చండీగఢ్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. భారతీయ వైమానిక దళం 90వ వార్షిక దినోత్సవంలో ఎయిర్ షోలు, పరేడ్లు ఆకట్టుకున్నాయి. దాదాపు 80 విమానాలతో నిర్వహించిన ఎయిర్ షోను అదుర్స్ అనిపించింది. మరోవైపు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే సందర్భంగా ఎయిర్ స్టాఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి కొత్త యూనిఫామ్‌ను ఆవిష్కరించారు. అంతేకాకుండా IAFలోని అధికారుల కోసం వెపన్ సిస్టమ్ బ్రాంచ్‌ను రూపొందించడానికి కేంద్రం ఆమోదం తెలిపిందని వీఆర్ చౌదరి ప్రకటించారు.
ఆకట్టుకున్న విన్యాసాలు..
చండీగఢ్‌లోని వైమానిక దళ స్టేషన్‌లో భారత వైమానిక దళం చేసిన విన్యానాలు ఆకట్టుకున్నాయి.
మార్చ్-పాస్ట్..రైఫిల్స్‌తో డ్రిల్ తో వైమానిక దళ సిబ్బంది ఆశ్యర్యపరిచారు.
తమ డ్రిల్‌లో భాగంగా వైమానిక దళ సిబ్బంది వాహనాన్ని విడదీసి జోడించడం ఆహుతులను విశేషంగా ఆకర్షించింది.
IAF నూతన యూనిఫాం
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 90వ వార్షికోత్సవం సందర్భంగా ఎయిర్ స్టాఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి కొత్త యూనిఫామ్‌ను ఆవిష్కరించారు. IAFలో మొదటిసారిగా టీ-షర్టుతో కూడిన యూనిఫాంను ప్రవేశపెట్టడం విశేషం. ఈ యూనిఫాం ధరించి ఏడుగురు వైమానిక దళ సిబ్బంది మార్చ్-పాస్ట్ చేశారు. IAF యొక్క కార్యాచరణ పనులను దృష్టిలో ఉంచుకుని ఈ యూనిఫాంను రూపొందించినట్లు వీఆర్ చౌదరి తెలిపారు. ఈ డిజిటల్ ప్యాటర్న్ కంబాట్ యూనిఫామ్‌లో కొత్త ప్యాటర్న్ బూట్‌లు, కంబాట్ టీ-షర్ట్, కొత్త వెబ్ బెల్ట్, కొత్త ప్యాటర్న్ క్యాప్స్, టర్బన్‌లు ఉన్నాయి.
కొత్త ఆయుధ వ్యవస్థల శాఖ
ఎయిర్ ఫోర్స్ 90వ వార్షికోత్సవం సందర్భంగా IAFలోని అధికారుల కోసం వెపన్ సిస్టమ్ బ్రాంచ్‌ను రూపొందించడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని ఎయిర్ స్టాఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి ప్రకటించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎయిర్ ఫోర్స్ కోసం కొత్త ఆయుధ వ్యవస్థల శాఖను ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. ఈ ఆయుధ వ్యవస్థల శాఖ సర్ఫేస్ టు సర్ఫేస్ మిస్సైల్స్, సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్స్, రిమోట్‌లీ పైలటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్ మరియు వెపన్ సిస్టమ్ ఆపరేటర్స్ ట్విన్, మల్టీ క్రూ ఎయిర్‌క్రాఫ్ట్‌ల యొక్క నాలుగు ప్రత్యేక స్ట్రీమ్‌ల నిర్వహణ కోసం పనిచేస్తుంది. ఈ శాఖను ఏర్పాటు చేయడం వల్ల ఫ్లయింగ్ శిక్షణపై ఖర్చు తగ్గుతుందని..దీని ద్వారా రూ. 3400 కోట్లకు పైగా ఆదా అవుతుందని ఎయిర్ చీఫ్ చెప్పారు.
1932 అక్టోబర్ 8న ఏర్పాటు..
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 1932 అక్టోబరు 8న ఏర్పడింది. రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ తరఫున పాల్గొంది. దేశానికి స్వాతంత్రం వచ్చాక..రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్గా మారింది. 1950లో రాయల్‌ను తొలగించి ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌గా మార్చారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 1962 భారత్-చైనా యుద్ధం, 1965, 1967, 71లో భారత్-పాక్ యుద్ధాలు, కార్గిల్ యుద్ధంలో పాల్గొని..శత్రుదేశాలకు ధీటైన జవాబిచ్చింది. ప్రస్తుతం ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో మొత్తం 1.70 లక్షల మంది సిబ్బంది, 1300పైగా యుద్ధ విమానాలున్నాయ. ఐదు ఆపరేషనల్ కమాండింగ్ కేంద్రాలు.. 1,130 కంబాట్.. 1,700 నాన్- కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు వైమానిక దళం సొంతం.
