ఫిబ్రవరి నెలలో ఆల్ టైం హైకి ఇంధన వినియోగం..

ఫిబ్రవరి నెలలో ఆల్ టైం హైకి ఇంధన వినియోగం..

దేశంలో ఇంధనం ధరలతో పాటు వినియోగం కూడా రోజురోజుకూ విపరీతంగా పెరిగిపోతోంది. ఇది ఫిబ్రవరి నెలలో ఆల్ టైం రికార్డుకు చేరింది. సాధారణ వినియోగం కన్నా 5శాతం పెరిగి రోజుకు 4.82 మిలియన్ బ్యారెళ్లకు (18.5 మిలియన్ టన్నులు) చేరుకుంది. ఇంత పెద్ద మొత్తంలో ఇంధన వినియోగం రికార్డు కావడం గత రెండు దశాబ్దాలలోనే ఇదే మొదటిసారి కావడం గమనార్హం. 1998 తర్వాత ఇంత పెద్ద మొత్తంలో నమోదైందని పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (PPAC)  వెల్లడించింది. భారత్ లో ఇది 24 ఏళ్ల గరిష్టం అని పేర్కొంది.

ఫిబ్రవరిలో భారత్ లో పారిశ్రామిక కార్యకలాపాలు పెరగడంతో రికార్డు స్థాయిలో రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేయడం కూడా దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. రష్యా కూడా భారీ డిస్కౌంట్ ప్రకటించడంతో భారత్ ఇప్పటికే అక్కడ్నుంచి చమురు కొనుగోలు చేస్తుండగా.. ఇంతకుముందు నుంచి ఎగుమతిదారులుగా ఉన్న ఇరాక్, సౌదీ అరేబియాను పక్కకు నెట్టి రష్యా అగ్రస్థానంలో నిలబడింది. మొత్తంలో 35శాతం రష్యానే ఆక్రమించడం చెప్పుకోదగిన విషయం.

ఇక పెట్రోల్ అమ్మకాలు కూడా రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే గ్యాసోలిన్ అమ్మకాలు సంవత్సరానికి 8.9% పెరిగి 2.8 మిలియన్ టన్నులకు చేరుకోగా, డీజిల్ వినియోగం 7.5% పెరిగి 6.98 మిలియన్ టన్నులకు చేరుకుంది.  జెట్ ఇంధనం అమ్మకాలు కూడా 43% కంటే ఎక్కువ పెరిగి 0.62 మిలియన్ టన్నులకు చేరుకున్నాయి. రోడ్డు నిర్మాణ సామగ్రి అయిన బిటుమెన్ విక్రయాలు నెలవారీ ప్రాతిపదికన 21.5%, వంట గ్యాస్ లేదా లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) అమ్మకాలు 0.1% తగ్గి 2.39 మిలియన్ టన్నులకు చేరుకున్నాయి. ఇంధన చమురు వినియోగం జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో కేవలం 5% తగ్గింది.

మార్చిలో ఈ డిమాండ్ మరింత పెరిగి రోజుకు 5.17 మిలియన్ బారెల్స్ (bpd)గా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాలానుగుణంగా రుతుపవనాల ఆధారిత మందగమనం ఏప్రిల్-మేలో 5 మిలియన్ bpdకి పడిపోతుందని చెబుతున్నారు. ఇంధన డిమాండ్ పెరుగుదల వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థకు సంకేతమని, 2030 నాటికి భారతదేశం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఇంధన వినియోగదారుగా అవతరించనుందని అంతర్జాతీయ ఇంధన సంస్థ తెలిపింది.