ఇన్‌స్టంట్ నూడిల్స్ తింటున్నారా? యూరప్‌ను వణికిస్తున్న ప్రమాదకర బ్యాక్టీరియా.. సగం మంది ఆసుపత్రి పాలు

ఇన్‌స్టంట్ నూడిల్స్ తింటున్నారా? యూరప్‌ను వణికిస్తున్న ప్రమాదకర బ్యాక్టీరియా.. సగం మంది ఆసుపత్రి పాలు

రాత్రి వేళల్లో ఆకలి వేసినా, పిల్లలు స్నాక్స్ అడిగినా చాలామంది ఇళ్లల్లో వెంటనే గుర్తొచ్చేది ఇన్‌స్టంట్ నూడిల్స్. నిమిషాల్లో తయారైపోయే ఈ నూడిల్స్ ఇప్పుడు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ఫ్లేవర్డ్ ఇన్‌స్టంట్ నూడిల్స్ తిని యూరప్ దేశాల్లో ఏకంగా 106 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిలో దాదాపు సగం మంది పరిస్థితి విషమించడంతో ఆసుపత్రి పాలయ్యారు. బాధితుల్లో ఎక్కువ మంది చిన్నపిల్లలు, యువకులే ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

ఈ అనారోగ్యానికి 'సాల్మొనెల్లా స్టాన్లీ' అనే ప్రమాదకర బ్యాక్టీరియా కారణమని యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ వెల్లడించింది. ఉక్రెయిన్‌లోని ఒకే ఒక్క ఫ్యాక్టరీలో తయారైన నూడిల్స్ వల్లే ఈ ఇన్ఫెక్షన్ సోకినట్లు అధికారులు గుర్తించారు. అక్కడి నుండి పోలాండ్ హోల్‌సేలర్ ద్వారా జర్మనీ, డెన్మార్క్, బ్రిటన్ వంటి 14 దేశాలకు ఇవి సరఫరా అయ్యాయని గుర్తించింది.

ఒక్క కంపెనీ.. ఎన్నో రకాల బ్యాక్టీరియాలు:
ఎంతో ఇష్టంగా తినే చికెన్, హాట్ చికెన్, బీఫ్, డక్, రొయ్యలు, వెజిటబుల్ ఫ్లేవర్ నూడిల్స్ ప్యాకెట్లలో ఈ బ్యాక్టీరియా ఉన్నట్లు ల్యాబ్ పరీక్షల్లో బయటపడింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. కేవలం ఒక్క బ్యాక్టీరియా మాత్రమే కాకుండా 'రిచ్‌మండ్', 'న్యూపోర్ట్', 'సెన్‌ఫ్టెన్‌బర్గ్' అనే మరికొన్ని రకాల సాల్మొనెల్లా బ్యాక్టీరియాలు కూడా ఈ నూడిల్స్ ప్యాకెట్లలో లభ్యమయ్యాయి. దీనిని బట్టి తయారీ కేంద్రంలో లేదా వాడిన మసాలా దినుసుల్లో లోపాలు ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

ప్రస్తుతానికి సదరు కంపెనీ ఉత్పత్తులను మార్కెట్ నుండి వెనక్కి తీసుకున్నప్పటికీ, ముప్పు ఇంకా పొంచే ఉంది. ఎందుకంటే ఇన్‌స్టంట్ నూడిల్స్ నెలల తరబడి పాడవకుండా ఉంటాయి. చాలామంది వీటిని కొని ఇంట్లోని అల్మారాల్లో స్టాక్ పెట్టుకుంటారు. తెలియక వాటిని తింటే ఇన్ఫెక్షన్ బారిన పడే ప్రమాదం ఉంది.

ALSO READ : కీవ్‌‌‌‌‌‌‌‌పై మిసైల్స్, డ్రోన్లతోరష్యా భీకర దాడి..

ఈ బ్యాక్టీరియా వల్ల విరేచనాలు, కడుపునొప్పి, జ్వరం, వాంతులు అవుతాయి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే పిల్లలు, వృద్ధులకు ఇది మరింత ప్రమాదకరం. సో నూడిల్స్ కొనేటప్పుడు కంపెనీ వివరాలను గమనించాలి. అలాగే నూడిల్స్ వండేటప్పుడు ప్యాకెట్‌పై ఉన్న సూచనల ప్రకారం పూర్తిగా ఉడికించిన తర్వాతే తినాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాస్త అజాగ్రత్తగా ఉన్నా ఆస్పత్రి పాలవక తప్పదు.