
ఆసియా కప్ తొలి మ్యాచ్ లో టీమిండియా అదిరిపోయే విజయాన్ని అందుకుంది. బుధవారం (సెప్టెంబర్ 10) దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో యూఏఈతో జరిగిన మ్యాచ్ లో 9 వికెట్ల తేడాతో విజయం సాధించారు. టీమిండియా ధాటికి ఆతిధ్య జట్టుకు ఘోర పరాభవమే మిగిలింది. మొదట బౌలింగ్ లో చెలరేగిన భారత జట్టు ఆ తర్వాత స్వల్ప ఛేజింగ్ లో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి టార్గెట్ ఛేజ్ చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన యూఏఈ 13.1 ఓవర్లలో 57 పరుగులకే ఆలౌట్ అయింది. లక్ష్య ఛేదనలో ఇండియా 4.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 60 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది.
4.3 ఓవర్లలోనే ఛేజింగ్ ఫినిష్:
58 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా తొలి ఓవర్ నుంచే ధాటిగా ఆడింది. ఓపెనర్ అభిషేక్ శర్మ మొదటి బంతికే సిక్సర్ కొట్టి తనదైన శైలిలో ఇన్నింగ్స్ ఆరంభించాడు. రెండో ఓవర్లో 15, మూడో ఓవర్లో 13 పరుగులు రావడంతో మొదటి 3 ఓవర్లలోనే ఇండియా 38 పరుగులు చేసింది. నాలుగు ఓవర్లో 16 పరుగులు రాబట్టిన ఇండియా.. ఓపెనర్ అభిషేక్ శర్మ (30) వికెట్ కోల్పోయింది. ఐదో ఓవర్లో గిల్ బౌండరీతో మ్యాచ్ ను ఫినిష్ చేశాడు. అభిషేక్ 16 బంతుల్లో 30 పరుగులు చేయగా.. గిల్ 20 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన యూఏఈ 13.1 ఓవర్లలో కేవలం 57 పరుగులకే కుప్పకూలింది. 22 పరుగులు చేసిన ఓపెనర్ అలీషన్ షరాఫు టాప్ స్కోరర్ గా నిలిచాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. శివమ్ దూబేకు మూడు వికెట్లు దక్కాయి. బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ పడగొట్టారు. యూఏఈ బ్యాటింగ్ లైనప్ లో ఏకంగా 8 మంది సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు.
ముఖ్యంగా పవర్ ప్లే తర్వాత టీమిండియా స్పిన్నర్ల ధాటికి ఆతిధ్య జట్టు పూర్తిగా చేతులెత్తేసింది. 9 ఓవర్లో కుల్దీప్ యాదవ్ ఏకంగా మూడు వికెట్లు తీయడంతో యూఏఈ పీకల్లోతు కష్టాల్లో పడింది. 50 పరుగులకే సగం జట్టుకు కోల్పోయింది. ఆ ఆతర్వాత ఆల్ రౌండర్ శివమ్ దూబే తన సూపర్ బౌలింగ్ తో మెరిశాడు. మూడు వికెట్లు తీసి యూఏఈని కోలుకోనీయకుండా చేశాడు. చివరి 8 వికెట్లను యూఏఈ కేవలం 10 పరుగుల వ్యవధిలో కోల్పోవడం మ్యాచ్ కే హైలెట్ గా నిలిచింది.