బెంగళూరు: టీమిండియాలో రీ ఎంట్రీ కోసం చూస్తున్న డ్యాషింగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ (17).. సౌతాఫ్రికా–ఎతో జరుగుతున్న తొలి అనధికారిక టెస్టు మ్యాచ్‌లో నిరాశపర్చాడు. ఆయుష్ మాత్రే (65), ఆయుష్ బదోనీ (38), సాయి సుదర్శన్ (32) మోస్తరుగా ఆడటంతో.. శుక్రవారం రెండో రోజు ఇండియా–ఎ తొలి ఇన్నింగ్స్‌లో 58 ఓవర్లలో 234 రన్స్‌కు ఆలౌటైంది. సుదర్శన్, మాత్రే తొలి వికెట్‌కు 90 రన్స్ జోడించి శుభారంభాన్నిచ్చినా మిగతా బ్యాటర్లు చేతులెత్తేశారు.
సఫారీ స్పిన్నర్ సుబ్రాయెన్ (5/61) స్పిన్‌కు ఇండియా లైనప్ కుప్పకూలింది. దేవదత్ పడిక్కల్ (6), రజత్ పటీదార్ (19), పంత్ విఫలమయ్యారు. మధ్యలో బదోనీ నిలబడినా.. రెండో ఎండ్‌లో అతనికి సహకారం కరువైంది. తనుష్ కొటియాన్ (13), మానవ్ సుతార్ (4), అన్షుల్ కాంబోజ్ (5), ఖలీల్ అహ్మద్ (4) నిరాశపర్చారు. లుతో సిపామ్లా 2 వికెట్లు తీశాడు.
75 రన్స్ తొలి ఇన్నింగ్స్ లీడ్‌తో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సౌతాఫ్రికా ఆట ముగిసే టైమ్‌కు 12 ఓవర్లలో 30/0 స్కోరు చేసింది. జోర్డాన్ హెర్మాన్ (12 బ్యాటింగ్), లెసెగో సెనోక్వానే (9 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం సఫారీ జట్టు 105 రన్స్ ఆధిక్యంలో కొనసాగుతోంది. అంతకుముందు సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 91.2 ఓవర్లలో 309 రన్స్‌కు ఆలౌటైంది.
