మార్కెట్లలో 'ట్రంప్' టెన్షన్: సుంకాల హెచ్చరికతో నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ..

మార్కెట్లలో 'ట్రంప్' టెన్షన్: సుంకాల హెచ్చరికతో నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ..

అమెరికా కొత్త సుంకాల భయాలతో పాటు అంతర్జాతీయ రాజకీయ అనిశ్చితి మధ్య భారత స్టాక్ మార్కెట్లు ఒత్తిడిలో కొనసాగుతున్నాయి. ఉదయం ట్రేడింగ్‌లో దేశీయ సూచీలు స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఇన్వెస్టర్లు ఒకవైపు కంపెనీల త్రైమాసిక ఫలితాల కోసం వేచి చూస్తుండగా, మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. సెన్సెక్స్ సుమారు 251 పాయింట్లు పతనమవ్వగా,  మరో కీలక సూచీ నిఫ్టీ 26,220 స్థాయికి దిగువన ట్రేడవుతోంది. దీంతో వరుసగా రెండో రోజూ మార్కెట్ల పతనం కొనసాగుతోంది.

దేశీయ స్టాక్ మార్కెట్ల పతనానికి కీలక కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం..

1. ట్రంప్ సుంకాల హెచ్చరిక: 
రష్యా నుంచి చమురు కొనుగోళ్లను తగ్గించాలన్న వాషింగ్టన్ డిమాండ్‌ను భారత్ పట్టించుకోకపోతే.. భారత ఉత్పత్తులపై టారిఫ్‌లుపెంచుతామని ట్రంప్ చేసిన హెచ్చరికలు ఇన్వెస్టర్లలో ఆందోళన రేకెత్తించాయి.

2. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అమ్మకాలు: 
మార్కెట్ హెవీవెయిట్ స్టాక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు సుమారు 2 శాతం పడిపోయాయి. గత రెండు రోజుల్లోనే ఈ షేరు 4 శాతం క్షీణించింది. డిపాజిట్ల వృద్ధి కంటే రుణాల వృద్ధి ఎక్కువగా ఉండటం.. క్రెడిట్-డిపాజిట్ రేషియో ఆందోళనకరంగా ఉండటంతో విశ్లేషకులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

3. చమురు రంగంలో అమ్మకాల సెగ: 
నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ 1.51 శాతం పడిపోయింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ (2.71% డౌన్), గుజరాత్ గ్యాస్, బీపీసీఎల్ వంటి షేర్లు వరుసగా రెండో రోజు కూడా నష్టాల్లోనే ఉన్నాయి. ఈ క్రమంలో జామ్ నగర్ రిఫైనరీకి రష్యన్ క్రూడ్ ఆయిల్ వస్తుందన్న ఆరోపణలను అంబానీ సంస్థ ఖండించటం ప్రాధాన్యత అంశంగా ఉంది.

4. అంతర్జాతీయ ఉద్రిక్తతలు: 
వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో అరెస్ట్ వంటి అనూహ్య భౌగోళిక రాజకీయ పరిణామాలు గ్లోబల్ మార్కెట్లలో అనిశ్చితిని పెంచాయి. దీనివల్ల ఓలటాలిటీ ఇండెక్స్ (India VIX) 2 శాతం పెరిగి.. ఇన్వెస్టర్లలో నెలకొన్న భయాన్ని   ప్రతిబింబిస్తోంది.

అలాగే జాగ్వార్ లాండ్ రోవర్ విక్రయాలు తగ్గడంతో టాటా మోటార్స్ షేరు 2 శాతం పైగా పడిపోయింది. సైబర్ దాడి యూఎస్ టారిఫ్‌ల ప్రభావం దీనిపై పడింది. మరోవైపు ఇజ్రాయెల్ సంస్థ నుంచి ఆర్డర్ పొందినప్పటికీ DCX సిస్టమ్స్ షేరు కూడా స్వల్ప నష్టాల్లో ఉంది. కాగా.. ONGC స్టాక్ మాత్రం 1.05 శాతం లాభంతో రాణిస్తోంది.

అనిశ్చితి ఎక్కువగా ఉన్నందున ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని, ఇన్వెస్టర్లు చేతిలో క్యాష్ ఉంచుకుని మార్కెట్ ఒడిదుడుకులను గమనిస్తూ పెట్టుబడులు పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. మార్కెట్ బ్రెడ్త్ ప్రతికూలంగా ఉండటంతో.. లాభాల స్వీకరణ కొనసాగే అవకాశం కనిపిస్తోంది.