మొదటిసారిగా.. భౌగోళిక గుర్తింపు పొందిన వస్తువులు

మొదటిసారిగా.. భౌగోళిక గుర్తింపు పొందిన వస్తువులు

పారిశ్రామిక సంపతులకు సంబంధించి రక్షణ కల్పించేందుకు 1883లో ఫ్రాన్స్​ రాజధాని పారిస్​లో మొదటిసారి మేధో సంపతిపై సదస్సు జరిగింది. దీన్నే పారిస్​ కన్వెన్షన్​ అంటారు. ఈ సదస్సులో భౌగోళిక గుర్తింపును మేధో సంపత్తి హక్కుల్లో భాగంగా గుర్తించారు. భారత్​ వాణిజ్య సంబంధ మేధో సంపత్తి హక్కుల ఒప్పందం అనుసరించి భౌగోళిక గుర్తింపు చట్టాన్ని 1999లో తీసుకువచ్చింది. కానీ ఈ చట్టం 2003, సెప్టెంబర్​ 13 నుంచి అమల్లోకి వచ్చింది.

2004–05లో మొదటిసారిగా భౌగోళిక గుర్తింపు పొందిన వస్తువులు

1. డార్జిలింగ్​ టీ (పశ్చిమ బెంగాల్​) 2. అరన్​ముల కన్నడి (కేరళ) 3. పోచంపల్లి ఇక్కత్​ (తెలంగాణ) .
భౌగోళిక గుర్తింపులో భాగంగా నమోదైన వస్తువులు: చేతివృత్తుల ఉత్పత్తులు, పారిశ్రామిక ఉత్పత్తులు, వ్యవసాయ సంబంధ ఉత్పత్తులు, ప్రకృతి ద్వారా సిద్ధించే వస్తువులు, ఆహార పదార్థాలు, తయారీ వస్తువులు భారతదేశంలో భౌగోళిక గుర్తింపునకు సంబంధించి కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య మంత్రిత్వశాఖ నోడల్​ ఏజెన్సీగా పనిచేస్తోంది. దీని ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంది. 

నిర్మల్​ ఆర్ట్​వేర్​

ఏనుగుల వీరస్వామి తన గ్రంథం కాశీయాత్ర చరిత్రలో నిర్మల్​ ప్రాంతం గురించి పేర్కొన్నారు. ఈ గ్రంథంలో నిర్మల్​ బొమ్మలు, పంచపాత్రల గురించి ప్రస్తావించారు. నిర్మల్​ పట్టణం కేంద్రంగా కళాత్మకమైన బొమ్మలు, చిత్రాలు, వస్తువులు తయారవుతాయి. వీటిని నకాష్​లని పిలుస్తారు. తరతరాలుగా తయారయ్యే ఈ కళాత్మక వస్తువులు మూడు ప్రధాన రూపాల్లో ఉంటాయి. అవి నిర్మల్​ బొమ్మలు చేతి వస్తువులు, నిర్మల్​ ఇంటి సామగ్రి, నిర్మల్​ పెయింటింగ్స్​గా ఉన్నాయి. వీటన్నింటినీ కలిపి నిర్మల్​ ఆర్ట్​వేర్​ అంటారు.

 నిర్మల్​ బొమ్మలు, చిత్రకళ, ఫర్నిచర్​ ప్రపంచ ఖ్యాతి పొందాయి. 400 సంవత్సరాల క్రితం నిర్మల్​ను పాలించిన నిమ్మనాయుడు కొయ్య బొమ్మలను తయారుచేసే కళాకారులను తీసుకొచ్చి ఉపాధి కల్పించారు. ఆయన పేరు మీదుగా ఆ పట్టణానికి నిర్మల్​ అనే పేరు వచ్చింది. ఈ నకాషీ కళాకారుల కోసం కసుబా ప్రాంతలో ఇండ్లను నిర్మించారు. 

నిర్మల్​ బొమ్మలు చేతివస్తువులు

నిర్మల్​ కొయ్యబొమ్మలకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. ఈ బొమ్మలు సజీవంగా, సహజంగా కనిపిస్తాయి. ఈ బొమ్మల తయారీకి పొనికి కర్రను ఉపయోగిస్తారు. ఈ పొనికి కర్ర ముఖ్యంగా ఖానాపూర్​ నుంచి మంచిర్యాల మధ్యలో ఉన్న అడవిలో బెల్లంపల్లి, జన్నారం, మంచిర్యాల, నేరడిగొండ, బోధ తదితర అటవీ ప్రాంతాల్లో లభిస్తుంది. హైదరాబాద్​లోని గోల్కొండ ఎంపోరియం ద్వారా విదేశాలకు నిర్మల్​ బొమ్మలను ఎగుమతి చేస్తున్నారు. నిర్మల్​ బొమ్మలలో దేవుడి బొమ్మలు, రాధాకృష్ణులు, గిరిజన మహిళ, బుద్ధుడు, గణేశుడు, మొదలైనవి ఉంటాయి. అలాగే, చేతి వస్తువుల్లో నిర్మల్​ గాజుపెట్టె, నిర్మల్​ ఆభరణాల పెట్టె, ఎన్వలప్ రాక్​, పెన్సిల్​ డబ్బా, సిగార్​ బాక్స్​, పేపర్​ పెన్సిల్​ స్టాండ్​ మొదలైనవి ఉంటాయి. 

నిర్మల్​ పెయింటింగ్స్​

నిర్మల్​ పెయింటింగ్స్​, బొమ్మలు ఒక కుటీర పరిశ్రమగా ఏర్పడి ప్రపంచ ప్రఖ్యాతి చెందాయి. ఇక్కడి పెయింటింగ్​ను డెకో పెయింటింగ్​తో వేయడం ప్రత్యేకత. నిర్మల్​ పెయింటింగ్​లో బ్లాక్​ పెయింటింగ్​ బ్యాక్​గ్రౌండ్​గా రావడం ప్రత్యేకంగా చెప్పవచ్చు. డెకో పెయింటింగ్​ రాకముందు సహజమైన రంగులను తయారు చేసేవారు. తెలుపు రంగు కోసం గవ్వలు, పసుపు రంగు కోసం పసుపు, ఎరుపు రంగు కోసం మోదుగు పూలు ఉపయోగించేవారు. 

నలుపు రంగుకోసం దీపంపెట్టి దానిపై ఓ పాత్రను ఉంచేవారు. దానితో వచ్చే మసిని నలుపు రంగు కోసం వాడేవారు. నిర్మల్​ కళాకారుల నైపుణ్యంలో ఇండియన్​ మొఘల్స్​ స్కూల్ ఆఫ్​ ఆర్ట్​ శైలి స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా రామాయణం, మహాభారతం వంటి పురాణాలపైన వేసిన ఆయిల్​ పెయింటింగ్స్​, ఫుడ్​ పెయింటింగ్స్​ ప్రపంచ ప్రఖ్యాతి గాంచాయి. 

నిర్మల్​ ఇంటి సామగ్రి

నిర్మల్​ ఇంటి సామగ్రితోపాటు సోఫాలు, కుర్చీలు, డైనింగ్​ టేబుల్,​ విభజన తెరలు, స్టూల్స్​, దీవాన్​ మంచాలు, ట్రేలు, యాష్​ ట్రేలు, ల్యాంప్​ షేడ్స్​, ఎగ్జిక్యూటివ్​ ఆఫీస్ సెట్​, లోలెవల్​ సోఫాసెట్, రాజస్థానీ సోఫాసెట్, ట్రాలీ, డ్రెస్సింగ్​ టేబుల్​, రాజస్థానీ పెన్​ టేబుల్​, ఫ్రెంచ్​ పెట్​ టేబుల్​ మొదలైనవి ఉన్నాయి.

టీహెచ్​డీసీఎల్

కళాత్మక హస్తకళలు, వస్త్రాల అభివృద్ధి మార్కెట్​ను ప్రోత్సహించడంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా లక్ష మందికి పైగా హస్త కళాకారుల సంక్షేమం పెంచడం ప్రాథమిక లక్ష్యం. తెలంగాణ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్​ లిమిటెడ్(టీహెచ్​​డీఎస్​ఎల్​)​ రాష్ట్రంలో ఏడు అమ్మకపు వాణిజ్య కేంద్రాలను, న్యూఢిల్లీ, కలకత్తాలో ఒక్కోటి, హైదరాబాద్​లో ఒక ఉత్పత్తి కేంద్రాన్ని గోల్కొండ హస్తకళల బ్రాండ్​ పేరుతో నిర్వహిస్తుంది.

తెలంగాణ హస్తకళల ట్రేడ్​మార్క్​గా గోల్కొండ లోగో

తెలంగాణ రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ ట్రేడ్​ మార్క్​గా గోల్కొండ లోగోను తెలంగాణ ప్రభుత్వం ఎంపిక చేసింది. తెలంగాణ స్టేట్​ హ్యాండీ క్రాప్ట్స్​ డెవలప్​మెంట్​ కార్పొరేషన్​ లిమిటెడ్ ద్వారా అమ్మకాలు సాగించే ప్రతి వస్తువుపై గోల్కొండ లోగో ఉంటుంది.     

పోచంపల్లి చేనేత పార్క్​

ఇండియా హ్యాండ్లూమ్​ బ్రాండ్​ను సాధించడం ద్వారా పోచంపల్లి చేనేత వస్త్రానికి దేశంలోనే అరుదైన గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వం 2015, ఆగస్టు 7న ప్రవేశపెట్టిన ఈ బ్రాండ్​ తొలిసారిగా పోచంపల్లి పార్క్​ ఇక్కత్​ వస్త్రాలకు దక్కింది.

చేర్యాల స్క్రోల్​ పెయింటింగ్స్​

రమ్యమైన జానపద శైలిలో వస్త్రంపై చిత్రీకరించి, పౌరాణిక గాథను కళ్లకు కట్టినట్లు విశదీకరించే చేర్యాల్​ స్ర్రోల్​ పెయింటింగ్స్​కు తెలంగాణ ప్రసిద్ధి. చేర్యాల పెయింటింగ్స్​ కళాకారులను నకాషీలు అంటారు. వీటిని థీమ్​ పెయింటింగ్ అని కూడా వ్యవహరిస్తారు. జానపద జీవిత కథలు, పురాణ గాథలు వీటిలో ఇతివృత్తాలుగా ఉంటాయి. 

సిద్దిపేట జిల్లాలో చేర్యాల గ్రామం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన స్కోల్​ పెయింటింగ్స్​కు ప్రసిద్ధి చెందింది. చేర్యాల పెయింటింగ్స్​లో పురాణాలు, ఇతిహాసాలను డిజైన్లుగా తీసుకుని మట్టి రంగులతో గోడకు వేలాడదీసే పెయింటింగ్స్​ వేస్తారు

భౌగోళిక గుర్తింపు పొందిన వస్తువులు    సంవత్సరం    ప్రసిద్ధి చెందిన ప్రాంతం

1.    పోచంపల్లి ఇక్కత్​ చేనేత వస్త్రాలు    2004–05    భూదాన్​ పోచంపల్లి
2.     కరీంనగర్​ సిల్వర్​ ఫిలిగ్రీ    2007–08    కరీంనగర్
3.     నిర్మల్​ బొమ్మలు    2008–09    నిర్మల్​
4.     నిర్మల్​ చిత్రకళలు    2008–09    నిర్మల్​
5.     నిర్మల్​ ఫర్నిచర్​    2008–09    నిర్మల్​
6.     చేర్యాల చిత్రకళలు    2010–11    సిద్దిపేట
7.     పెంబర్తి మెట్​ క్రాఫ్ట్స్​    2010–11    జనగామ
8.    గద్వాల్​ చీరలు    2010–11    గద్వాల్​
9.    హైదరాబాద్​ హలీం    2010–11    హైదరాబాద్​
10.    సిద్దిపేట గొల్లభామ చీరలు    2011–12    సిద్దిపేట
11.    నారాయణపేట చేనేత వస్త్రాలు    2012–13    నారాయణపేట
12.     డోక్రమెటల్    2017–18    ఆదిలాబాద్​
13.    డర్రీస్​    2017–18    వరంగల్​
14.    ఇక్కత్​ చీరలు    2017–18    పోచంపల్లి
15.     తేలియా రుమాల్​    2019–20    యాదాద్రి భువనగిరి
16.      తాండూర్​ కందిపప్పు    2023–24    తాండూర్​    
17.     లక్కగాజులు    2023–24    హైదరాబాద్​
18.    వరంగల్ చపాట మిరపకాయ    2024–25     వరంగల్​