కాలిఫోర్నియా: అమెరికాలో స్థిరపడిన ఓ భారతీయ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అరుదైన వ్యాధితో కన్నుమూశారు. నెల రోజులుగా 'వ్యాలీ ఫీవర్' అనే ఫంగల్ ఇన్‌ఫెక్షన్‌తో పోరాడుతున్న చిరంజీవి కొల్ల (37) మే 5న మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య పావని, ఐదేళ్ల కుమారుడు విహాన్ ఉన్నారు. ఏప్రిల్లో సాధారణ ఫ్లూ లక్షణాలతో చిరంజీవి అనారోగ్యానికి గురయ్యారు. పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించగా న్యుమోనియాగా వైద్యులు భావించారు.
తదుపరి పరీక్షల్లో ఆయనకు వ్యాలీ ఫీవర్ సోకినట్లు తేలింది. ఊపిరితిత్తులపై ఈ ఫంగస్ తీవ్ర ప్రభావం చూపడంతో ఆయనను ఐసీయూలో ఉంచి వెంటిలేటర్ ద్వారా చికిత్స అందించారు. 30 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన చిరంజీవి చివరకు మే 5నప్రాణాలు విడిచారు. ఇంటి రుణాలు, ఆస్పత్రి ఖర్చులు, అంత్యక్రియల బాధ్యతలతో సతమతమవుతున్న పావనిని ఆదుకోవడానికి బంధువులు 'గో ఫండ్ మీ' ద్వారా విరాళాలు సేకరిస్తున్నారు. వ్యాలీ ఫీవర్' కాక్సిడియోయిడ్స్' అనే ఫంగస్ వల్ల వచ్చే ఇన్‌ఫెక్షన్. ఇది నేలలో నివసిస్తుంది. గాలి, నిర్మాణాలు లేదా వ్యవసాయ పనుల వల్ల మట్టి కదిలినప్పుడు ఈ ఫంగస్ రేణువులు గాలిలో కలుస్తాయి. శ్వాస ద్వారా మనుషులకు సోకుతుంది.
