ఆయుష్మాన్‌‌‌‌ భారత్‌ ‌‌‌తో వైద్య ఖర్చుల్లో భారీగా ఆదా..60 కోట్లకు పైగా పౌరులకు రూ.5 లక్షల ఫ్రీ రక్షణ కవచం

ఆయుష్మాన్‌‌‌‌ భారత్‌ ‌‌‌తో  వైద్య ఖర్చుల్లో భారీగా ఆదా..60 కోట్లకు పైగా పౌరులకు రూ.5 లక్షల ఫ్రీ రక్షణ కవచం
  • ‘ఎక్స్‌‌‌‌’ లో ప్రధాని మోదీ పోస్ట్

న్యూఢిల్లీ: నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలకు తీవ్ర ఆర్థిక భారంగా మారే వైద్య ఖర్చులను గణనీయంగా తగ్గించడంలో ‘ఆయుష్మాన్ భారత్’ చారిత్రక విజయం సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. 

దేశంలోని ప్రతి పౌరుడికీ నాణ్యమైన, అందుబాటు ధరల్లో వైద్యసేవలు అందాలన్న లక్ష్యంతో ప్రారంభించిన ఈ పథకం విజయవంతంగా ఎనిమిదేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని హర్షం వ్యక్తం చేశారు.   ఈ మేరకు బుధవారం ‘ఎక్స్‌‌‌‌’లో ప్రధాని మోదీ ట్వీట్‌‌‌‌ చేశారు.‘‘ఎనిమిదేండ్ల క్రితం ప్రతి భారతీయుడికీ అత్యుత్తమ వైద్యం అందాలన్న సంకల్పంతో ఈ పథకం ప్రారంభమైంది.

 నేడు 60 కోట్లకు పైగా లబ్ధిదారులకు ఏడాదికి రూ.5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా రక్షణ లభిస్తున్నది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య పథకంగా నిలిచిన ఆయుష్మాన్ భారత్, పేద, మధ్యతరగతి వర్గాలకు వైద్య ఖర్చుల భారాన్ని తప్పించి రికార్డు స్థాయిలో ఆదాను చేకూర్చింది. మరోవైపు గ్రామస్థాయిలో ఏర్పాటైన ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను ప్రజలు ఇప్పటివరకు 500 కోట్లకు పైగా సార్లు సందర్శించి ప్రాథమిక ఆరోగ్య సేవలు పొందారు. దీంతో వైద్యసేవలు ప్రజల ముంగిటకే చేరాయి” అని పేర్కొన్నారు.   

ఎన్నో జీవితాల్లో వెలుగు: జేపీ నడ్డా

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా మరో ప్రకటనలో ఈ పథక ప్రగతిని వివరించారు. ‘‘దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 48.54 కోట్లకు పైగా ఆయుష్మాన్ కార్డులు జారీ చేశాం. 13 కోట్లకు పైగా ప్రజలు ఈ పథకం ద్వారా ఉచిత చికిత్స పొందారు. దేశంలోని 39 వేలకుపైగా ప్రభుత్వ, ప్రైవేట్‌‌‌‌ ఆసుపత్రుల నెట్‌‌‌‌వర్క్ ద్వారా సుమారు రూ.2 లక్షల కోట్ల విలువైన చికిత్సలు, శస్త్రచికిత్సలు నిరుపేదలకు ఉచితంగా అందాయి’’ అని వివరించారు. 

ఈ గణాంకాలు సంఖ్యలు మాత్రమే కావని, అనారోగ్యం వల్ల వచ్చే అప్పుల ఊబి నుంచి బయటపడిన కుటుంబాల ఆత్మవిశ్వాసానికి, బాధల నుంచి విముక్తి పొందిన ప్రాణాలకు నిదర్శనమని నడ్డా పేర్కొన్నారు.