దేశంలోనే అత్యంత ఖరీదైన, అపురూపమైన నివాసం అనగానే చాలా మందికి అంబానీకి చెందిన ఆంటీలియా అనిపిస్తుంటుంది. లేదా మరెవరైనా వ్యాపారవేత్తకు చెందిన ప్రాపర్టీ అనిపిస్తుంది. కానీ ముంబైలోని మలబార్ హిల్స్‌లో ఉన్న మహారాష్ట్ర గవర్నర్ అధికార నివాసం రాజ్‌భవన్ గురించి చాలా మందికి తెలియదు. దీని ప్రస్తుత అంచనా విలువ అక్షరాలా రూ.30వేల కోట్లుగా తెలుస్తోంది. కేవలం ఆస్తి విలువతోనే దేశంలోనే రికార్డు సృష్టించిన ఈ ప్రాంగణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
రాజ్‌భవన్ మొత్తం 44 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ ప్రాంగణానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే.. ఇది మూడు వైపులా అరేబియా సముద్రంతో చుట్టుముట్టబడి ఉంటుంది. ఇంతటి విశాలమైన, వ్యూహాత్మక స్థలంలో ఉండడం వల్లే దీని విలువ ఊహించనంతగా పెరిగింది. ఈ రెసిడెన్స్‌కు ఏకంగా దాని సొంత పిన్ కోడ్ కూడా ఉంది. భవనం లోపల పిన్ కోడ్ 400035 కాగా.. బయటి ప్రాంతానికి 400006 కావటం విశేషం.
ప్రస్తుతం కోట్లు విలువైన ఈ భూమి 150 ఏళ్ల క్రితం ప్రభుత్వానికి ఉచితంగా దానం చేయబడింది. దీని చరిత్ర 1844 సంవత్సరానికి నాటిది. పార్శీ మతానికి చెందిన పూజారి సోరాబ్జీ తూట్టి మలబార్ హిల్‌పై ఈ కొండను కొనుగోలు చేసి, అక్కడ రెండు బంగళాలను నిర్మించారు. ఆయన మరణానంతరం.. బొంబాయి గవర్నర్ అధికార నివాసాన్ని పరేల్ నుంచి మలబార్ హిల్‌కు మార్చాలని నిర్ణయం జరిగింది. ఈ సమయంలోనే సోరాబ్జీ భార్య ఆ భూమి మొత్తాన్ని అప్పటి బొంబాయి ప్రభుత్వానికి బహుమతిగా ఇచ్చారు. దీంతో ప్రైవేటు ప్రాపర్టీగా ఉన్న ఆ ప్రాంతం ప్రభుత్వం చేతికి వచ్చింది. 1883లో గవర్నర్ భార్య పరేల్‌లో కలరా కారణంగా మరణించిన తర్వాత ఈ మార్పు జరిగింది. బ్రిటిష్ పాలనలో దీనిని 'గవర్నమెంట్ హౌస్' అని పిలిచేవారు. 1947లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దీని పేరు రాజ్‌భవన్ గా మార్చబడింది.
ఈ ప్రాంగణంలో 5 ముఖ్యమైన నిర్మాణాలు ఉన్నాయి:
1. జల్‌భూషణ్: ఇది గవర్నర్ కార్యాలయం, నివాసం.
2. జల్‌చింతన్: భారతదేశ ప్రధానమంత్రి పర్యటనకు కేటాయించిన కార్యాలయం, నివాసం. ( దీనిని జవహర్‌లాల్ నెహ్రూకు ఇష్టమైన నివాసంగా చెబుతారు).
3. జల్‌లక్షణ్: భారత రాష్ట్రపతి కోసం రిజర్వ్ చేసిన నివాసం.
4. జల్‌విహార్: విందులు, సమావేశాలు నిర్వహించే బ్యాంక్వెట్ హాల్.
5. జల్‌సభాగ్ర: ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారం వేదిక.
రాజ్‌భవన్ కేవలం భూమిపైనే కాదు, భూమి లోపల కూడా విశేషాలను దాచుకుంది. 2016లో ఇక్కడ భూగర్భ బ్రిటిష్ బంకర్ ఒకటి కనుగొనబడింది. ఇది మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు నిర్మించబడిందని అంచనావేశారు అధికారులు. ఇది కేవలం భవనం మాత్రమే కాదు, ఒక అద్భుతమైన పర్యావరణ వ్యవస్థ. రాజ్‌భవన్‌లో ఒక ప్రైవేట్ బీచ్, అడవి, 108 రకాల మొక్కలు, చెట్లు, 35 రకాల సీతాకోక చిలుకలు, నెమళ్లు, హెలిప్యాడ్‌లు కూడా ఉన్నాయి. అందుకే ఇది దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన నివాసంగా నిలిచింది.
