27 నుంచి ఇంటర్ కాలేజీల అఫిలియేషన్‌‌‌‌కు దరఖాస్తులు

27 నుంచి ఇంటర్ కాలేజీల అఫిలియేషన్‌‌‌‌కు దరఖాస్తులు

నోటిఫికేషన్‌‌‌‌ను విడుదల చేసిన ఇంటర్ బోర్డు

హైదరాబాద్, వెలుగు: ఇంటర్మీడియెట్ కాలేజీల అఫిలియేషన్, అదనపు సెక్షన్ల అనుమతుల కోసం దరఖాస్తు పక్రియను ఇంటర్ బోర్డు ప్రారంభించనుంది. 2024–25 విద్యా సంవత్సరానికి గాను ఈ నెల 27 నుంచి ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించింది.

నాలుగు ఒరిజినల్(పర్మనెంట్) సెక్షన్లు, వాటికి అదనంగా మరో ఐదు అదనపు సెక్షన్లకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశమిస్తూ శనివారం ఇంటర్ బోర్డు సెక్రటరీ శృతి ఓజా నోటిఫికేషన్‌‌‌‌ను విడుదల చేశారు. అనుమతుల్లేకుండా కొత్త సెక్షన్లను ఓపెన్ చేయరాదని స్పష్టం చేశారు. ఏరియా, కాలేజీలను బట్టి అఫిలియేషన్ ఫీజు, ఇన్‌‌‌‌స్పెక్షన్ ఫీజులను ఇంటర్ బోర్డు నిర్ధారించింది. 

ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లోనే చెల్లించాలె..

అఫిలియేషన్ దరఖాస్తులను ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో చేసుకోవాలని ఆయా కాలేజీలకు ఇంటర్ బోర్డు సూచించింది. acadtsbie.cgg.gov.in లేదా tsbie.cgg.gov.in వెబ్‌‌‌‌సైట్లలో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఈ నెల 27 నుంచి వచ్చే నెల 31 వరకు అఫిలియేషన్ల దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించింది. రూ.వెయ్యి లేటు ఫీజుతో ఏప్రిల్ 7, రూ.5 వేల లేట్ ఫీజుతో ఏప్రిల్ 14, రూ.10 వేల లేట్ ఫీజుతో ఏప్రిల్ 21, రూ.15 వేల లేట్ ఫీజుతో ఏప్రిల్ 28, రూ.20 వేల లేట్ ఫీజుతో మే 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.

ఈ ఫీజులను ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లోనే చెల్లించాలని స్పష్టం చేసింది. డీడీలు, చలాన్ల ద్వారా కడితే అప్లికేషన్లను రిజెక్ట్ చేస్తామని తెలిపింది. కాగా, కాలేజీల షిఫ్టింగ్ (ఆ కాలేజీ ఉన్న ప్రాంతంలోనే), సొసైటీ పేరు మార్పు, కాలేజీల పేరు మార్పు, బాయ్స్/గర్ల్స్ కాలేజీలను కోఎడ్యుకేషన్‌‌‌‌గా మార్చుకునేందుకు లేదా కో ఎడ్యుకేషన్ కాలేజీలను బాయ్స్/గర్ల్స్ కాలేజీలుగా మార్చుకునేందుకు అఫిలియేషన్లతో పాటే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.