- నెట్‌ఫ్లిక్స్, డిస్నీ, సోనీ సంస్థల రాక
- 100 మందికి పైగా అంతర్జాతీయ పెట్టుబడిదారులు కూడా..
- సెక్రటేరియెట్‌లో సినీ ప్రముఖులతో మీటింగ్
- సదస్సుకు టాలీవుడ్ సంపూర్ణ మద్దతు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో సినిమా, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్(ఏవీజీసీ-ఎక్స్ఆర్) రంగాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం భారీ సన్నాహాలు చేస్తోంది. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026లో భాగంగా డిసెంబర్ 7 నుంచి 13 వరకు భారత్ ఫ్యూచర్ సిటీలో 15 ఎకరాల విస్తీర్ణంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇండియాజాయ్–2026 వేడుకలు నిర్వహించనుంది.
ఈ మెగా ఈవెంట్‌కు లక్ష మందికి పైగా సందర్శకులు, అంతర్జాతీయ ప్రతినిధులు హాజరవుతారని అంచనా వేస్తుండగా.. ప్రపంచ ప్రఖ్యాత నెట్‌ఫ్లిక్స్, డిస్నీ, సోనీ, అడోబ్, డీఎన్ఈజీ, ఈఏ స్పోర్ట్స్, యూబీసాఫ్ట్లతోపాటు అన్నపూర్ణ స్టూడియోస్, రామోజీ ఫిల్మ్‌సిటీ వంటి 200కు పైగా ప్రముఖ ఎగ్జిబిట్సంస్థలు పాల్గొంటున్నాయి. వెంచర్ క్యాపిటల్ సంస్థలు, ప్రముఖ ఓటీటీ వేదికలు, విదేశీ స్టూడియోలకు చెందిన 100 మందికి పైగా గ్లోబల్ ఇన్వెస్టర్లు, కొనుగోలుదారులు ఇందులో భాగస్వాములు కానున్నారు.
సదస్సులో భాగంగా విజువల్ ఎఫెక్ట్స్ సమ్మిట్, కామిక్ కాన్, ఇండీ గేమ్ ఉత్సవ్, ఓటీటీ పల్స్, ఇండీవుడ్ ఫిల్మ్ మార్కెట్, ఇండియన్ ఫిల్మ్ కాంక్లేవ్, హైదరాబాద్ ఏఐ ఫిల్మ్ ఫెస్టివల్(హెచ్ఏఐఎఫ్ఎఫ్) సహా 15కు పైగా ప్రత్యేక సాంకేతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 8న అంతర్జాతీయ స్థాయి రెడ్‌కార్పెట్ వేడుక జరగనుండగా, 9న ఆస్కార్ అవార్డు గ్రహీత, పద్మశ్రీ ఎం.ఎం. కీరవాణి సంగీత కచేరీల వేదికను ప్రారంభించనున్నారు.
హైదరాబాద్‌కు అపార అవకాశాలు
ఈ మెగా ఈవెంట్ సన్నాహకాలపై మంగళవారం సెక్రటేరియెట్‌లో ఎగ్జిక్యూటివ్ కమిటీ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించింది. ఐటీ శాఖ ప్రభుత్వ జాయింట్ సెక్రటరీ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ.. సృజనాత్మక రంగమైన ఆరెంజ్ ఎకానమీని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు హైదరాబాద్‌కు అపార అవకాశాలున్నాయని చెప్పారు. ఏవీజీసీ పాలసీ, ఇమేజ్ టవర్స్ అభివృద్ధి ద్వారా ప్రభుత్వం పూర్తి ప్రోత్సాహం అందిస్తోందన్నారు. ఈ సదస్సుకు తెలుగు సినీ పరిశ్రమ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.
తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు డి.సురేశ్ బాబు, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు సి.కల్యాణ్, డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీఎన్ ఆదిత్య, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఉపాధ్యక్షుడు డాక్టర్ మాదాల రవి, ప్రముఖ దర్శకులు హరీశ్ శంకర్, సాయి రాజేశ్, నటుడు రాహుల్ రవీంద్రన్ ప్రభుత్వ చొరవను కొనియాడారు. సాంకేతిక రంగ నిపుణులు సనత్(ఫైర్‌ఫ్లై), బాసిరెడ్డి సునీల్ (ఫాంటమ్) అంతర్జాతీయ స్థాయిలో మన సాంకేతికత ఎదుగుతున్న తీరును విశ్లేషించారు.
ఇన్వెస్ట్ తెలంగాణ వ్యూహాత్మక సలహాదారు అచల్ మల్హోత్రా మాట్లాడుతూ.. ఆర్ఆర్ఆర్ చిత్రంతో హైదరాబాద్‌కు దక్కిన ప్రపంచవ్యాప్త ఖ్యాతిని మరింత ముందుకు తీసుకెళ్లేలా గతంలో కంటే పది రెట్ల విస్తృతితో ఇండియా జాయ్–2026ను రూపొందించామని, గ్లోబల్ స్టూడియోలు, విదేశీ పెట్టుబడులకు మన సృజనాత్మక రంగాన్ని అనుసంధానించేందుకు ఇది సువర్ణావకాశమని స్పష్టం చేశారు.
