ఐఏఎఫ్​లోకి సీ295 ఎయిర్​క్రాఫ్ట్

ఐఏఎఫ్​లోకి సీ295 ఎయిర్​క్రాఫ్ట్

ఘజియాబాద్‌‌: ఇండియన్‌‌ ఎయిర్‌‌‌‌ ఫోర్స్‌‌ (ఐఏఎఫ్‌‌)లోకి తొలి సీ295 మీడియం ట్రాన్స్‌‌ఫోర్ట్‌‌ ఎయిర్‌‌‌‌ క్రాఫ్ట్‌‌ వచ్చి చేరింది. దీని రాకతో ఆర్మీ రవాణా సామర్థ్యం మరింత పెరిగింది. సోమవారం ఉత్తరప్రదేశ్‌‌లోని హిందాన్‌‌ ఎయిర్‌‌‌‌ఫోర్స్‌‌ స్టేషన్‌‌లో జరిగిన కార్యక్రమంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌‌నాథ్‌‌ సింగ్‌‌, వాయుసేన అధికారులు పాల్గొన్నారు. సర్వమత ప్రార్థనలు నిర్వహించి ఎయిర్ క్రాఫ్ట్ ను ఐఏఎఫ్‌‌ చీఫ్‌‌ ఎయిర్‌‌‌‌ మార్షల్‌‌ వీఆర్‌‌‌‌ చౌధరికి అప్పగించారు. మొత్తం 56 సీ295 ఎయిర్‌‌‌‌ క్రాఫ్ట్‌‌లకు రూ.21,935 కోట్లతో స్పెయిన్ కు చెందిన ఎయిర్‌‌‌‌బస్‌‌ కంపెనీతో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అందులో భాగంగా మొదటి ఎయిర్‌‌‌‌క్రాఫ్ట్‌‌ను డిఫెన్స్‌‌ శాఖకు సోమవారం అందించింది.

2025 నాటికి మొదటి 16 విమానాలను ఎయిర్‌‌‌‌బస్‌‌ కంపెనీ డెలివరీ చేయనుంది. మిగిలిన 40 ఎయిర్‌‌‌‌క్రాఫ్ట్‌‌లను టాటా అడ్వాన్స్‌‌డ్‌‌ సిస్టమ్స్‌‌తో కలిసి దేశీయంగా తయారు చేయనుంది. గతేడాది అక్టోబర్‌‌‌‌లో వడోదరలో సీ295 విమానాల తయారీ కేంద్రానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ప్రైవేట్‌‌ కన్సార్టియం ద్వారా దేశంలో తయారు చేస్తున్న మొదటి మిలిటరీ ఎయిర్‌‌‌‌క్రాఫ్ట్‌‌ ఇది. ఈ టాక్టికల్‌‌ ట్రాన్స్‌‌పోర్ట్‌‌ విమానం 71 మంది సైనికులను లేదా 50 పారాట్రూప్స్‌‌ను మోసుకెళ్లే సామర్థ్యం దీనికి ఉంది.