మూన్నాళ్ల ముచ్చటగా మారిన దవాఖాన

మూన్నాళ్ల ముచ్చటగా మారిన దవాఖాన
  • టిమ్స్ లో ఇన్పేషెంట్  సేవలు బంద్
  • మూన్నాళ్ల ముచ్చటగా మారిన దవాఖాన 
  • టిమ్స్ కథ ముగిసినట్టేనని అంటున్న ఆఫీసర్లు

హైదరాబాద్, వెలుగు:  తెలంగాణ ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(టిమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) పేరిట గచ్చిబౌలిలో ప్రారంభించిన సర్కార్ దవాఖాన పరిస్థితి మూన్నాళ్ల ముచ్చటగా తయారైంది. రెనోవేషన్ పేరుతో, కరోనా తర్వాత ఈ దవాఖానలో ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేషెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సేవలు పూర్తిగా బంద్ పెట్టారు. ఆసుపత్రిలోని డాక్టర్లు, ఇతర స్టాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నగరంలోని ఇతర దవాఖాన్లకు పంపించారు. ప్రస్తుతం ఇక్కడ అవుట్ పేషెంట్ సేవలు మాత్రమే అందిస్తుండగా, అది కూడా అరకొరగానే మారింది. సగటున రోజూ 50 మందికి మించి పేషెంట్లు రావడం లేదు. ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేషెంట్ సర్వీస్ బంద్ పెట్టి 6 నెలలు అవుతున్నా, ఇప్పటికీ అక్కడ రెనోవేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పనులు పూర్తి కాలేదు. ఇప్పుడు అసలు అక్కడ పనులేవి జరగడం లేదు.  ఐదుగురు డాక్టర్లు, 18 మంది స్టాఫ్ నర్సులు సహా మొత్తం 70 మంది మంది స్టాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాత్రం పనిచేస్తున్నారు. పేషెంట్ల సంఖ్య అరకొరగానే ఉండడంతో, వీళ్లకు కూడా అక్కడ పెద్దగా పనేమీ లేదు. ఇదే విషయమై హెల్త్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఉన్నతాధికారులను ప్రశ్నిస్తే.. ఇప్పట్లో ఆ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రీఓపెన్ చేసే అవకాశం లేదని చెబుతున్నారు. ఓపీ సేవలు పూర్తిగా బంద్ పెడ్తే, ప్రభుత్వంపై విమర్శలు వచ్చే అవకాశం ఉన్నందున ఓపీ మాత్రం కంటిన్యూ చేస్తున్నామని చెబుతున్నారు.  

బెడ్లు దొరక్క పేషెంట్ల తిప్పలు

గ్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న జనాలకు ఇక్కడ ఉన్న దవాఖాన్లకు అస్సలు పొంతన లేదు. కోటి మంది జనాభాకు గాంధీ, ఉస్మానియా దవాఖాన్లే దిక్కు అవుతున్నాయి. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, టీడీపీ ప్రభుత్వాలు కొత్త దవాఖాన్లు కట్టకుండా నిర్లక్ష్యం చేశాయని, తాము కొత్త దవాఖాన్లు కట్టి పేదలకు ఉచిత వైద్య సేవలు అందిస్తామని చెప్పుకున్న టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ సర్కార్, రెండో పర్యాయం కూడా ముగుస్తున్నా.. ఒక్క కొత్త దవాఖాన కూడా నిర్మించలేదు. ఉస్మానియా ఓల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మూతపడడంతో, అక్కడ బెడ్ల సంఖ్య వెయ్యికి పడిపోయింది. పేషెంట్ లోడుకు సరిపడా బెడ్లు లేక, హాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పక్కపక్కనే బెడ్లు వేసి పడుకోబెడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇక్కడ తాను పనిచేయలేనని ఓ డాక్టర్ ఆవేదన వ్యక్తం చేస్తూ సుదీర్ఘ లేఖ రాసుకొచ్చారు. ఇక మిగిలింది ఒక్క గాంధీ దవాఖాన మాత్రమే. వర్షాకాలం సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గాంధీ కూడా పేషెంట్లతో కిక్కిరిసిపోతుంది. కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కోఠి డిస్ట్రిక్ట్ హాస్పిటల్, ఫీవర్ హాస్పిటల్, నీలోఫర్ హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పేషెంట్లకు బెడ్లు కూడా దొరకడం లేదు. నీలోఫర్ ప్రస్తుతం ఒక్క బెడ్డుపై ఇద్దరు, ముగ్గురు పిల్లల్ని పడుకోబెట్టి ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ అందిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కొత్తగా మరిన్ని దవాఖాన్లను అందుబాటులోకి తీసుకు రావాల్సిన ప్రభుత్వం, ఉన్న టిమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కూడా బంద్ పెట్టడంపై విమర్శలు వస్తున్నాయి.

మొదలవని పనులు

గచ్చిబౌలి టిమ్స్ ఏర్పాటుతో, నగరం చుట్టూ 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లు నిర్మిస్తామన్న హామీ అమల్లోకి తెచ్చే పని మొదలైందని ప్రభుత్వ పెద్దలు పదే పదే చెప్పుకొచ్చారు. అల్వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కొత్తపేట్, సనత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మరో 3 హాస్పిటళ్లు కడుతామని ప్రకటించారు. ఈ మూడు దవాఖాన్లకు సీఎం కేసీఆర్ భూమి పూజ కూడా చేశారు. కానీ, ఇప్పటివరకూ అక్కడ పనులేవి మొదలు కాలేదు. ఈ దవాఖాన్ల నిర్మాణం కోసం సుమారు రూ.10 వేల కోట్లు అప్పు తీసుకునేందుకు ఓ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సైతం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అప్పులు ఇప్పించేందుకు ముందుకొచ్చిన ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ క్యాపిటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రకరకాల కారణాలతో వెనక్కి తగ్గింది. అప్పుల వేట సక్సెస్ అయితే తప్ప, హాస్పిటళ్ల నిర్మాణ పనులు మొదలయ్యే అవకాశం లేదు అని అధికారులు చెబుతున్నారు.