
దుబాయ్: ఆసియా కప్‌లో ఇండియాకు తిరుగే లేదు. వరుసగా ఆరో విజయంతో అజేయంగా నిలిచి పాకిస్తాన్‌తో ఫైనల్ ఫైట్‌కు రెడీ అయింది. సూపర్– 4 చివరి పోరులో బ్యాటింగ్‌లో దుమ్మురేపిన ఇండియా.. సూపర్ ఓవర్లో శ్రీలంకను ఓడించి విజయాల సిక్సర్ కొట్టింది. శుక్రవారం రాత్రి ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ (31 బాల్స్‌లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 61) హ్యాట్రిక్ ఫిఫ్టీకి తిలక్ వర్మ (34 బాల్స్‌లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 49 నాటౌట్), సంజూ శాంసన్ (23 బాల్స్‌లో 1 ఫోర్, 3 సిక్సర్లతో39) మెరుపులు తోడవడంతో ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 202/5 స్కోరు చేసింది.
అనంతరం ఓపెనర్ పాతుమ్ నిశాంక (58 బాల్స్‌లో 7 ఫోర్లు, 6 సిక్సర్లతో 107) సెంచరీ, కుశాల్ పెరీరా (32 బాల్స్‌లో 8 ఫోర్లు, 1 సిక్స్‌తో 58) ఫిఫ్టీ కొట్టడంతో లంక కూడా ఓవర్లన్నీ ఆడి సరిగ్గా 202/5 స్కోరుతో మ్యాచ్‌ను టై చేసింది. సూపర్‌ఓవర్లో ఇండియా పేసర్‌అర్ష్‌దీప్ 1, 5వ బాల్స్‌కు కుశాల్ పెరీరా (0), షనక (0)ను ఔట్ చేసి లంకను రెండు రన్స్‌కే పరిమితం చేశాడు. ఆపై, హసరంగ బౌలింగ్‌లో సూర్య (3 నాటౌట్) ఫస్ట్ బాల్‌కే మూడు రన్స్ తీసి ఇండియాను గెలిపించాడు. నిశాంక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.
అభి అదే జోరు.. తిలక్, శాంసన్ మెరుపులు
పవర్‌ప్లేలో అభిషేక్.. ఆ తర్వాత తిలక్ వర్మ, శాంసన్ మెరుపులతో ఇండియా భారీ స్కోరు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇండియాకు ఓపెనర్ అభిషేక్ తన అలవాటు ప్రకారం విధ్వంసకర ఆరంభాన్నిచ్చాడు. ఇంకో ఓపెనర్ గిల్ (4) రెండో ఓవర్లోనే తీక్షణకు రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔటైనా.. అదే ఓవర్లో సిక్స్, ఫోర్ కొట్టిన అభి.. తుషార బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లతో మరింత స్పీడు పెంచాడు. ఐదో ఓవర్లో బౌలింగ్‌కు దిగిన దుష్మంత చమీరకు 6, 4, 4తో స్వాగతం పలికాడు. ఈ క్రమంలో వరుసగా మూడో ఫిఫ్టీ( 22 బాల్స్‌లోనే) కంప్లీట్ చేసుకోగా.. పవర్ ప్లేను ఇండియా 71/1తో ముగించింది.
మరో ఎండ్‌లో సూర్యకుమార్ (12) స్పిన్నర్ హసరంగ బౌలింగ్‌లో స్వీప్ షాట్ ట్రై చేసి ఎల్బీ అవగా.. తొమ్మిదో ఓవర్లో అభిని అసలంక ఔట్ చేశాడు. ఈ దశలో శాంసన్, తిలక్ ఇండియా ఇన్నింగ్స్‌ను తిరిగి గాడిలో పెట్టాడు. కుదురుకునేందుకు కాస్త టైమ్ తీసుకున్నా.. చెరో సిక్సర్‌తో ఆటకు మళ్లీ జోష్ తెచ్చారు. హసరంగ బౌలింగ్‌లో శాంసన్ కొట్టిన స్ట్రెయిట్ సిక్సర్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.
వీళ్ల జోరుకు15 ఓవర్లకే స్కోరు 150 దాటింది. షనక బౌలింగ్‌లో సిక్స్ బాదిన సంజూ అదే ఓవర్లో ఔటవ్వడంతో నాలుగో వికెట్‌కు 66 రన్స్ పార్ట్‌నర్‌షిప్ బ్రేక్ అయింది. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (3) ఫెయిలైనా స్లాగ్ ఓవర్లలో తిలక్ తన ధాటిని కొనసాగించాడు. తనకు మంచి సపోర్ట్ ఇచ్చిన అక్షర్ పటేల్ (21 నాటౌట్) ఇన్నింగ్స్ లాస్ట్ బాల్‌కు సిక్స్ కొట్టి స్కోరు 200 మార్కు దాటించాడు.
లంక ఫటాఫట్
గత రెండు మ్యాచ్‌ల్లో తీవ్రంగా నిరాశ పరిచిన లంక.. ఇండియాపై అనూహ్యంగా రెచ్చిపోయింది. ఇన్నింగ్స్ నాలుగో బాల్‌కే ఓపెనర్ కుశాల్ మెండిస్ (0)ను హార్దిక్ పాండ్యా డకౌట్‌చేసినా ఆ ఆనందం ఎంతోసేపు నిలువలేదు. మరో ఓపెనర్ నిశాంక, కుశాల్ పెరీరా ఆకాశమే హద్దుగా చెలరేగారు. పవర్ ప్లేను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించారు. అర్ష్‌దీప్ బౌలింగ్‌లో 6,4 కొట్టిన నిశాంక.. హర్షిత్ రాణా ఓవర్లో 4,6,6తో స్టేడియాన్ని హోరెత్తించాడు.
దాంతో పవర్‌ప్లేలోనే 72 రన్స్ వచ్చాయి. స్టార్ పేసర్ బుమ్రాతో పాటు ఆల్‌రౌండర్ దూబే లేకపోవడంతో ఇండియా బౌలింగ్ వీక్ అయింది. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లు కుల్దీప్, వరుణ్ చక్రవర్తిని కూడా అలవోకగా ఎదుర్కొన్న నిశాంక, పెరీరా ఫిఫ్టీలు పూర్తి చేసుకోగా 11 ఓవర్లకే 130/1తో నిలిచింది. తర్వాతి ఓవర్లో కుల్దీప్ 4 రన్సే ఇవ్వగా.. కుశాల్ పెరీరాను స్టంపౌట్ చేయడంతో రెండో వికెట్‌కు 127 రన్స్‌పార్ట్‌నర్‌షిప్ బ్రేక్ అయింది.
నిశాంక ధాటిని కొనసాగించినా.. మరో ఎండ్‌లో చరిత్ అసలంక (5)ను కుల్దీప్, కమిందు (3)ను అర్ష్‌దీప్ ఔట్‌చేయడంతో ఇండియా తిరిగి రేసులోకి వచ్చింది. 20 బాల్స్‌లో 40 రన్స్ అవసరమైన టైమ్‌లో నిశాంక.. భారీ సిక్స్‌తో సెంచరీ పూర్తి చేసుకోగా.. అక్షర్ బౌలింగ్‌లో షనక (22 నాటౌట్) కూడా సిక్స్ కొట్టి జట్టుపై ఒత్తిడి తగ్గించాడు. చివరి ఓవర్లో 12 రన్స్ అవసరం అవగా.. ఫస్ట్ బాల్‌కే నిశాంకను ఔట్ చేసిన రాణా షాకిచ్చినా.. షనక చివరి మూడు బాల్స్‌కు 2,4,2తో మ్యాచ్‌ను టై చేశాడు.
సంక్షిప్త స్కోర్లు
ఇండియా: 20 ఓవర్లలో 202/5 (అభిషేక్ 61, తిలక్ 49*, తీక్షణ 1/36);
శ్రీలంక: 20 ఓవర్లలో 202/5 (నిశాంక 107, కుశాల్ పెరీరా 58, పాండ్యా 1/7).