మావోయిస్టుల కోసం అడవుల్లో ముమ్మర వేట

మావోయిస్టుల కోసం అడవుల్లో ముమ్మర వేట

ఆరు నెలలుగా ఆసిఫాబాద్​ నుంచి భద్రాద్రి వరకు ముమ్మర వేట

ఆడెల్లి మొదలు రాజిరెడ్డి వరకు జస్ట్​లో మిస్సయ్యారట!

ములుగు జిల్లాలో టీఆర్​ఎస్ ​లీడర్​ హత్య తర్వాత జిల్లా కేంద్రాలకే పరిమితమైన లీడర్లు

తాము ఏజెన్సీ పల్లెల్లో ఎప్పుడు అడుగుపెట్టాలని ప్రశ్నిస్తున్న ప్రజాప్రతినిధులు

జయశంకర్‌ ‌భూపాలపల్లి, వెలుగు: తెలంగాణ అటవీ గ్రామాల్లో మావోయిస్టుల అలజడి పెరిగిందని, కొత్త రిక్రూట్​మెంట్​ జరుగుతోందని చెబుతున్న పోలీస్ ఆఫీసర్లు, వారిని పట్టుకోవడంలో మాత్రం సక్సెస్ కావట్లేదు. కరోనా లాక్​డౌన్​ టైం నుంచి గడిచిన ఆరు నెలలుగా అసిఫాబాద్‌‌ నుంచి భద్రాద్రి కొత్తగూడెం వరకు వేలాది మంది పోలీస్​ బలగాలతో అడవులు, అటవీ గ్రామాలను జల్లెడ పడుతున్నా ఇప్పటివరకు ఏ ఒక్కమావోయిస్టు నేత చిక్కలేదు. తిర్యాణి అడవుల్లో ఆడెల్లి మొదలుకొని తాజాగా మహాదేవ్​పూర్​ అడవుల్లో రాజిరెడ్డి వరకు జస్ట్‌ మిస్సయ్యారనే ప్రకటనలు చేస్తున్నారు. మావోయిస్టుల డైరీలు, కిట్‌‌బ్యాగులు దొరికాయంటూ పలువురు సానుభూతిపరులను అరెస్ట్​ చేయడం తప్ప పోలీసులు కీలక నేతలెవరినీ పట్టుకోవడంగాని, సరెండర్​గాని చేయించలేకపోయారు. మరోవైపు ములుగు జిల్లాలో టీఆర్​ఎస్ ​నేత హత్య తర్వాత వివిధ పార్టీల లీడర్లు భయంతో జిల్లా కేంద్రాలకే పరిమితమయ్యారు. పోలీసుల సూచనల మేరకు అటవీ గ్రామాల్లో అడుగుపెట్టడం లేదు.  తాజాగా దీపావళి పండుగకూ రాలేకపోయారు. ‘మావోయిస్టులు ఎప్పుడు దొరుకుతారో, అప్పటిదాకా మేం ఊళ్లలో అడుగుపెట్టద్దా?’ అని వివిధ పార్టీల నేతలు పోలీసులను ప్రశ్నిస్తున్నారు.

త్రుటిలో తప్పించుకుపోతున్నరు..

కరోనా లాక్​డౌన్​ తర్వాత మే నుంచి ఉమ్మడి ఆదిలాబాద్​, వరంగల్​, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మావోయిస్టుల కార్యకలాపాలు పెరుగుతున్నాయని పోలీసులు  చెబుతున్నారు.  హరిభూషణ్​ సెక్రెటరీగా తెలంగాణ స్టేట్​ కమిటీని మావోయిస్టులు ప్రకటించారని, వారిలో బండి ప్రకాష్​, బడే చొక్కారావు, మైలారపు ఆడెల్లు, కొయ్యడ సాంబయ్య, కంకణాల రాజిరెడ్డి  మెంబర్లుగా ఉన్నారని పోలీసులే పలు సందర్భాల్లో ప్రకటించారు. వారి కోసం వందలాది సీఆర్పీఎఫ్‌‌​, గ్రేహౌండ్స్​, స్పెషల్​ పార్టీ పోలీసులతో కూంబింగ్​ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గత జూలైలో మైలారపు అడెల్లు అలియాస్​ భాస్కర్​ టీమ్​ తిర్యాణి అడవుల్లో పోలీసులకు చిక్కినట్లే చిక్కి తప్పించుకుపోయిందని అక్కడి ఎస్పీ చెప్పారు.  ఆడెల్లు డైరీ తమకు దొరికిందన్న ఆయన అందులో సానుభూతి పరుల పేరిట10మంది  గిరిజన యువకులను అదుపులోకి తీసుకున్నారు.  తాజాగా నవంబర్​10న  భూపాలపల్లి జిల్లా మహాదేవ్‌‌పూర్‌‌ అడవుల్లో  కంకణాల రాజిరెడ్డి ఆధ్వర్యంలోని మావోయిస్టు దళం తప్పించుకు పోయిందని అంటున్నారు. అక్కడ 9 కిట్‌‌బ్యాగులు, 303 రైఫిల్‌‌, 9 బుల్లెట్లను   స్వాధీనం చేసుకున్నట్లు మీడియా ముందు చూపారు. అంతకుముందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు, ఏడూళ్ల బయ్యారం, గుండాల మరియు కరకగూడెం అటవీ ప్రాంతాల్లోనూ  ఓ మావోయిస్టు టీం ఇలాగే తప్పించుకుందని సామాగ్రిని ప్రదర్శించారు.

దీపావళికి వెళ్లలేకపోయిన లీడర్లు..

మావోయిస్టు పార్టీకి చెందిన సీనియర్లు లొంగిపోతున్నారని చెప్పి, ఆడెల్లు టీమ్​ను సరెండర్​ చేయించేందుకు పోలీసులు ప్రయత్నించారనే వార్తలు వచ్చాయి. స్వయంగా ఆసిఫాబాద్​లో డీజీపీ మకాం వేసినా ఈ దిశలో సక్సెస్​ కాలేకపోయారనే విమర్శలు వినిపించాయి. అటు తర్వాత అడపాదడపా జరిగిన ఎన్​కౌంటర్లలో పలువురు మావోయిస్టులు చనిపోయినా అందులో ఒకరిద్దరు తప్ప ఎవరూ లోకల్​వాళ్లు లేరు. కానీ అదే టైంలో అక్టోబర్​10న మావోయిస్టులు ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాకలో మాడూరి భీమేశ్వర్​రావు అనే టీఆర్‌‌ఎస్‌‌ లీడర్​ను హతమార్చడం కలకలం రేపింది. దీంతో ప్రజాప్రతినిధులెవ్వరూ  ఏజెన్సీ గ్రామాల్లోకి రావద్దని పోలీసులు అలెర్ట్‌‌చేశారు. అప్పటి నుంచి వివిధ పార్టీలకు చెందిన లీడర్లతో పాటు సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులంతా జిల్లాకేంద్రాలకే పరిమితయ్యారు. మొన్నటి దసరా, నిన్నటి దీపావళి పండుగ కూడా చాలామంది ఊళ్లకు రాలేకపోయారు.  మావోయిస్టుల ఏరివేత కార్యక్రమాన్ని పోలీసులు ఎప్పటికి పూర్తిచేస్తారోగానీ తాము మాత్రం  సొంత గ్రామాలకు వెళ్లలేకపోతున్నామని, అక్కడ ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేకపోతున్నామని ప్రజాప్రతినిధులు వాపోతున్నారు.

స్పెషల్ పోలీస్ టీమ్ లతో కూంబింగ్‌‌

భూపాలపల్లి , ములుగు జిల్లాల్లో మావోయిస్టులు తిరుగుతున్నారనే పక్కా సమాచారం ఉంది. గ్రేహౌండ్స్, స్పెషల్ పోలీస్ టీమ్ లతో అటవీ ప్రాంతంలో ముమ్మర కూంబింగ్ నిర్వహిస్తున్నాం. మావోయిస్టుల కదలికలను ఎప్పటికప్పుడు నిఘా వర్గాల ద్వారా సేకరిస్తున్నాం. పక్క రాష్ట్రాల, జిల్లాల ఆఫీసర్లతో సమన్వయం చేసుకుంటూ అలర్ట్​గా ఉంటున్నాం. మావోయిస్టులకు ప్రజలెవరూ ఆశ్రయం, ఆహారం, ఇతర సదుపాయాలు కల్పించవద్దు. ‒శోభన్‌‌ కుమార్‌‌, భూపాలపల్లి,
ములుగు జిల్లా ల ఓఎస్‌‌డీ.