IPL 2025: రాజస్థాన్‎కు కోలుకోలేని ఎదురు దెబ్బ.. టోర్నీ నుంచి బౌలర్ సందీప్ శర్మ ఔట్

IPL 2025: రాజస్థాన్‎కు కోలుకోలేని ఎదురు దెబ్బ.. టోర్నీ నుంచి బౌలర్ సందీప్ శర్మ ఔట్

జైపూర్: ఐపీఎల్ 18లో రాజస్థాన్ రాయల్స్‎కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు స్టార్ బౌలర్ సందీప్ శర్మ మిగిలిన ఐపీఎల్ టోర్నీకి దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఆర్ఆర్ మేనేజ్మెంట్ గురువారం (మే 1) అఫిషియల్‎గా ప్రకటించింది. " చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో గాయంతోనే బౌలింగ్ కొనసాగించి సందీప్ శర్మ అపారమైన ధైర్యాన్ని ప్రదర్శించాడు. ఫ్రాంచైజీలోని ప్రతి ఒక్కరూ అతను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు’’ అని ఆర్ఆర్ ప్రకటనలో పేర్కొంది. సందీప్ స్థానాన్ని భర్తీ చేసేందుకు కసరత్తు మొదలుపెట్టామని.. త్వరలోనే కొత్త ఆటగాడిని ఎంపిక చేస్తామని ఆర్ఆర్ పేర్కొంది.  

కాగా, ఐపీఎల్ 18లో భాగంగా ఏప్రిల్ 28న గుజరాత్, రాజస్థాన్ తలపడ్డాయి. గుజరాత్ ఇన్సింగ్స్ సమయంలో శుభమన్ గిల్ కొట్టిన ఓ షాట్‎ను అడ్డుకోబోగా.. బంతి సందీప్ శర్మ చేతికి బలంగా తగిలింది. గాయంతోనే బౌలింగ్ కొనసాగించాడు సందీప్ శర్మ. మ్యాచ్ అనంతరం పరీక్షలు చేయగా.. సందీప్ శర్మ చేతి వేలు విరిగినట్లు తేలింది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో సందీప్ మిగిలిన టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. లీగ్ స్టేజ్ ముగింపు దశకు వచ్చిన సమయంలో సందీప్ శర్మ గాయంతో టోర్నీ నుంచి వైదొలగడం ఆర్ఆర్‎కు భారీ ఎదురు దెబ్బనేనని క్రీడా విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

ఈ సీజన్‎లో 10 మ్యాచ్‌లు ఆడిన సందీప్ శర్మ.. 9.89 ఎకానమీతో తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. ఆర్ఆర్ లో కీలక బౌలర్ గా ఉన్న సందీప్.. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇక, ఈ సీజన్‎లో ఇప్పటి వరకు 10 మ్యాచులు ఆడిన ఆర్ఆర్ 3 విజయాలు  సాధించి.. ఏడు మ్యాచుల్లో ఓటమి పాలై పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో కొనసాగుతోంది. అద్భుతం జరిగితే తప్ప.. ఈ సీజన్లో ఆర్ఆర్ ప్లే ఆఫ్స్‎కు చేరుకోవడం కష్టమే.