- నాసా స్పేస్ఎక్స్ ‘ఎండ్యూరెన్స్’ మిషన్‌కు లీడర్
- 6 నెలల పాటు ఐఎస్ఎస్లో రీసెర్చ్
కేప్కెనావరల్: తెలంగాణ మూలాలున్న ఆస్ట్రోనాట్ రాజాచారి (44) అంతరిక్షంలో అడుగు పెట్టారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ఐఎస్ఎస్)లో 6 నెలల పాటు ప్రయోగాలు చేయనున్నారు. గురువారం నాసా–స్పేస్ఎక్స్ కలిసి ‘క్రూ 3’ మిషన్‌లో భాగంగా డ్రాగన్ క్యాప్సూల్ ‘ఎండ్యూరెన్స్’ను సక్సెస్‌ఫుల్‌గా పంపించాయి. రాజాచారి సహా నలుగురు ఆస్ట్రోనాట్లను ఐఎస్ఎస్కు చేర్చాయి. అందులో ముగ్గురు అమెరికన్ ఆస్ట్రోనాట్లుకాగా.. ఒకరు యూరోపియన్ ఆస్ట్రోనాట్. మన టైం ప్రకారం గురువారం తెల్లవారుజామున 2.30 గంటలకు ఫ్లోరిడాలోని కేప్కెనావరల్లో ఉన్న నాసా కెనెడీ స్పేస్ సెంటర్ నుంచి రెండు స్టేజ్‌ల ఫాల్కన్9 రాకెట్.. ఎండ్యూరెన్స్‌ను తీసుకుని నింగిలోకి ఎగిసింది. అంతకుముందు వర్షం పడటం, మబ్బులు కమ్మేయడంతో ప్రయోగంపై అనుమానాలు వచ్చాయి. వాతావరణం క్లియర్ అయిపోవడంతో అనుకున్న టైంకల్లా మిషన్ సాఫీగా సాగింది. దాదాపు 22 గంటల ప్రయాణం తర్వాత వారు సురక్షితంగా ఐఎస్ఎస్కు చేరుకున్నారు. వారికి తోడుగా రష్యా, బెలారస్, అమెరికా ఆస్ట్రోనాట్లు ఇప్పటికే ఐఎస్ఎస్లో ఉన్నారు. నలుగురు ఆస్ట్రోనాట్లను ఐఎస్ఎస్ నుంచి భూమి మీదకు తీసుకొచ్చిన రెండు రోజుల్లోనే ప్రయోగాన్ని చేయడం విశేషం.
మనోడే లీడర్
ఈ మిషన్‌ను రాజాచారి లీడ్ చేస్తున్నారు. మిషన్ కమాండర్‌గా వ్యవహరిస్తున్నారు. స్పేస్‌లోకి ఆయన మొట్టమొదటి సారి వెళ్లారు. అమెరికా ఎయిర్‌ఫోర్స్ కంబాట్ జెట్ అండ్ టెస్ట్ పైలట్‌గా పనిచేస్తున్న ఆయన తన తొలి అంతరిక్ష ప్రయాణంలోనే మిషన్ లీడర్‌గా ఉండడం విశేషం. ఆయనతో పాటు అమెరికా నేవీ సబ్మెరీన్ ఆఫీసర్, న్యూక్లియర్ ఇంజనీర్ అయిన కేలా బేరన్(34) మిషన్ స్పెషలిస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఎండ్యూరెన్స్ పైలట్, మిషన్ సెకండ్ ఇన్చార్జ్గా ఆస్ట్రోనాట్ టామ్ మార్ష్‌బర్న్ (61) పనిచేస్తున్నారు. ఆయన మెడికల్ డాక్టర్, నాసా ఫ్లైట్ సర్జన్‌గానూ అంతకుముందు బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పటికే ఆయన రెండుసార్లు ఐఎస్ఎస్కు వెళ్లొచ్చారు. నాలుగుసార్లు స్పేస్‌వాక్ చేశారు. జర్మనీకి చెందిన యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) ఆస్ట్రోనాట్ మాథియాస్ మారర్ (51) మెటీరియల్స్ సైన్స్ ఇంజనీర్‌గా వ్యవహరించనున్నారు. ఈ ప్రయోగంతో అంతరిక్షంలోకి అడుగు పెట్టిన వారి సంఖ్య 600ను దాటింది. రాజాచారి 599వ వ్యక్తి కాగా.. బేరన్ 600, మారర్601వ వ్యక్తిగా రికార్డులకెక్కారు.
నాసా మూన్ మిషన్ ‘ఆటమస్’లోనూ..
రాజాచారి ఇప్పుడు ఐఎస్ఎస్లోకే కాదు.. నాసా 2024లో చేయబోతున్న చంద్రుడి ప్రయోగం ‘ఆటమస్’లోనూ చోటు దక్కించుకున్నారు. చందమామపైకి వెళ్లే తొలి 18 మంది గ్రూపులో ఆయన్ను నాసా ఎంపిక చేసింది. దాదాపు 18 వేల అప్లికేషన్లను వడపోసి 2017లో రాజాను నాసా ఎంపిక చేసింది. దీంతో 1997లో కల్పనా చావ్లా, 2006లో సునీతా విలియమ్స్ తర్వాత ఐఎస్ఎస్లోకి అడుగుపెట్టిన మూడో ఇండియన్ అమెరికన్‌గా ఆయన రికార్డు సృష్టించారు. రాజాచారితో పాటు బేరన్ కూడా ఆటమస్ ప్రయోగంలో భాగంగా చంద్రుడిపైకి వెళ్లనున్నారు.
ఎన్నో అవార్డులు..రివార్డులు
తన ఇన్నాళ్ల కెరీర్లో రాజాచారి ఎన్నెన్నో ప్రతిష్టాత్మక అవార్డులు, రివార్డులు అందుకున్నారు. డిఫెన్స్ మెరిటోరియస్ సర్వీస్ మెడల్, ద మెరిటోరియస్ సర్వీస్ మెడల్, ద ఏరియల్ అచీవ్మెంట్ మెడల్, ఎయిర్‌ఫోర్స్ కమెండేషన్ మెడల్, ఎయిర్‌ఫోర్స్ అచీవ్మెంట్ మెడల్, ఇరాక్ క్యాంపెయిన్ మెడల్, కొరియన్ డిఫెన్స్ సర్వీస్ మెడల్, న్యూక్లియర్ డిటరెన్స్ ఆపరేషన్స్ సర్వీస్ మెడల్స్‌ను పొందారు.
రాజాచారి నాన్నది మహబూబ్‌నగర్
రాజాచారి అమెరికాలోనే పుట్టినా.. తెలంగాణ మూలాలున్నాయి. వాళ్ల నాన్న శ్రీనివాస చారిది మహబూబ్‌నగర్. 1950ల్లోనే ఆయన అమెరికాకు వలస వెళ్లారు. చదువుకునే సమయంలో ఆయనకు పెగ్గీ ఎగ్బర్ట్ను ప్రేమించి పెండ్లి చేసుకున్నారు. 2010లో శ్రీనివాస చారి చనిపోయారు. ఏదైనా గొప్పది సాధించాలన్న తన తండ్రిచ్చిన స్ఫూర్తితోనే తాను ఆస్ట్రోనాట్‌గా ఎదిగానంటారు రాజాచారి. కాగా, శ్రీనివాసచారి, పెగ్గీ ఎగ్బర్ట్లకు 1977 జూన్ 24న విస్కాన్సిన్లోని మిల్వాకీలో రాజాచారి పుట్టారు. ఐవాలోని సీడార్ ఫాల్స్‌లో పెరిగారు. ఏరోనాటికల్ అండ్ ఆస్ట్రోనాటికల్ ఇంజనీరింగ్ నుంచి మాస్టర్స్ పట్టా పొందిన ఆయన.. ఇరాక్‌తో యుద్ధం లోనూ పాల్గొన్నారు. ఆ టైమ్‌లో ఎల్మండార్ఫ్ బేస్, అలాస్కా, ఆర్ఏఎఫ్ లేకెన్హీత్లలో పనిచేశారు. ఆ తర్వాత నేవల్ ఎయిర్‌ఫోర్స్‌లోనూ వివిధ హోదాల్లో చారి పనిచేశారు. నాసా ఆస్ట్రోనాట్‌గా ఎంపికైన టైమ్‌లో ఆయన ఎడ్వర్డ్స్ బేస్‌లో 461వ ఫ్లైట్ టెస్ట్ స్క్వాడ్రన్‌కు కమాండింగ్ ఆఫీసర్‌గా పనిచేశారు. నాసాకు ఎంపికై రెండేండ్ల పాటు ఆస్ట్రోనాట్ శిక్షణను పొందారు. ఇక, హోలీ షాఫ్టర్ను రాజాచారి పెండ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురుపిల్లలున్నారు.
SpaceX mission led by Indian-origin astronaut docks with International Space Station
— ANI Digital (@ani_digital) November 12, 2021
Read @ANI Story | https://t.co/Dx5xGOFkPH#SpaceX pic.twitter.com/NE3WtZ95Mb
