- నిర్మాణాలు పూర్తయిన వారు ఇండ్లళ్లకు పోతున్నరు
- జిల్లాకు శాంక్షన్ అయిన 10,779 ఇళ్లలో 3,620 నిర్మాణం పూర్తి
- ముహూర్తాలు ఉండడంతో గృహ ప్రవేశాలకు రెడీ అవుతున్న లబ్ధిదారులు
- నిర్మాణానికి సిద్ధంగా మరో 3 వేల ఇండ్లు
కరీంనగర్, వెలుగు: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లు చకచకా రెడీ అవుతున్నాయి. బీఆర్ఎస్ హయాంలో ఇటు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అందక, ఇంటి నిర్మాణానికి సర్కార్ సాయం చేయక.. ఇబ్బందులు పడిన పేదలు ఎట్టకేలకు సొంతింటి కలను నిజం చేసుకుంటున్నారు. ఇంటి నిర్మాణం పూర్తవుతున్నా కొద్దీ దశల వారీగా ఎప్పటికప్పుడు బిల్లులు వస్తుండడంతో యుద్ధప్రాతిపదికన ఇండ్లు కడుతున్నారు. జిల్లాలో 3,620 ఇళ్ల నిర్మాణం ఇప్పటికే పూర్తి కాగా ముహూర్తాలు ఉండడంతో సంబురంగా గృహ ప్రవేశాలు చేసుకుంటున్నారు.
దీంతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కుటుంబాల్లో సంతోషం నెలకొంది. ఫస్ట్ ఫేజ్ లో ప్రారంభించిన ఇళ్లను మార్చి 31లోగా పూర్తి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి డెడ్ లైన్ విధించడంతో అధికారులు క్షేత్ర స్థాయిలో లబ్ధిదారులను అప్రమత్తం చేస్తున్నారు.
జిల్లాకు 10,779 ఇళ్లు శాంక్షన్
కరీంనగర్‌జిల్లాలోని కరీంనగర్, హుజూరాబాద్, చొప్పదండి, హుస్నాబాద్, మానకొండూరు నియోజకవర్గాల పరిధిలోని 16 మండలాల్లో ప్రజాపాలన సభల్లో వచ్చిన అప్లికేషన్ల ఆధారంగా దరఖాస్తుదారులను ఎల్1, ఎల్ 2, ఎల్ 3 కేటగిరీలుగా విభజించింది. ఫస్ట్ ఫేజ్ లో మండలానికి ఓ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి ఆ గ్రామంలో ఇల్లు లేని పేదలందరికీ ఇళ్లు మంజూరు చేశారు. ఆ తర్వాత నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున జిల్లాకు 10,779 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో ఇప్పటి వరకు 7,690 ఇళ్లకు ముగ్గుపోయగా 6,424 పనులు మొదలుపెట్టారు. వీటిలో 9 నెలల్లో 3,620 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. 1,848 ఇళ్లు బేస్‌మెంట్ లెవల్ లో ఉండగా.. 956 రూఫ్ లెవల్ లో ఉన్నాయి. మరో 3,089 ఇళ్లకు ముగ్గులు పోసుకోవాల్సి ఉంది.
చిగురుమామిడి, చొప్పదండి, మానకొండూరులో వేగంగా..
జిల్లాలోని చొప్పదండి మండలానికి 584 ఇళ్లు మంజూరు కాగా 435 ఇళ్లకు ముగ్గుపోశారు. ఇందులో 395 నిర్మాణం చేపట్టగా.. 276 నిర్మాణం పూర్తయింది. అలాగే చిగురుమామిడి మండలానికి 341 ఇళ్లు మంజూరు కాగా 315 ఇళ్లకు ముగ్గుపోశారు. ఇందులో 286 నిర్మాణం చేపట్టగా.. 184 కంప్లీట్ అయ్యాయి. మానకొండూరు మండలానికి 852 ఇళ్లు మంజూరు కాగా 345 ఇళ్ల నిర్మాణం పూర్తయింది.
సొంతింటి కల నెరవేరింది..
సొంతిల్లు లేక ప్రభుత్వ సాయం కోసం పదేళ్లుగా ఎదురుచూస్తున్నాం. గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూం ఇల్లు వస్తదనుకున్నం కానీ రాలేదు. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక మాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. ఎప్పటికప్పుడు బిల్లులు మంజూరు కావడంతో ఇంటి నిర్మాణం పూర్తయింది. మాకు ఆర్థికంగా కూడా పెద్దగా ఇబ్బంది కాలే.. సొంతింటి కల నెరవేరినందుకు సంతోషంగా ఉన్నాం. - చల్లా రాజయ్య, కోమల, లబ్ధిదారులు, గండ్రపల్లి
