జూలై 17న టోక్యోకు మనోళ్లు

జూలై 17న టోక్యోకు మనోళ్లు

న్యూఢిల్లీ:  ఒలింపిక్స్‌‌కు సెలెక్ట్‌‌ అయిన ఇండియన్‌‌ అథ్లెట్లు టోక్యో వెళ్లే ముహూర్తం ఖరారైంది. ఇండియా నుంచి బయలుదేరే అథ్లెట్లందరూ జులై  17న టోక్యో ఫ్లైట్‌‌ ఎక్కుతారు. ఈ మేరకు టోక్యో ఒలింపిక్స్‌‌ ఆర్గనైజింగ్‌‌ కమిటీ(టీఓసీఓజీ)కి ఇండియన్‌‌ ఒలింపిక్‌‌ అసోసియేషన్‌‌(ఐఓఏ)  గురువారం ఓ లేఖ పంపింది. ‘ ప్రోటోకాల్స్‌‌లో కొన్ని సడలింపులు కోరుతూ టీఓసీఓజీకి కొన్ని వినతులు పంపాం. వాటికి ఇప్పటిదాకా రిప్లయ్‌‌ రాలేదు. ఆ విషయంలో మేము చింతిస్తున్నాం . ఈ నేపథ్యంలో మా అథ్లెట్ల బృందం జులై 17న టోక్యో బయలుదేరుతుంది. 18న టోక్యోలో అడుగుపెట్టిన వెంటనే మూడు రోజులు హార్డ్‌‌ క్వారంటైన్‌‌లో ఉంటుంది. జర్నీకి ఏడు రోజుల ముందు ఆర్టీపీసీఆర్‌‌ టెస్ట్‌‌ చేయించుకోవాలనే నిబంధన వల్ల మరో దారి లేక 17వ తేదీని ఎంచుకున్నాం’ అని టీఓసీఓజీకి రాసిన లేఖలో ఐఓఏ పేర్కొంది. కాగా, తమ పోటీలు ముగిసిన తర్వాత రెండ్రోజుల్లోపు అథ్లెట్లు, సపోర్ట్‌‌ స్టాఫ్‌‌ గేమ్స్‌‌ విలేజ్‌‌ను విడిచిపెట్టి వెళ్లాలని టీఓసీఓజీ రూల్స్‌‌లో పెట్టింది.అయితే, ఫ్లైట్స్‌‌ అందుబాటును పరిగణనలోకి తీసుకుని ఇండియన్‌‌ అథ్లెట్లకు ఈ రూల్‌‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఐఓఏ మరో విజ్ఞప్తి చేసింది. కాగా. కాంపిటీషన్‌‌ కమ్‌‌ ట్రెయినింగ్‌‌ కోసం క్రొయేషియా టూర్‌‌కు వెళ్లిన ఇండియా ఒలింపిక్‌‌ షూటింగ్‌‌ టీమ్‌‌  అక్కడి నుంచే ఈ నెల 16వ తేదీన టోక్యోకు ప్రయాణం కానుంది.