భారతదేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగో (IndiGo) ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలు, విమానాల రద్దు సంక్షోభంపై కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. దీనికి సంబంధించి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (Ministry of Civil Aviation) నుండి వచ్చిన వివరాలు చుస్తే..
నవంబర్ 21 నుండి డిసెంబర్ 7 మధ్య ఇండిగో మొత్తం 827 కోట్ల టిక్కెట్ల డబ్బు తిరిగి ఇచ్చేసింది. ఈ రెండు వారాల మధ్య మొత్తం 9 లక్షల 55 వేల 591 టిక్కెట్లను రద్దు చేసింది. డిసెంబర్ 1 నుండి డిసెంబర్ 7 వరకు జస్ట్ ఒక్క వారం రోజుల్లోనే దాదాపు 6 లక్షల టిక్కెట్లకు (569 కోట్లు) డబ్బులు రీఫండ్ చేశారు.
అయితే కస్టమర్లు పోగొట్టుకున్న 9 వేల బ్యాగుల్లో దాదాపు 4,500 బ్యాగులను తిరిగి ఇచ్చేసారు. మిగిలిన బ్యాగులను కూడా మరో 36 గంటల్లో డెలివరీ చేయాలని చూస్తుంది.
విమానాల రద్దు సంక్షోభం మొదలయ్యే ముందు ఇండిగో రోజుకు సుమారు 2,200 విమానాలను నడిపేది. ప్రస్తుతం (సోమవారం) 137 గమ్యస్థానాలకు 1,802 విమానాలను నడపాలని ప్లాన్ చేసింది.
పరిస్థితిని పర్యవేక్షిస్తూ, సమస్యలను పరిష్కరించడానికి ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ బోర్డు ఒక ప్రత్యేక సంక్షోభ నిర్వహణ బృందాన్ని (CMG) ఏర్పాటు చేసింది.
ఈ CMG 100% ఫ్లయిట్ ఆపరేషన్స్ పునరుద్ధరించడం, సకాలంలో సమాచారం అందించడం, రీఫండ్‌లు/రీషెడ్యూల్ వేగవంతం చేయడం, లగేజ్ తిరిగి ఇవ్వడం చూసుకుంటుంది. కొత్తగా అమలైన ప్రభుత్వ నిబంధనల ప్రకారం (పైలట్ల పనివేళలపై – FDTL) సిబ్బంది లిస్ట్ (రోస్టర్) ప్లాన్లో మార్పులు చేయడంలో ఇండిగో విఫలమైంది.
దింతో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నైతో సహా చాల విమానాశ్రయాలలో వేల విమానాలు రద్దు కాగా.... ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇది ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (FDTL) నిబంధనల అమల్లో చేసిన తప్పు అంచనా వల్ల జరిగిందని ఇండిగో అంగీకరించింది.
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ సంక్షోభంపై పార్లమెంట్‌లో స్పందిస్తూ.. ఇండిగోపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. భవిష్యత్తులో ఇతర విమానయాన సంస్థలకు ఇది ఒక ఉదాహరణగా నిలుస్తుందని అన్నారు.
ప్రభుత్వం ఈ విషయంపై పూర్తి విచారణను ప్రారంభించిందని, నిబంధనలు ఉల్లంఘిస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
