ఎవరూ కొనటం లేదా ఏంటీ : భారీగా తగ్గిన బంగారం దిగుమతులు

ఎవరూ కొనటం లేదా ఏంటీ : భారీగా తగ్గిన బంగారం దిగుమతులు

బంగారాన్ని అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశం భారతదేశం. మహిళలకు ఎంతో ప్రీతి కరమైనదిగా భావించే ఈ బంగారాన్ని కొనాలంటే సామాన్య ప్రజలకు అత్యంత కష్టతరమైనదిగా మారింది. కారణం రోజురోజుకూ పెరుగుతోన్న ధరలే. ఈ క్రమంలోనే 2022-23 ఆర్థిక సంవ‌త్స‌రంలో బంగారం దిగుమ‌తులు 24.15 శాతం త‌గ్గి 35 బిలియ‌న్ డాల‌ర్ల‌కు చేరింది. 2021-22లో బంగారం దిగుమ‌తుల విలువ 46.2 బిలియ‌న్ డాల‌ర్లు నమోదు కాగా... గ‌తేడాది అంటే 2022 ఆగ‌స్టు నుంచి 2023  ఫిబ్ర‌వ‌రి వ‌ర‌కు బంగారం దిగుమతులు భారీగా తగ్గాయి. 2022 మార్చిలో 100 కోట్ల డాల‌ర్ల విలువ గ‌ల బంగారం దిగుమ‌తి జ‌రిగితే... ఈ ఏడాది మార్చిలో 330 కోట్ల డాల‌ర్ల విలువ గ‌ల బంగారం దిగుమతి కావడం గమనార్హం.

2022-23 ఏప్రిల్‌-జ‌న‌వ‌రి మ‌ధ్య దాదాపు 600 ట‌న్నుల బంగారం దిగుమ‌తి అయినట్టు తెలుస్తోంది. దిగుమ‌తి సుంకం భారీగా పెరగడం వ‌ల్ల బంగారం దిగుమ‌తులు త‌గ్గాయి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా బంగారం దిగుమ‌తుల్లోనే భార‌త్ మొద‌టి స్థానంలో ఉండగా... ఏటా 800-900 ట‌న్నుల బంగారం దిగుమ‌తి అవుతోంది. కానీ, వెండి దిగుమ‌తులు మాత్రం 2021-22తో పోలిస్తే 2022-23లో 6.12 శాతం పెరిగి 529 బిలియ‌న్ డాల‌ర్ల‌కు పెరిగాయి.

బంగారం దిగుమ‌తులు భారీగా త‌గ్గినా.. వాణిజ్య లోటు మాత్రం తగ్గలేదు. 2021-22లో మ‌ర్చంటైల్ వాణిజ్య లోటు 191 బిలియ‌న్ డాల‌ర్లు ఉంటే.. గ‌త ఆర్థిక సంవ‌త్స‌రం (2022-23)లో 267 బిలియ‌న్ డాల‌ర్ల‌ుగా నమోదైంది. దేశీయ జ్యువెల్ల‌రీ ఆభ‌ర‌ణాల ప‌రిశ్ర‌మ‌కు చేయూత‌నివ్వ‌డానికి, ఎగుమ‌తుల‌ను ప్రోత్స‌హించ‌డానికి `బంగారం దిగుమ‌తి సుంకం`పై కేంద్రం  నిర్ణ‌యం తీసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. గ‌త ఆర్థిక సంవ‌త్స‌రంలో బంగారం ఎగుమ‌తులు 3 శాతం త‌గ్గి 38 బిలియ‌న్ డాల‌ర్ల‌కు త‌గ్గాయి.

ప్రస్తుతం దేశంలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తుంది. లక్షల సంఖ్యలో పెళ్లిళ్లు ఉన్నాయి. ఈసారి బంగారం అమ్మకాలు భారీగా ఉంటాయని వ్యాపారులు అంచనా వేశారు. అందుకు భిన్నంగా సేల్స్ తగ్గటంతోపాటు ధరలు పెరగటం వంటి కారణాలతో దిగుమతులను సైతం తగ్గించారు వ్యాపారులు. రాబోయే రోజుల్లో ఏమైనా అమ్మకాలు పుంజుకునే అవకాశం ఉంటే మాత్రం.. దిగుమతులు సైతం పెరుగుతాయి.