- వర్జీనియాలోని హోటల్ లో దందా
- రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు
- నేరం రుజువైతే పదేండ్ల జైలు శిక్ష
వాషింగ్టన్: అమెరికాలోని వర్జీనియాలో ఉన్న ఓ హోటల్లో అసాంఘిక కార్యకలాపాలను అనుమతించినందుకు భారత సంతతి జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఆ హోటల్లోని మూడో అంతస్తును డ్రగ్స్, సెక్స్ ట్రాఫికింగ్ ముఠా తమ కార్యకలాపాలకు కేంద్రంగా మార్చుకుందని పోలీసులు ఆరోపించారు.
భార్యాభర్తలైన కోషా శర్మ (52), తరుణ్ శర్మ (55) వర్జీనియాలో 2023 నుంచి రెడ్ కార్పెట్ ఇన్ హోటల్‌ను లీజుకు తీసుకుని నడుపుతున్నారని అధికారులు కోర్టు డాక్యుమెంట్లలో పేర్కొన్నారు. హోటల్లోని మొదటి, రెండో అంతస్తులను గెస్టులకు రెంట్ కోసం ఇచ్చేవారని తెలిపారు. మూడో అంతస్తులో మాత్రం డ్రగ్, సెక్స్ ట్రాఫికింగ్ రింగ్ నిర్వహించడానికి అనుమతించారని చెప్పారు.
డ్రగ్స్ కోసం వచ్చేవారిని కోషా శర్మ మూడో అంతస్తుకు తీసుకెళ్లేవారని వెల్లడించారు. ఒకవేళ పోలీసులు రైడ్‌కు వస్తే వారిని అప్రమత్తం చేసి, అధికారులు గదుల్లోకి ప్రవేశించకుండా చేసేవారని వివరించారు. ఈ కార్యకలాపాల ద్వారా వచ్చే లాభంలో కొంత భాగాన్ని వీరు తీసుకునేవారని తెలిపారు.
హోటల్ పై నిఘా.. తొమ్మిది సార్లు సందర్శన
వర్జీనియాలోని ఈ హోటల్‌పై పోలీసులు కొంతకాలంగా నిఘా పెట్టారు. గతేడాది మే, ఆగస్టు మధ్య మారువేషంలో హోటల్‌ను తొమ్మిదిసార్లు సందర్శించారు. ఆపరేషన్ చేపట్టి కోషా శర్మ, తరుణ్ శర్మతో సహా మరో ముగ్గురిని అరెస్టు చేశారు.
సెక్స్ ట్రాఫికింగ్, డ్రగ్స్ పంపిణీ చేయడానికి కుట్ర పన్నారనే ఆరోపణలతో ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నేరం రుజువైతే వారికి కనీసం 10 ఏండ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
