మూడో టెస్టు​లో ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌పై 434 రన్స్‌‌‌‌‌‌‌‌ తేడాతో ఇండియా ఘన విజయం

మూడో టెస్టు​లో ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌పై 434 రన్స్‌‌‌‌‌‌‌‌ తేడాతో ఇండియా ఘన విజయం
  •     జైస్వాల్ డబుల్ సెంచరీ, జడేజాకు ఐదు వికెట్లు
  •     557 ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో 122 స్కోరుకే ఇంగ్లండ్ ఆలౌట్

రాజ్‌‌‌‌‌‌‌‌కోట్‌‌‌‌‌‌‌‌: బజ్‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌ గేమ్‌‌‌‌‌‌‌‌తో టెస్టు క్రికెట్‌‌‌‌‌‌‌‌లో దూసుకెళ్తున్న ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ను టీమిండియా చావు దెబ్బకొట్టింది. మరోసారి బజ్‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌ పేరెత్తాలంటేనే వణుకు పుట్టేలా చేసింది. యంగ్‌స్టర్ యశస్వి జైస్వాల్‌‌‌‌‌‌‌‌ (236 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 14 ఫోర్లు, 12 సిక్సర్లతో 214 నాటౌట్) సెన్సేషనల్ డబుల్ సెంచరీకి తోడు హోమ్ గ్రౌండ్‌‌లో రవీంద్ర జడేజా (5/41) ఐదు వికెట్లతో  చెలరేగడంతో  నాలుగు రోజుల్లోనే ముగిసిన మూడో టెస్టులో  434 రన్స్ తేడాతో  ఇంగ్లండ్‌‌ను చిత్తు చేసింది. 

రన్స్  పరంగా తమ టెస్టు క్రికెట్ చరిత్రలో  అతి పెద్ద విజయంతో రికార్డు సృష్టించింది. ఐదు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల సిరీస్‌‌‌‌‌‌‌‌లో 2–1తో ఆధిక్యంలోకి వచ్చింది. ఆదివారం ఇండియా ఇచ్చిన 557 రన్స్‌‌‌‌‌‌‌‌ టార్గెట్‌‌‌‌‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 122 స్కోరుకే కుప్పకూలింది. పదో నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వచ్చిన మార్క్‌‌‌‌‌‌‌‌ వుడ్ (33) టాప్‌‌‌‌‌‌‌‌ స్కోరర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచాడు. అంతకుముందు ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నైట్ స్కోరు 196/2తో ఆట కొనసాగించిన ఇండియా రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ను 430/4 వద్ద డిక్లేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి ప్రత్యర్థికి భారీ టార్గెట్‌‌‌‌‌‌‌‌ను ఇచ్చింది. వెన్నునొప్పి నుంచి కోలుకొని తిరిగి బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు వచ్చిన యశస్వి జైస్వాల్ వరుసగా రెండో డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. శుభ్‌‌‌‌‌‌‌‌మన్ గిల్ (91) , సర్ఫరాజ్ ఖాన్ (68 నాటౌట్‌‌‌‌‌‌‌‌) కూడా రాణించారు. సెంచరీతో పాటు రెండు ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ల్లో కలిపి ఏడు వికెట్లు పడగొట్టిన జడేజా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌గా నిలిచాడు. నాలుగో టెస్టు ఈ నెల 23 నుంచి రాంచీలో జరుగుతుంది.

జైస్వాల్ డబుల్‌‌‌‌‌‌‌‌ ధమాకా

మూడో రోజే పటిష్ఠ స్థితిలో నిలిచిన ఇండియాకు జైస్వాల్, గిల్, సర్ఫరాజ్‌‌‌‌‌‌‌‌ భారీ స్కోరు అందిం చారు. ఉదయం తొలి గంటలో గిల్‌‌‌‌‌‌‌‌తో పాటు కుల్దీప్‌‌‌‌‌‌‌‌ (27) ఇంగ్లండ్ బౌలర్లకు సవాల్ విసిరా డు. హార్ట్‌‌‌‌‌‌‌‌లీ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో క్రీజు దాటొచ్చి సిక్స్ కొట్టాడు. మరోవైపు తన క్లాస్‌‌‌‌‌‌‌‌ ఆటతో గిల్ 90ల్లోకి వచ్చి సెంచరీ చేసేలా కనిపించాడు. కానీ, కుల్దీప్‌‌‌‌‌‌‌‌ తప్పిదంతో తను రనౌట్‌‌‌‌‌‌‌‌ అవ్వడంతో నాలుగో వికెట్‌‌‌‌‌‌‌‌కు 55 రన్స్‌‌‌‌‌‌‌‌ పార్ట్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ బ్రేక్ అయింది. కాసేపటికే రెహాన్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో కుల్దీప్‌‌‌‌‌‌‌‌ కూడా ఔటవగా... యశస్వి–సర్ఫరాజ్ ఆట మొదలైంది. 

అప్పటికే లీడ్ 380 దాటగా ఈ ఇద్దరూ ఇంగ్లిష్ బౌలర్లపై ఎదురుదాడి చేశారు. 314/4తో లంచ్‌‌‌‌‌‌‌‌కు వెళ్లొచ్చిన వెంటనే 150 మార్కు దాటిన  యశస్వి భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. పేసర్ అండర్సన్‌‌‌‌‌‌‌‌ ఓవర్లో హ్యాట్రిక్ సిక్సర్లతో రెచ్చిపోయాడు. మరోవైపు సర్ఫరాజ్ 65 బాల్స్‌‌‌‌‌‌‌‌లోనే  ఫిఫ్టీ అందుకున్నాడు. రూట్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో సింగిల్‌‌‌‌‌‌‌‌తో డబుల్ సెంచరీ దాటిన (231 బాల్స్‌‌‌‌‌‌‌‌) యశస్వి అదే ఓవర్లో రెండు సిక్సర్లు కొట్టాడు. రెహాన్ వేసిన తర్వాతి ఓవర్లో సర్ఫరాజ్ 6,4,6తో అలరించాడు. లీడ్‌‌‌‌‌‌‌‌ 550 దాటడంతో కెప్టెన్ రోహిత్ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ను డిక్లేర్ చేశాడు.

జడేజా స్పిన్ మ్యాజిక్

భారీ టార్గెట్ ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో  ఇంగ్లండ్ ఏ దశలోనూ ఇండియాకు కనీస పోటీ ఇవ్వలేకపోయింది. తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో మెరుపు సెంచరీ కొట్టిన బెన్ డకెట్‌‌‌‌‌‌‌‌ (4)  రనౌటవడంతో ఇండియా ఫస్ట్ బ్రేక్ లభించింది. ఆవెంటనే మరో ఓపెనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జాక్ క్రాలీ (11)ని బుమ్రా ఎల్బీ చేశాడు. 18/2తో టీ బ్రేక్‌‌‌‌‌‌‌‌కు వెళ్లొచ్చిన ఇంగ్లిష్ టీమ్ ఆటలో మార్పు రాలేదు. జో రూట్ (40 బాల్స్‌‌‌‌‌‌‌‌లో7) బజ్‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌ ఆటను పక్కనబెట్టి డిఫెన్స్‌‌‌‌‌‌‌‌ ఆడినా ప్రయోజనం లేకపోయింది. మరో ఎండ్‌‌‌‌‌‌‌‌లో జడేజా వరుసగా వికెట్లు పడగొట్టాడు. అతనికి కుల్దీప్‌‌‌‌‌‌‌‌, బుమ్రాతో పాటు కుటుంబంలో అత్యవసర పనిని పూర్తి చేసుకొని తిరిగి టీమ్‌‌‌‌‌‌‌‌లో చేరిన అశ్విన్ నుంచి మంచి సపోర్ట్ లభించింది. 

జడేజా బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో స్వీప్‌‌‌‌‌‌‌‌షాట్‌‌‌‌‌‌‌‌కు ట్రై చేసి పేలవ ఫామ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న బెయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టో (4) ఎల్బీ అవగా.. ఒలీ పోప్ (5) రోహిత్‌‌‌‌‌‌‌‌కు క్యాచ్ ఇచ్చాడు. కాసేపు క్రీజులో నిలిచిన రూట్ కూడా జడేజా బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో స్వీప్ షాట్ ఆడబోయి ఎల్బీగా వెనుదిరిగాడు. రూట్ మాదిరిగా స్వీప్ మిస్సయిన కెప్టెన్‌‌‌‌‌‌‌‌ స్టోక్స్‌‌‌‌‌‌‌‌ (15) కుల్దీప్‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌కు వికెట్ల ముందు దొరికిపోయాడు. తన తర్వాతి ఓవర్లోనే రహాన్ (0)ను కుల్దీప్ డకౌట్ చేయడంతో ఇంగ్లండ్ 50/7తో నిలిచింది. ఈ దశలో మార్క్‌‌‌‌‌‌‌‌ వుడ్‌‌‌‌‌‌‌‌తో పాటు  బెన్ ఫోక్స్ (16), హార్ట్‌‌‌‌‌‌‌‌లీ (16) కాసేపు ప్రతిఘటించి స్కోరు వంద దాటించారు. అశ్విన్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో హార్ట్‌‌‌‌‌‌‌‌లీ వెనుదిరగ్గా.. ఫోక్స్‌‌‌‌‌‌‌‌తో పాటు వుడ్‌‌‌‌‌‌‌‌ను పెవిలియన్‌‌‌‌‌‌‌‌ చేర్చిన జడేజా మ్యాచ్‌‌‌‌‌‌‌‌ను ముగించాడు.

ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఇండియా విక్టరీ మార్జిన్.

 రన్స్ పరంగా ఇదే అతి పెద్ద విజయం. 2021లో వాంఖడేలో న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌పై 372 రన్స్‌‌‌‌‌‌‌‌ తేడాతో గెలిచిన రికార్డును మెరుగు పరుచుకుంది.

టెస్టుల్లో తొలి మూడు సెంచరీలను 150 ప్లస్ స్కోర్లుగా (171, 209, 214*) మలిచిన తొలి ఇండియన్‌‌‌‌‌‌‌‌ జైస్వాల్

రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో జైస్వాల్ కొట్టిన సిక్సర్లు. ఒక టెస్టు ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో  ఎక్కువ సిక్సర్లు సాధించిన ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పాక్ లెజెండ్ వసీం అక్రమ్ రికార్డును సమం చేశాడు.

ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌పై ఇండియా కొట్టిన సిక్సర్లు. ఒక టెస్టు మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో జట్టుకు అత్యధికం. 2019లో సౌతాఫ్రికాపై 27 సిక్సర్లతో తన పేరిటే ఉన్న రికార్డును బ్రేక్ చేసింది. 

టెస్టుల్లో ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌పై ఇండియా విజయాలు. 

ఆ జట్టుపై ఎక్కువ విజయాలు సాధించిన టీమ్‌గా నిలిచింది. 32 విక్టరీలతో ఆస్ట్రేలియా రెండో ప్లేస్‌‌‌‌‌‌‌‌కు వెళ్లింది.

సంక్షిప్త స్కోర్లు

ఇండియా తొలి ఇన్నింగ్స్: 445 ఆలౌట్; 

ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌: 319 ఆలౌట్; 
ఇండియా రెండో ఇన్నింగ్స్: 98 ఓవర్లలో 430/4 డిక్లేర్డ్ (జైస్వాల్ 214*, గిల్ 91, హార్ట్‌‌‌‌‌‌‌‌లీ 1/78)
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ (టార్గెట్ 557): 39.4 ఓవర్లలో 122 ఆలౌట్ (మార్క్‌‌‌‌‌‌‌‌ వుడ్ 33, జడేజా 5/41, కుల్దీప్ 2/19).