- ఎగ్జామ్ హాల్‌లో బల్లలు ఉండాల్సిందే: ఇంటర్ బోర్డు
- సెంటర్లలో సీసీ కెమెరాలు మస్ట్.. లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరిక
హైదరాబాద్, వెలుగు: ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థులను నేల మీద కూర్చోబెట్టవద్దని, ప్రతి విద్యార్థికీ డ్యూయల్ డెస్క్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఇంటర్మీడియెట్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య అధికారులను ఆదేశించారు. ప్రతి పరీక్ష కేంద్రం కచ్చితంగా సీసీ టీవీ సర్వైలెన్స్‌లో ఉండాలని, ఎక్కడా మాల్ ప్రాక్టీస్‌కు తావు ఇవ్వొద్దని సూచించారు. ఈ నెలాఖరు నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ పరీక్షల ఏర్పాట్లపై గురువారం నాంపల్లిలోని విద్యాభవన్‌లో డీఐఈవోలు, జిల్లా ఎగ్జామినేషన్ కమిటీ సభ్యులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణపై పలు కీలక సూచనలు చేశారు. స్టూడెంట్ల సౌకర్యార్థం పరీక్ష కేంద్రంలోని ప్రతి హాల్‌లో వాల్ క్లాక్, ఫ్యాన్లు, సరైన వెలుతురు ఉండేలా చూడాలని సూచించారు. తాగునీరు, పూర్తిగా పనిచేసే టాయిలెట్స్ అందుబాటులో ఉంచాలని, అన్ని వసతులపై కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలని స్పష్టం చేశారు. పరీక్షల డ్యూటీలో అనుభవం ఉన్నవారినే నియమించాలని, వారి వివరాలను పకడ్బందీగా వెరిఫై చేయాలని ఆదేశించారు.
