DC vs MI: ఢిల్లీ పరుగుల వరద.. ముంబై టార్గెట్ 258

DC vs MI: ఢిల్లీ పరుగుల వరద.. ముంబై టార్గెట్ 258

అరుణ్ జైట్లీ స్టేడియంలో ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచ్ ల్లో ఢిల్లీ క్యాపిటల్స్ పరుగుల వరద పారించింది. సొంతగడ్డపై చెలరేగుతూ భారీ స్కోర్ చేసింది. ప్లే ఆఫ్ కు వెళ్లాలంటే కీలకమైన మ్యాచ్ లో బ్యాటింగ్ లో సత్తా చాటింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 257 పరుగుల భారీ స్కోర్ చేసింది. 

ఓపెనర్ జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ తొలి బంతి నుంచి ముంబై బౌలర్లపై దారుణంగా విరుచుకుపడ్డాడు. 27 బంతుల్లోనే 84 పరుగులు చేసి అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. ఈ యువ ఆటగాడి ఇన్నింగ్స్ లో ఆరు సిక్సులు, 11 ఫోర్లు ఉన్నాయి. తొలి మూడు బంతులను వరుసగా 4,4,6 కొట్టి 19 పరుగులు రాబట్టాడు. ఇతని ధాటికి ఢిల్లీ జట్టు పవర్ ప్లే లో ఏకంగా 92 పరుగులు చేసింది. మరో ఎండ్ లో ఓపెనర్ అభిషేక్ పోరెల్ 36 పరుగులు చేసి చక్కని సహకారం అందించాడు.  

ఓపెనర్లు ఇచ్చిన ఆరంభాన్ని హోప్(41), కెప్టెన్ రిషబ్ పంత్ కొనసాగించారు. ముఖ్యంగా హోప్ ఉన్నంత సేపు సిక్సులతో విరుచుకుపడ్డాడు. మరో ఎండ్ లో పంత్ 29 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో ట్రిస్టన్ స్టబ్స్ (25 బంతుల్లో 48, 6 ఫోర్లు, 2 సిక్సులు) చెలరేగడంతో జట్టు స్కోర్ 250 పరుగుల మార్క్ దాటింది. ల్యూక్ వుడ్ వేసిన 18 వ ఓవర్లో స్టబ్స్ 5 ఫోర్లు, ఒక సిక్సర్ తో 26 పరుగులు బాదడం విశేషం. ముంబై బౌలర్లలో మహమ్మద్ నబీ, పీయూష్ చావ్లా,ల్యూక్ వుడ్, బుమ్రా తలో వికెట్ తీసుకున్నారు.