IND vs ENG 2025: ఓవల్ టెస్టులో టీమిండియా అద్భుతం.. ఇంగ్లాండ్‌పై 6 పరుగుల తేడాతో సంచలన విజయం

IND vs ENG 2025: ఓవల్ టెస్టులో టీమిండియా అద్భుతం.. ఇంగ్లాండ్‌పై 6 పరుగుల తేడాతో సంచలన విజయం

ఓవల్ టెస్టులో టీమిండియా అద్భుతం చేసింది. ఇంగ్లాండ్ పై థ్రిల్లింగ్ విక్టరీ కొట్టి సిరీస్ ను సమం చేసింది. ఐదో రోజు విజయానికి నాలుగు వికెట్లు అవసరం కాగా.. సిరాజ్, ప్రసిద్ కృష్ణ అద్భుత బౌలింగ్ తో టీమిండియాకు సంచలన విజయాన్ని అందించారు. ఇంగ్లాండ్ పై ఓడిపోయే టెస్టులో 6 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ అందుకుంది. 374 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 367 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ విజయంతో టెండూల్కర్- ఆండర్సన్ ట్రోఫీ 2-2 తో సమంగా నిలిచింది. 

6 వికెట్ల నష్టానికి 339 పరుగులతో ఐదో రోజు బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ కు మంచి ఆరంభం దక్కింది. తొలి ఓవర్ లోనే ఓవర్ టన్ రెండు ఫోర్లు కొట్టి ఊపు మీద కనిపించాడు. ఈ సమయంలో సిరాజ్ బంతితో మెరుగ్గా రాణించాడు. వరుసగా రెండు వికెట్లు తీసి ఇంగ్లాండ్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత జోష్ టంగ్ ను ప్రసిద్ కృష్ణ బౌల్డ్ చేసి 9 వికెట్ పడగొట్టాడు. టీమిండియా విజయం లాంఛనం అనుకున్నప్పుడు అట్కిన్సన్ సిక్సర్ తో టీమిండియాను భయపెట్టాడు. అయితే సిరాజ్ చివరి వికెట్ తీయడంతో టీమిండియా సంచలన విజయాన్ని అందుకుంది.   

ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా తొలి ఇన్నింగ్స్ 224 పరుగులకు ఆలౌటైంది. కరుణ్ నాయర్ 57 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిస్తే.. ఇంగ్లాండ్ పేసర్ అట్కిన్సన్ 5 వికెట్లు పడగొట్టాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ 247 పరుగులకే పరిమితమైంది. సిరాజ్, ప్రసిద్ కృష్ణ తలో నాలుగు వికెట్లు పడగొట్టారు. దీంతో ఇంగ్లాండ్ కు తొలి ఇన్నింగ్స్ లో 23 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది. రెండో ఇన్నింగ్స్ లో జైశ్వాల్ (118) సెంచరీతో ఇండియా 396 పరుగులు చేసింది. టంగ్ ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. 374 పరుగుల ఛేజింగ్ లో ఇంగ్లాండ్ 367 పరుగులకు ఆలౌటైంది.