ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్న ఇండియా విమెన్స్ జట్టు.. టీ20 వరల్డ్ కప్‌లో వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు స్మృతి మంధాన (74), షెఫాలీ వర్మ (55, 3/20)కు తోడు శ్రీచరణి (4/19) రాణించడంతో బుధవారం జరిగిన గ్రూప్-1 లీగ్ మ్యాచ్‌లో ఇండియా 95 రన్స్ తేడాతో నెదర్లాండ్స్‌పై గెలిచింది.
లీడ్స్: ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్న ఇండియా విమెన్స్ జట్టు.. టీ20 వరల్డ్ కప్‌లో వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు స్మృతి మంధాన (47 బాల్స్‌లో 11 ఫోర్లు, 1 సిక్స్‌తో 74), షెఫాలీ వర్మ (38 బాల్స్‌లో 10 ఫోర్లతో 55, 3/20)కు తోడు శ్రీచరణి (4/19) రాణించడంతో.. బుధవారం జరిగిన గ్రూప్–1 లీగ్ మ్యాచ్‌లో ఇండియా 95 రన్స్ తేడాతో నెదర్లాండ్స్‌పై గెలిచింది.
టాస్ ఓడిన ఇండియా 20 ఓవర్లలో 209/5 స్కోరు చేసింది. వరల్డ్ కప్ చరిత్రలో ఇండియాకు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ఆరంభం నుంచే డచ్ బౌలింగ్‌పై విరుచుకుపడిన స్మృతి, షెఫాలీ తొలి వికెట్‌కు 70 బాల్స్‌లోనే 115 రన్స్ జోడించారు. జెమీమా రొడ్రిగ్స్ (19), హర్మన్‌ప్రీత్ కౌర్ (12), యాస్తిక భాటియా (3) ఓ మాదిరిగా ఆడినా.. చివర్లో రిచా ఘోష్ (8 బాల్స్‌లో 1 ఫోర్, 2 సిక్స్‌లతో 20 నాటౌట్) చెలరేగింది. దీప్తి శర్మ (10 నాటౌట్) అండగా నిలవడంతో ఇండియా స్కోరు రెండొందలు దాటింది. కరోలినా డి లాంజ్ 2 వికెట్లు తీసింది.
ఛేజింగ్‌లో నెదర్లాండ్స్ 17.3 ఓవర్లలో 114 రన్స్‌కు ఆలౌటైంది. బబెటి డి లీడె (28) టాప్ స్కోరర్. ఇండియా బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్‌కు కట్టుబడటంతో డచ్ బ్యాటర్లు రన్స్ చేయడంలో ఫెయిలయ్యారు. హీథర్ సిజెర్స్ (21), ఫీబీ మోల్కెన్‌బోర్ (15) మంచి ఆరంభాన్నిచ్చినా.. మిడిలార్డర్ ఘోరంగా దెబ్బతీసింది. ఇన్నింగ్స్‌లో ఏడుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడంతో డచ్‌కు ఓటమి తప్పలేదు. స్మృతికి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
