ఆకలికి తాళలేక లూటీలు..ఇండోనేసియాలో వర్షాలు వరదలకు రోడ్డున పడ్డ జనం

ఆకలికి తాళలేక లూటీలు..ఇండోనేసియాలో వర్షాలు వరదలకు రోడ్డున పడ్డ జనం
  •     సూపర్‌‌ మార్కెట్‌లో అందినకాడికి దోచుకెళ్తున్న ప్రజలు

మెడాన్‌: ఇండోనేసియా ప్రజలు ఆకలి, దాహంతో అలమటిస్తున్నారు. గత కొన్ని రోజులుగా అక్కడ కురుస్తున్న భారీ వర్షాలు, వరదలకు దేశంలోని చాలా ప్రాంతాల్లో ప్రజలు సర్వం కోల్పోయారు. ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి సహాయం అందకపోవడంతో సూపర్‌‌ మార్కెట్లను లూటీ చేస్తున్నారు. అందినకాడికి దోచుకెళ్తున్నారు. సుమత్రా ఐల్యాండ్‌లోని ప్రజలు స్టోర్స్‌లకు వెళ్లి అవసరమైన ఫుడ్‌, మెడిసిన్స్‌, వాటర్‌‌ను తీసుకెళ్తున్నారు. 

రోడ్లపై నడుము లోతు వరకు వరద ప్రవహిస్తున్నా.. రిస్క్‌ చేసి మాల్స్‌కు వెళ్లి ఫుడ్‌ తెచ్చుకుంటున్నారు. దీనికి సంబంధించి పలు వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. వర్షాలతో పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయని, రోడ్లు తెగిపోయాయని, దీంతో వరద ప్రభావిత ప్రాంతాలకు చేరుకునేందుకు ఇబ్బందిగా మారిందని అధికారులు తెలిపారు. 

దీనివల్లే సహాయ చర్యలకు ఆలస్యం అవుతుందని కేబినెట్‌ కార్యదర్శి టెడ్డీ ఇంద్ర విజయ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. సహాయం ఆలస్యం అవుతుండటంతో ప్రజలు స్టోర్ల మీద పడి దోచుకుంటున్నారని చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాలకు 11 హెలికాప్టర్ల ద్వారా ఫుడ్‌ను సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా, ఇండోనేసియాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటివరకు 442 మంది మరణించారు. మరో 400 మందికి పైగా వరదల్లో గల్లంతయ్యారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.