న్యూఢిల్లీ: భారత నౌకాదళం రోజురోజుకూ బలోపేతమవుతున్నదని.. ప్రతి 40 రోజులకు ఒక కొత్త యుద్ధనౌక లేదా జలాంతర్గామి నేవీలో చేరుతున్నదని నేవీ చీఫ్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి అన్నారు. అవన్ని కూడా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో మనదేశంలోనే తయారవుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం మన షిప్‌యార్డుల్లో 52 నౌకలు రూపుదిద్దుకుంటున్నాయని చెప్పారు. మంగళవారం ఢిల్లీలో భారత శక్తి అనే సంస్థ స్వదేశీయత, ఇన్నోవేషన్, అంతర్జాతీయ సహకారం అనే థీమ్‌తో ఏర్పాటు చేసిన డిఫెన్స్ కాన్ క్లేవ్లో దినేశ్ త్రిపాఠి ప్రసంగించారు.
భారత నౌకాదళంలో నౌకలు, జలాంతర్గాములు కలిపి 145 ఉన్నాయని.. 2035 నాటికి వీటి సంఖ్యను 200కు పైగా పెంచాలని లక్ష్యం నిర్దేశించుకున్నట్టు తెలిపారు. 2047 నాటికి మన నేవీ పూర్తి ఆత్మనిర్భర ఫోర్స్‌గా అవతరించే దిశగా ముందుకు అడుగులు పడుతున్నాయన్నారు. సముద్రాల్లో గొప్ప నేవీ శక్తిగా మారేందుకు స్వావలంబన, సమన్వయం, భద్రత 3 ప్రధాన పిల్లర్లు అన్నారు. ఇవి ఒకదాన్నొకటి బలోపేతం చేస్తాయని చెప్పారు.
