దుబాయ్ ఎయిర్ షోలో కూలిపోయిన ఇండియా తేజాస్ యుద్ధ విమానం

దుబాయ్ ఎయిర్ షోలో కూలిపోయిన ఇండియా తేజాస్ యుద్ధ విమానం

భారత్ కు చెందిన ప్రతిష్టాత్మక యుద్ధ విమానం తేజస్ క్రాష్ అయిన వీడియోలు వైరల్ గా మారాయి. శుక్రవారం (నవంబర్ 21) దుబాయ్ లో నిర్వహించిన ఓ ఎయిర్ షోలో ఇండియన్ ఆర్మీ ఫైటర్ జెట్ కుప్పకూలింది. మధ్యాహ్నం 2.10 గంటల ప్రాంతంలో ఎయిర్ షో ఈవెంట్లో ఒక్క సారిగా కుప్పకూలిపోయింది. 

హిందుస్తాన్ ఏరోనాటిక్స్  ఫైటర్ జెట్ తేజస్ కుప్పకూలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి పెద్ద ఎత్తున పొగలు వెలువడ్డాయి. అయితే ఈ ఘటనలో పైలట్ ముందుగానే బయటపడ్డాడా లేక ప్రమాదంలో చిక్కుకున్నాడా అనే వివరాలు తెలియాల్సి ఉంది. 

ఎయిర్ షోలో తేజస్ జెట్ అదుపుతప్పి ప్రమాద వశాత్తు కిందపడిపోయింది. దీంతో దుబాయ్ ఎయిర్ పోర్ట్ పరిసర ప్రాంతాల్లో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ప్రమాదం జరగటంతో వెంటనే షోని ఆపేశారు అధికారులు. సహాయక చర్యలు చేపట్టారు. 

దుబాయ్ ఎయిర్ షో - 25 ఈవెంట్ కు హాజరైన ప్రేక్షకులకు సమీపంలోనే జెట్ కూలటంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. పెద్దగా పేలుడు శబ్దంతో భారీ ఎత్తున పొగలు వెలువడ్డాయి. వెంటనే ఫైర్ సిబ్బంది, రక్షక దళాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. 

ఏంటి తేజస్ జెట్ ప్రత్యేకత:

తేజస్ యుద్ధ విమానం ఇండియాకు ప్రతిష్టాత్మకమైనది. ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ డిజైన్ చేయగా.. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) తయారు చేసింది. ఇది ఇండియాతో తయారు చేసిన తొలి ఫైటర్ జెట్ కావడం గమనార్హం. 

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో Mk1 రకానికి చెందిన తేజస్ ఫైటర్ జెట్ ను వాడుతున్నారు. త్వరలోనే Mk1A వేరియెంట్ ను డెలివరీ చేసేందుకు HAL ఇప్పటికే సిద్ధమైంది. 

దుబాయి లో ఏ1 మక్తూమ్ ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టు ఆధ్వర్యంలో  (Al Maktoum International Airport in Dubai World Central) ఎయిర్ షో నిర్వహిస్తున్నారు. ఎమిరేట్స్, ఫ్లై దుబాయ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ షోలో ప్రమాదం జరగటం ఆందోళనకరంగా మారింది.