పాక్ అణుకేంద్రంపై దాడికి ఇందిర ఒప్పుకోలే: అమెరికా సీఐఏ మాజీ ఆఫీసర్ రిచర్డ్ బార్లో కీలక వ్యాఖ్యలు

పాక్ అణుకేంద్రంపై దాడికి ఇందిర ఒప్పుకోలే: అమెరికా సీఐఏ మాజీ ఆఫీసర్ రిచర్డ్ బార్లో కీలక వ్యాఖ్యలు

వాషింగ్టన్: అమెరికా సీఐఏ మాజీ ఆఫీసర్ రిచర్డ్ బార్లో కీలక వ్యాఖ్యలు చేశారు. 1980 ప్రాంతంలో పాకిస్తాన్ అణుకేంద్రంపై దాడికి ఆనాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ ఒప్పుకోలేదని ఆయన తెలిపారు. ఒకవేళ ఆమె అంగీకరించి ఉంటే ఎన్నో సమస్యలు పరిష్కారమయ్యేవని చెప్పారు. మీడియా సంస్థ ఏఎన్‌‌‌‌ఐకి రిచర్డ్ బార్లో ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆనాడు అణుపరీక్షల కోసం పాక్ చేసిన సన్నద్ధతపై వివరించారు. కొన్ని రిపోర్టుల ప్రకారం.. పాక్‌‌‌‌లోని కహుతా అణుకేంద్రంపై దాడి చేయాలని ఇజ్రాయెల్, ఇండియా కోవర్ట్ ఆపరేషన్‌‌‌‌కు ప్రణాళిక రచించాయి. 

ఆ దేశం అణ్వాయుధాలను అభివృద్ధి చేయకుండా, వాటిని ఇతర దేశాలకు అందించకుండా చూసేందుకు ఈ దాడి చేయాలని నిర్ణయించాయి. తన బద్ధ శత్రువైన ఇరాన్‌‌‌‌కు పాక్‌‌‌‌ నుంచి అణ్వాయుధాలు అందకుండా చేయాలన్నది ఇజ్రాయెల్‌‌‌‌ లక్ష్యం. అయితే, ఈ కోవర్ట్ ఆపరేషన్‌‌‌‌కు ఆనాడు ఇందిరాగాంధీ అంగీకరించలేదని రిచర్డ్ బార్లో తెలిపారు.  ఆ ఆపరేషన్ జరిగి ఉంటే ఎన్నో సమస్యలు పరిష్కారమయ్యేవని పేర్కొన్నారు.

రీగన్ కూడా ఒప్పుకునేవారు కాదేమో.. 

ఆనాడు అమెరికా అధ్యక్షుడిగా ఉన్న రోనాల్డ్ రీగన్‌‌‌‌ కూడా ఇండియా, ఇజ్రాయెల్ కోవర్ట్ ఆపరేషన్‌‌‌‌ను వ్యతిరేకించి ఉండేవారేమోనని రిచర్డ్ బార్లో అభిప్రాయపడ్డారు. ఎందుకంటే ఆ సమయంలో అఫ్గానిస్తాన్‌‌‌‌లో సోవియట్‌‌‌‌ యూనియన్‌‌‌‌కు వ్యతిరేకంగా అమెరికా కోవర్ట్ ఆపరేషన్  ప్రయత్నాల్లో ఉందని, వాటికి అంతరాయం కలగొచ్చనే ఉద్దేశంతో ఇజ్రాయెల్ ప్రయత్నాలను తిరస్కరించి ఉండేదని పేర్కొన్నారు.