న్యూఢిల్లీ: దేశీయ రియల్ ఎస్టేట్ రంగంలో హాస్పిటాలిటీ (ఆతిథ్య) విభాగం శరవేగంగా దూసుకుపోతోంది. తాజాగా విడుదలైన '2026 గృహ్–హురూన్ ఇండియా రియల్ ఎస్టేట్ 150' జాబితాలో టాటా గ్రూప్‌నకు చెందిన 'ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్' (ఐహెచ్‌సీఎల్), ఐపీఓకి సిద్ధమవుతున్న ఓయో పేరెంట్ కంపెనీ 'ప్రిజమ్'లు టాప్-10లో చోటు దక్కించుకున్న హాస్పిటాలిటీ కంపెనీలుగా నిలిచాయి.
ఈ రిపోర్ట్ ప్రకారం, రితీష్ అగర్వాల్ నేతృత్వంలోని ప్రిజమ్ వాల్యుయేషన్ గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 107 శాతం వృద్ధితో రూ. 67,200 కోట్లకు చేరుకుంది. దీంతో ఈ సంస్థ ఆరు స్థానాలు ఎగబాకి 5వ ర్యాంకుతో టాప్-10లోకి దూసుకెళ్లింది. అదానీ ప్రాపర్టీస్ తర్వాత దేశంలోనే అత్యంత విలువైన రెండవ అన్‌లిస్టెడ్ రియల్ ఎస్టేట్ కంపెనీగా ప్రిజమ్ నిలిచింది.
ఒక దశాబ్దం క్రితం నామమాత్రంగా ఉన్న హాస్పిటాలిటీ రంగం, ఇప్పుడు రియల్ ఎస్టేట్ సెక్టార్‌లో రెసిడెన్షియల్ తర్వాత అత్యధిక కంపెనీలు (24 సంస్థలు) కలిగిన రెండో పెద్ద విభాగంగా అవతరించింది. హురూన్ లిస్ట్‌లో మొత్తం 24 కంపెనీల చోటు దక్కించుకోగా, వీటి మొత్తం విలువ రూ. 2.85 లక్షల కోట్లకు చేరింది. రూ. 93,300 కోట్ల వాల్యూయేషన్‌తో ఇండియన్ హోటల్స్ మూడో స్థానంలో ఉంది.
ఇటీవలే డీమెర్జ్ అయిన 'ఐటీసీ హోటల్స్' రూ. 32,300 కోట్ల వాల్యుయేషన్‌తో లిస్ట్‌లో స్థానం పొందింది. ఈ హురూన్ లిస్ట్‌లో డీఎల్ఎఫ్ రూ. 1.47 లక్షల కోట్ల వాల్యూయేషన్‌తో మొదటి స్థానంలో నిలిచింది. వరుసగా 5వ ఏడాది కూడా అగ్రస్థానంలో కొనసాగింది. లోధా డెవలపర్స్ రూ. 93,700 కోట్లతో రెండవ స్థానంలో, అదానీ ప్రాపర్టీస్ రూ. 90,400 కోట్లతో నాల్గో స్థానంలో ఉన్నాయి.
