ఇండోనేషియా సుమత్రా ద్వీపంలో భారీ భూకంపం : అప్పట్లో సునామీ పుట్టింది కూడా ఇక్కడే

ఇండోనేషియా సుమత్రా ద్వీపంలో భారీ భూకంపం : అప్పట్లో సునామీ పుట్టింది కూడా ఇక్కడే

ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపంలో  భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‎పై భూకంప తీవ్రత 6.6గా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకారం  గురువారం(నవంబర్ 27) ఉదయం 10.26 గంటలకు  భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం కేవలం 10 కిలో మీటర్ల లోతులో కేంద్రీకృతమైనట్లు గుర్తించారు.   

భూప్రకంపనలతో తీవ్ర భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం నేపథ్యంలో ఇండోనేషియా ప్రభుత్వం అప్రమత్తమైంది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహయక చర్యలు చేపట్టింది. ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఎలాంటి సునామీ ముప్పు లేదని పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం తెలిపింది.

ఇండోనేసియాలో  ఇదే సుమత్రా ద్వీపం ప్రాంతంలో  2004 లో భారీ సునామీ వచ్చింది. ఆ ఏడాది డిసెంబర్ 26న ఈశాన్య సుమత్రా దీవుల్లో సంభవించిన సునామీలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఏడాది సంభవించిన సునామీ దెబ్బకు ఇండోనేసియా, భారత్, శ్రీలంకతోపాటు మరో తొమ్మిది దేశాల్లో కలిపి సుమారు 2.30 లక్షలకు పైగా ప్రజలు చనిపోయారు. 

భారీ భూకంపాలు

2021  డిసెంబర్ 14న  ఫోర్స్ ఐలాండ్ లో 7.6 తీవ్రత, 2023లో   తనింబర్ దీవుల సమీపంలో 7.6 తీవ్రత, 2025లో  ఇండోనేషియాలోని తనింబర్ దీవుల్లో 6.7 తీవ్రతతో భూకంపాలు రాగా.. ఇపుడు సుమత్రా ద్వీపంలో  6.6 భూకంపం వచ్చింది.