడ్మింటన్‌‌‌‌లో ఇండియాకు తొలి గోల్డ్‌‌‌‌             
  • మెరిసిన సింధు, గాయత్రి

షా ఆలమ్‌‌‌‌ (మలేసియా): బ్యాడ్మింటన్‌‌‌‌ ఆసియా టీమ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో ఇండియా విమెన్స్‌‌‌‌ టీమ్‌‌‌‌ కొత్త చరిత్ర సృష్టించింది. గతంలో సిల్వర్ కూడా నెగ్గలేకపోయిన మన టీమ్ తొలిసారి గోల్డ్‌‌‌‌ మెడల్‌‌‌‌తో మెరిసింది. ఆదివారం హోరాహోరీగా జరిగిన ఫైనల్లో ఇండియా 3–2తో థాయ్‌‌‌‌లాండ్‌‌‌‌ను ఓడించింది. దీంతో 2016, 2020లో మెన్స్‌‌‌‌ టీమ్‌‌‌‌ నెగ్గిన బ్రాంజ్‌‌‌‌ మెడల్‌‌‌‌ హిస్టరీని తిరగరాసింది. తొలి సింగిల్స్‌‌‌‌లో పీవీ సింధు 21–12, 21–12తో  వరల్డ్‌‌‌‌ 17వ ర్యాంకర్‌‌‌‌ సుసానిడా కటెథాంగ్‌‌‌‌పై నెగ్గి 1–0తో శుభారంభాన్నిచ్చింది. 

5–1 లీడ్‌‌‌‌తో తొలి గేమ్‌‌‌‌ను మొదలుపెట్టిన తెలుగమ్మాయి 8–2, 11–4, 18–9తో ముందుకెళ్లింది. ఇక రెండో గేమ్‌‌‌‌లోనూ ఇదే జోరు కొనసాగించిన  సింధు కొట్టిన క్రాస్‌‌‌‌ కోర్టు యాంగిల్‌‌‌‌ షాట్లు తీయలేక సుపానిడా ఎక్కువగా అనవసర తప్పిదాలు చేసింది. డబుల్స్‌‌‌‌ తొలి మ్యాచ్‌‌‌‌లో ట్రీసా జాలీ– పుల్లెల గాయత్రి 21–16, 18–21, 21–16తో వరల్డ్‌‌‌‌ పదో ర్యాంకర్లు జోంగ్‌‌‌‌కోల్ఫాన్– రవింద ప్రజోంగ్‌‌‌‌జైపై నెగ్గి లీడ్‌‌‌‌ను 2–0కు పెంచారు. 

రెండో సింగిల్స్‌‌‌‌లో అష్మితా చాలిహా 11–21, 14–21తో బుసానన్ చేతిలో, రెండో డబుల్స్‌‌‌‌లో ప్రియా–శ్రుతి మిశ్రా 11–21, 9–21తో బెన్యాపా–నుటకర్న్‌‌‌‌ ఐమ్‌‌‌‌సార్డ్‌‌‌‌ చేతిలో ఓడారు. దీంతో ఇరుజట్ల స్కోరు 2–2తో సమమైంది. ఈ దశలో మూడో సింగిల్స్‌‌‌‌ ఆడిన అన్మోల్‌‌‌‌ ఖర్బ్‌‌‌‌ అద్భుతం చేసింది. 21–14, 21–9తో పొర్న్‌‌‌‌పిచా చోయికీవాంగ్‌‌‌‌ను ఓడించింది. ఈ టోర్నీలో మూడోసారి డిసైడర్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ ఆడిన 17 ఏండ్ల అన్మోల్‌‌‌‌ ఆరంభంలో కాస్త తడబడింది. దీంతో 3–6తో తొలి గేమ్‌‌‌‌ను మొదలుపెట్టి క్రమంగా 11–10 లీడ్‌‌‌‌లోకి వచ్చింది. సీనియర్ల సలహాలు, సూచనలు తీసుకుని ఓపికగా ర్యాలీస్‌‌‌‌ ఆడిన అన్మోల్ 17–13తో ముందంజ వేసింది. చివరకు నాలుగు వరుస పాయింట్లతో గేమ్‌‌‌‌ను ముగించింది. రెండో గేమ్‌‌‌‌లోనూ అదే జోరును చూపిస్తూ 6–5, 11–5తో దూసుకుపోయింది. ఇక్కడి నుంచి 12 మ్యాచ్‌‌‌‌ పాయింట్లపై నిలిచి ఇండియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించింది. ఇండియా విమెన్స్‌‌ టీమ్‌‌ను ప్రధాని మోదీ సహా పలువురు అభినందించారు.