చెక్‌‌‌‌‌‌‌‌పోస్ట్‌‌‌‌‌‌‌‌లు ఎత్తేసినా.. ఆగని దందా.. దండుకుంటున్న వైనం..ఎన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ టీంల పేరుతో తనిఖీలు, వసూళ్లు

చెక్‌‌‌‌‌‌‌‌పోస్ట్‌‌‌‌‌‌‌‌లు ఎత్తేసినా.. ఆగని దందా.. దండుకుంటున్న వైనం..ఎన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ టీంల పేరుతో తనిఖీలు, వసూళ్లు
  • చెక్‌‌‌‌‌‌‌‌పోస్ట్‌‌‌‌‌‌‌‌లు ఎత్తేసి రెండు నెలలు
  • అయినా ఆఫీసర్లు, ఉద్యోగులకు ఇతర బాధ్యతలు అప్పగించలే...
  • ఇదే అదనుగా ముందుకు సాగని అడ్వాన్డ్స్‌‌‌‌‌‌‌‌ కెమెరాల ఏర్పాటు పనులు

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో రవాణా శాఖకు చెందిన అంతర్‌‌‌‌‌‌‌‌ రాష్ట్ర చెక్‌‌‌‌‌‌‌‌పోస్టులను ప్రభుత్వం ఎత్తేసినా ఆఫీసర్ల ‘వసూళ్ల దందా’ మాత్రం ఆగడం లేదు. ఇంతకు ముందు చెక్‌‌‌‌‌‌‌‌పోస్టులు ఉన్న చోటుకు సమీపంలోనే.. ఇప్పుడు మకాం వేసిన ఎన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ టీంలు తమ వసూళ్ల పర్వాన్ని యథావిధిగా కొనసాగిస్తున్నాయి. 

రాష్ట్రంలోని మొత్తం 15 చెక్‌‌‌‌‌‌‌‌ పోస్ట్‌‌‌‌‌‌‌‌లను ఈ ఏడాది అక్టోబర్‌‌‌‌‌‌‌‌లోనే ప్రభుత్వం ఎత్తేసింది. కానీ అందులో పనిచేసే 75 మంది ఆఫీసర్లు, ఉద్యోగులను వేరే చోటికి బదిలీ చేయకుండా వారికే ఎన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ బాధ్యతలు అప్పగించారు. 

దీంతో వారు రోడ్లపైన అడ్డా వేసి వచ్చిన వాహనాలను వచ్చినట్లుగా తనిఖీలు చేస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. వీళ్ల వ్యవహారం చూసిన వాహన డ్రైవర్లు, యజమానులు... ఈ మాత్రానికి చెక్‌‌‌‌‌‌‌‌పోస్ట్‌‌‌‌‌‌‌‌లు ఎందుకు ఎత్తేయడం అంటూ ప్రశ్నిస్తున్నారు. పేరుకే చెక్‌‌‌‌‌‌‌‌పోస్టులు ఎత్తేశారు తప్ప వసూళ్లు మాత్రం ఆగలేదని వాహన డ్రైవర్లు, యజమానులు ఆరోపిస్తున్నారు. 

అవినీతి బయటపడడంతో...

చెక్‌‌‌‌‌‌‌‌పోస్టుల్లో రవాణా శాఖ అధికారులు అడ్డగోలుగా అవినీతికి పాల్పడుతున్నారంటూ గతంలో సీఎంవోకు  పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందడంతో ఏసీబీని రంగంలోకి దించారు. ఆ సంస్థ చెక్‌‌‌‌‌‌‌‌పోస్టులపై దాడి చేయగా.. అక్కడ పనిచేసే ఆఫీసర్లు, ఉద్యోగుల వద్ద భారీమొత్తంలో లెక్క తేలని నగదు దొరికింది. దీంతో రవాణా శాఖలో అవినీతికి అడ్డుకట్ట వేయాలన్న ఉద్దేశంతో సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి చెక్‌‌‌‌‌‌‌‌ పోస్టుల రద్దుకు ఆదేశాలు ఇచ్చారు. 

చెక్‌‌‌‌‌‌‌‌పోస్ట్‌‌‌‌‌‌‌‌లను ఎత్తేయడంతో అంతర్రాష్ట్ర రహదారులపై ప్రయాణించే వాహనదారులు.. తమకు తనిఖీల బాధ తప్పిందని, సమయం ఆదా అవుతుందని సంబురపడ్డారు. చెక్‌‌‌‌‌‌‌‌పోస్ట్‌‌‌‌‌‌‌‌ల స్థానంలో అడ్వాన్డ్స్‌‌‌‌‌‌‌‌ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని డైరెక్ట్‌‌‌‌‌‌‌‌గా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ ఖైరతాబాద్‌‌‌‌‌‌‌‌లోని ఆర్టీఏ కేంద్ర కార్యాలయానికి అనుసంధానిస్తామని రవాణా శాఖ ఉన్నతాధికారులు ప్రకటించారు. 

చెక్‌‌‌‌‌‌‌‌పోస్టుల్లో పనిచేసే ఆఫీసర్లు, ఉద్యోగులను ఇతర ప్రాంతాలకు, ఖాళీలు ఉన్న చోటుకు బదిలీ చేస్తామని చెప్పారు. వే బిల్లులు, ఇతర రకాల పన్నులకు సంబంధించి ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో పేమెంట్‌‌‌‌‌‌‌‌ చేసుకుంటే అంతర్రాష్ట్ర వాహనాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ప్రకటించారు. కానీ ప్రస్తుత పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపించడంతో వాహనదారులు ఖంగుతిన్నారు. 

రోడ్డు పక్కన ఉండే చెక్‌‌‌‌‌‌‌‌పోస్ట్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌, రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు, డ్రమ్ములు మాత్రమే కనిపించడం లేదు గానీ.. రోడ్డు పక్కన ఎన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ టీంలు అడ్డావేసి వాహనాలను ఆపడం, తనిఖీలు చేయడం, బిల్లులు, రూల్స్‌‌‌‌‌‌‌‌ పేరుతో వసూళ్లకు పాల్పడుతుండడం షరా మాములుగానే మారింది. 

అవగాహన కల్పిస్తున్నామంటున్న ఆఫీసర్లు

రహదారులపై చెక్‌‌‌‌‌‌‌‌పోస్టులు లేకపోయినా వాటి స్థానంలో ఎన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ టీంలు పనిచేస్తాయని ఆ శాఖ ఆఫీసర్లు చెబుతున్నారు. ప్రతి జిల్లాకు ఓ ఎన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ టీం, స్టేట్‌‌‌‌‌‌‌‌ మొత్తానికి విజిలెన్స్‌‌‌‌‌‌‌‌ టీం ఉంటుందన్నారు. ఈ టీంలు ఎప్పటికప్పుడు రోడ్లపై తనిఖీలు చేస్తూ రూల్స్‌‌‌‌‌‌‌‌ పాటించని అంతర్‌‌‌‌‌‌‌‌ రాష్ట్ర వాహనాలపై నిఘా వేస్తాయని ఆ శాఖకు చెందిన ఓ అధికారి వెల్లడించారు. 

చెక్‌‌‌‌‌‌‌‌పోస్ట్‌‌‌‌‌‌‌‌ల వద్ద అడ్వాన్డ్స్‌‌‌‌‌‌‌‌ కెమెరాల ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయని, ఒక్కో చెక్ పోస్టు వద్ద రెండు కెమెరాలతో పాటు ఇతర ప్రధాన రహదారులపై కూడా ఒక్కో కెమెరా చొప్పున మొత్తం 15 ప్రధాన రూట్లలో ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. మొత్తం 30 కెమెరాలకు టెండర్లు కూడా పిలిచామని చెప్పారు. కెమెరాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి కాగానే అవినీతికి ఆస్కారం ఉండదన్నారు.

 ప్రస్తుతం కొందరు వాహనదారులు ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో పేమెంట్‌‌‌‌‌‌‌‌ చేస్తూ పర్మిట్‌‌‌‌‌‌‌‌లు పొందుతున్నారని, ఈ విషయంపై ఇంకా చాలామందికి అవగాహన రావాల్సి ఉందన్నారు. గతంలో చెక్‌‌‌‌‌‌‌‌పోస్టులు ఉన్న చోట పేమెంట్‌‌‌‌‌‌‌‌విధానంపై బోర్డులు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నామని ఆ అధికారి వివరించారు.