
- రైతులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దు
- ప్రభాకర్ కుటుంబాన్ని ఆదుకుంటం
- ఆయనను ఆత్మహత్యకు పురిగొల్పినోళ్లను వదిలిపెట్టం
- నిష్పక్షపాతంగా విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడి
- ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ప్రభాకర్ కుటుంబానికి పరామర్శ
మధిర, వెలుగు: రైతులకు అన్యాయం జరగనివ్వబోమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పారు. ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరుకు చెందిన ప్రభాకర్ కుటుంబాన్ని ఆదివారం భట్టి పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రభాకర్ ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని అన్నారు. ‘‘తన భూమిలో వేసిన మెరకను తొలగించారని మనస్తాపంతో ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నట్టు మీడియా ద్వారా తెలిసింది. ప్రభాకర్ తండ్రి, భార్యాపిల్లలతో మాట్లాడాను. ప్రాణం చాలా విలువైనది. మనం పుట్టింది బతకడానికి గానీ చావడానికి కాదు. ఎంత పెద్ద సమస్య ఉన్నా ఎక్కడో ఒకచోట పరిష్కార మార్గం వెతుక్కుని బతకడానికి ప్రయత్నం చేయాలి. ఎవరూ ఇలా ఆత్మహత్యలు చేసుకోవద్దు” అని విజ్ఞప్తి చేశారు.
ప్రభాకర్ ను ఆత్మహత్యకు పురిగొల్పినోళ్లను, అందుకు దారితీసిన పరిస్థితులను కల్పించినోళ్లను వదిలిపెట్టమని భట్టి అన్నారు. నిష్పక్షపాతంగా విచారణ చేసి బాధ్యులెవరైనా సరే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించానని చెప్పారు. ‘‘ఇక్కడ అందరూ మావాళ్లే. జరిగిన పొరపాటుకు ఎవరు కారణమైనా సరే.. ఎవరినీ వదిలిపెట్టేది లేదు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తాం. భూమి సమస్యకు కూడా శాశ్వత పరిష్కారం చూపిస్తాం.
చేపల సొసైటీ, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ ను ఆదేశించాను. పిల్లలు చదువుకోవడానికి ఏర్పాట్లు చేస్తాం. వాళ్లు ఎంతకాలం చదువుకుంటే అంతకాలం చదివిస్తాం. ఇతర కొన్ని సమస్యలను కూడా కుటుంబసభ్యులు నా దృష్టికి తీసుకొచ్చారు. వాటిని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటాం” అని తెలిపారు. ‘‘ఇక్కడ అందరూ మావాళ్లే.. ఇలాంటి ఘటనలపై రాజకీయాలు సరికాదు. ఏ పార్టీ వారైనా మనిషే. మనిషి ప్రాణం విలువైనది” అని అన్నారు.