పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగాయ్ ప్రయాణం నుంచి కిరాణా వరకూ ఎఫెక్ట్ ఎంతంటే..?

పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగాయ్ ప్రయాణం నుంచి కిరాణా వరకూ ఎఫెక్ట్ ఎంతంటే..?

మే 15వ తేదీ.. ఉదయం నిద్రలేవగానే సామాన్యుడి గుండె గుభేలుమంది. ఇన్నాళ్లూ ఊరిస్తున్న ముప్పు కాస్తా ముంచుకొచ్చింది. హోర్ముజ్ జలసంధిలో నెలకొన్న ఉద్రిక్తతలు, ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధంతో భారత సామాన్యుడి జీవితాన్ని భారంగా మార్చాయి. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలపై ఏకంగా రూ. 3 పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో మార్కెట్ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. 

దీనికి ముందు ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో సీఎన్‌జీ ధరలు కూడా రూ.2 పెరగడంతో రవాణా రంగం విలవిలలాడుతోంది. ఈ సెగ తెలుగు రాష్ట్రాలపై కూడా బలంగా తగిలింది. తాజా పెంపుతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.112 దాటగా.. విజయవాడ, విశాఖలో డీజిల్ రేటు సెంచరీ మార్కును దాటి పరుగులు తీస్తోంది. గడిచిన కొద్ది రోజులుగా స్థిరంగా ఉన్న ధరలు, ఒక్కసారిగా పెరగడంతో సామాన్యుడు బండి బయటకు తీయాలంటేనే వణికిపోతున్నాడు.

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 120 డాలర్ల వద్ద ఊగిసలాడుతుండటంతో ఆయిల్ కంపెనీలు నష్టాలను పూడ్చేందుకు ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదు. అయితే ఈ 3 రూపాయల పెంపు కేవలం క్రూడ్ కే పరిమితం కాలేదు. దీని ప్రభావం మల్టీప్లెక్స్ ఎఫెక్ట్‌లా ప్రతి రంగంపై పడనుంది. పొద్దున్నే వచ్చే పాలు, కూరగాయల నుంచి ప్యాక్డ్ ఫుడ్స్ వరకు అన్నింటి రేట్లు పెరిగిపోనున్నాయి. ముఖ్యంగా రవాణా ఛార్జీలు పెరగడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇంధన రెట్ల పెంపుతో టమోటాలు, ఉల్లిపాయలు, వంట నూనెల ధరలు మరోసారి సామాన్యుడి బడ్జెట్‌ను తలకిందులు చేయబోతున్నాయి. రవాణాదారులు ఇప్పటికే ఛార్జీల పెంపుపై యోచిస్తుండటంతో, డెలివరీ యాప్స్ నుంచి క్యాబ్ అగ్రిగేటర్ల వరకు అందరూ బాదుడుకు సిద్ధమవుతున్నారు.మరోవైపు విమానయాన రంగం కూడా కుదేలయ్యేలా ఉంది. ఇప్పటికే ఏటీఎఫ్ ధరలు పెరగడంతో విమాన టికెట్ల ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుకున్నాయి. పర్యాటక సీజన్ మొదలవుతున్న తరుణంలో ఈ పెంపు టూరిజం రంగాన్ని దెబ్బతీసేలా ఉంది. 

గ్రామాల్లోని రైతన్న పరిస్థితి ఇంకా దారుణంగా మారింది. ట్రాక్టర్లకు, పంపుసెట్లకు డీజిల్‌ వాడకం తప్పనిసరి కావడంతో సాగు ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రధాని మోడీ ఇదివరకే హెచ్చరించినట్టుగా దేశం ఆర్థిక క్రమశిక్షణ దిశగా అడుగులు వేస్తోంది. యుద్ధం ఎక్కడో జరుగుతున్నా.. దాని ప్రభావం మాత్రం భారతీయుల జేబును దహించివేస్తోంది. రేపటి రోజున ఇంకెన్ని ధరలు పెరుగుతాయోనన్న ఆందోళన ప్రతి ఒక్కరిలోనూ స్పష్టంగా కనిపిస్తోంది.