మళ్లీ క్షీణించిన లాలూ ప్రసాద్ ఆరోగ్యం

మళ్లీ క్షీణించిన లాలూ ప్రసాద్ ఆరోగ్యం

న్యూఢిల్లీ : ఆర్జేడీ చీఫ్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మళ్లీ క్షీణించింది. బుధవారం తెల్లవారుజామున ఆయనను డిశ్చార్జ్ చేసిన ఎయిమ్స్ డాక్టర్లు.. తిరిగి అడ్మిట్ చేసుకున్నారు. ప్రస్తుతం లాలూకు ట్రీట్మెంట్ కొనసాగుతోంది. లాలూ శరీరంలో ఇన్ఫెక్షన్ పెరుగుతోందని ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్ చెప్పారు. రాంచీ హాస్పిటల్లో నిర్వహించిన పరీక్షల్లో 4.5గా ఉన్న క్రియాటిన్ లెవెల్స్.. ఎయిమ్స్కు చేరుకునే సరికి 5.1కి పెరిగాయని, మరోసారి టెస్ట్ చేసే సమయానికి 5.9కి చేరిందని అన్నారు. 

ఇదిలా ఉంటే లాలూ ప్రసాద్కు ఎయిమ్స్లో ట్రీట్మెంట్ కొనసాగించడంపై హై డ్రామా నెలకొంది. రిమ్స్ వైద్యుల సూచన మేరకు మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో ఆయనను స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీ ఎయిమ్స్కు తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు లాలూ ఫిట్గా ఉన్నారంటూ తెల్లవారు జామున 3గంటల సమయంలో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. అయితే అర్థరాత్రి సమయంలో హడావిడిగా డిశ్చార్జ్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. లాలూ కిడ్నీ కేవలం 15 నుంచి 20శాతం సామర్థ్యంతోనే పని చేస్తోందని రిమ్స్ డాక్టర్ విద్యాపతి చెప్పినప్పటికీ ఎయిమ్స్ నుంచి ఆయనను డిశ్చార్జ్ చేయడంపై పలువురు మండిపడ్డారు.