ముత్యాల సాగుతో డబుల్ ఇన్కం.. గతంలో ఉత్తరాదికే పరిమితం.. ఇప్పుడు తెలంగాణలోనూ..

ముత్యాల సాగుతో డబుల్ ఇన్కం.. గతంలో ఉత్తరాదికే పరిమితం.. ఇప్పుడు తెలంగాణలోనూ..
  • ఇప్పుడు తెలంగాణలోనూ తక్కువ శ్రమ, అతి తక్కువ విస్తీర్ణంలో ఆల్చిప్పల పెంపకం
  • బై బ్యాక్ అగ్రిమెంట్తో ముత్యాలను కొనుగోలు చేస్తున్న ప్రైవేట్​కంపెనీలు
  • పీఎంఎంఎస్​వై, ఎన్​ఎఫ్​బీడీ ద్వారా రైతులకు సబ్సిడీలు అందజేత
  • సిరొంచ, మహదేవపూర్​లో ఇద్దరు యువ గ్రాడ్యుయేట్ల సక్సెస్​ఫుల్​ సాగు
  • వాళ్లను చూసి ముందుకొస్తున్న మరికొంత మంది ఔత్సాహిక రైతులు

మంచిర్యాల, వెలుగు: ఇప్పటివరకు ఉత్తరాది రాష్ట్రాలకే పరిమితమైన ముత్యాల సాగుపై మన దగ్గరా క్రేజ్​ పెరుగుతున్నది. ఆర్నమెంట్స్, మెడిసిన్స్, కాస్మొటిక్స్ తయారీలో విరివిగా ఉపయోగించే ముత్యాలకు దేశ, విదేశాల్లో మంచి డిమాండ్​ఉన్నది. తక్కువ శ్రమ, అతి తక్కువ విస్తీర్ణంలో పెట్టే పెట్టుబడికి డబుల్ ఇన్​కమ్​ వచ్చే లాభాల పంట ఇది. ఇప్పుడిప్పుడే మన రైతులు దీనిపై ఇంట్రెస్ట్ చూపుతున్నారు.

దేశంలో మహారాష్ట్ర, ఒడిశా, బెంగాల్, బిహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున పెరల్ ఫార్మింగ్ చేస్తున్నారు. తెలంగాణ, ఏపీలోనూ పలువురు ఔత్సాహిక రైతులు చిన్న పెట్టుబడితో మొదలుపెట్టి క్రమంగా విస్తరిస్తున్నారు. మంచిర్యాల జిల్లాకు పొరుగున ఉన్న మహారాష్ర్ట సిరొంచలో రవి బొంగోనివార్ అనే యువ బీఎస్సీ బయోటెక్నాలజీ గ్రాడ్యుయేట్ పెరల్ ఫార్మింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చుట్టుపక్కల రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం మోదెడలో అగ్రికల్చర్ డిప్లొమా గ్రాడ్యుయేట్ ఠాకూర్ పవన్​సింగ్ భారీ పెట్టుబడితో పెరల్ ఫార్మింగ్ చేస్తున్నాడు. వీళ్లను చూసి మంచిర్యాల జిల్లా చెన్నూర్​ మండలం ఆస్నాద్‌‌‌‌లో ఈ ఏడాది పలువురు రైతులు ముత్యాల సాగుకు ముందుకొచ్చారు. జనగామ జిల్లా దేవరుప్పల మండల కేంద్రానికి చెందిన షేక్ సలీం, సూర్యాపేట జిల్లా నడికుడ మండలం సిరికొండలో శేషుకుమార్ తదితరులు గత కొన్నేండ్లుగా ముత్యాల సాగుతో మంచి లాభాలు ఆర్జిస్తున్నారు.

బై బ్యాక్ అగ్రిమెంట్తో కొనుగోలు..
పెరల్ ఫార్మింగ్ మనకు కొత్త అయినప్పటికీ ఉత్తరాది రాష్ట్రాల్లో దశాబ్దాల నుంచి సాగులో ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్​వై) ద్వారా పెరల్ ఫార్మింగ్​ను ఎంకరేజ్ చేస్తున్నది.

హైదరాబాద్​లోని నేషనల్ ఫిషరీస్ డెవలప్​మెంట్ బోర్డు (ఎన్‌‌‌‌ఎఫ్‌‌‌‌డీబీ) ఔత్సాహిక రైతులకు ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా భారీ ఇన్వెస్ట్​మెంట్‌‌‌‌తో యూనిట్లు ప్రారంభించాలనుకునే వారికి 35 పర్సెంట్​ వరకు సబ్సిడీలు ఇస్తున్నది. అయితే రైతులకు నేరుగా మార్కెటింగ్ చేసుకునే సౌకర్యాలు లేకపోవడంతో ఈ రంగంలోకి పలు ప్రైవేట్ కంపెనీలు ప్రవేశించాయి.

పెరల్ ఫార్మింగ్‌‌‌‌లో కీలకమైన ఆల్చిప్పలు సప్లై చేస్తూ రైతులు ఉత్పత్తి చేసిన ముత్యాలను కొనుగోలు చేస్తున్నాయి. ఇందు కోసం రైతులతో బై బ్యాక్​ అగ్రిమెంట్లు​ కుదుర్చుకుంటున్నాయి.

పెట్టుబడికి రెట్టింపు ఆదాయం..
పెరల్ ఫార్మింగ్‌‌‌‌లో తాము పెట్టిన పెట్టుబడికి రెట్టింపు ఆదాయం వస్తుందని ఈ రంగంలో ఉన్న రైతులు పేర్కొంటున్నారు. ఉదాహరణకు రూ.10 లక్షల పెట్టుబడితో పెరల్ ఫార్మింగ్ ప్రారంభించాలంటే ముందుగా ఒక గుంట విస్తీర్ణంలో 6 నుంచి 8 ఫీట్ల లోతు కుంట (పాండ్) తవ్వించాలి.

నీటి కోసం బోరు, కరెంట్ మోటార్ తప్పనిసరి. ప్రస్తుతం కంపెనీలు రూ.85కు ఒక ఆల్చిప్పను సప్లై చేస్తున్నాయి. ఈ లెక్కన రూ.10 లక్షలతో సుమారు 10 వేల ఆల్చిప్పలను వేసుకోవచ్చు. 12 నెలల తర్వాత కంపెనీలు అందులో 50 పర్సెంట్ మోర్టాలిటీ తీసేసి మిగతా 50 పర్సెంట్​కు మాత్రమే లెక్కగట్టి కొనుగోలు చేస్తున్నాయి. ఒక ఆల్చిప్పలో రెండు ముత్యాలు తయారవుతాయి.

ఒక్కో పెరల్​కు రూ.180 చొప్పున 10 వేలకు రూ.18 లక్షలు చెల్లిస్తున్నాయి. పెట్టుబడి పోను రైతులకు రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల లాభం వస్తుంది. కంపెనీల ద్వారా కాకుండా నేరుగా ఆల్చిప్పలను సేకరించి సాగు చేసేవారు మరింత ఎక్కువ లాభం పొందవచ్చని చెపుతున్నారు. తక్కువ పెట్టుబడితో ప్రారంభించాలనుకుంటే ఇటుకలతో చిన్నపాటి ట్యాంకులను నిర్మించుకొని ముత్యాల సాగు చేపట్టవచ్చు.

రిస్క్​ కూడా ఎక్కువే..
ముత్యాల సాగు ఎంత లాభదాయకమో అంత రిస్క్​ కూడా ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు. ఆల్చిప్పలను సేకరించిన తర్వాత సర్జరీ ప్రక్రియ ద్వారా వాటిలో న్యూక్లియస్​ ప్రవేశపెడతారు. చిన్న నైలాన్​ లేదా ప్లాస్టిక్​ నెట్స్​లో పది చొప్పున ఆల్చిప్పలను ఉంచి తాడు సాయంతో నీళ్లలో వేలాడదీస్తారు. వాటికి వారానికోసారి స్ఫురిలీనా (నాచు) పౌడర్​ను నీటిలో కలిపి ఫీడింగ్​ ఇస్తారు.

అయితే నీళ్లలో పీహెచ్​ 6 నుంచి 8, టీడీఎస్​ 150 నుంచి 350 మధ్య ఉండేలా చూసుకోవాలి. నీటిలో ఆల్చిప్పలు రిలీజ్​ చేసే అమ్మోనియా లెవల్స్​ పెరిగితే ప్రమాదకరం. కావున నెలకోసారి నీళ్లను తొలగించి ఫ్రెష్​ వాటర్​ నింపాలి. చనిపోయిన ఆల్చిప్పలను ఎప్పటికప్పుడు తీసేయాలి.

లేకుంటే మిగతా వాటికి ఇన్ఫెక్షన్​ సోకుతుంది. టెంపరేచర్​ 40 డిగ్రీల లోపు మెయింటెన్ చేయాలి. ఇలా 12 నెలల పాటు జాగ్రత్తగా సంరక్షించగలితే ఆల్చిప్పల్లో ప్రవేశపెట్టిన న్యూక్లియస్​ చుట్టూ కెమికల్ లేయర్స్ ఫామ్ అయి అది పెరల్​గా మారుతుంది. ఈ ప్రక్రియ కాస్త రిస్క్​తో కూడిన వ్యవహారం. అందుకే సరైన ట్రైనింగ్ తీసుకున్న తర్వాతే పెరల్ ఫార్మింగ్ చేపట్టడం మేలని నిపుణులు సూచిస్తున్నారు.

ముత్యాల వినియోగం..
నెక్లెస్‌‌‌‌లు, రింగ్స్, ఇయర్ రింగ్స్, పెండెంట్లు వంటి ఆభరణాల తయారీలో ముత్యాలను విరివిగా ఉపయోగిస్తారు. పెండ్లిలో ధరించే మంగళసూత్రాల్లో ముత్యాలు, పగడాలను వాడుతారు. జ్యోతిష్య శాస్త్రంలో ముత్యం చంద్రుడికి ప్రతీక. ఇది ధరించడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుందని, ఒత్తిడి, ఆందోళన తగ్గి ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని నమ్ముతారు.

ఆయుర్వేదంలో ముత్యాల భస్మాన్ని గుండె సంబంధిత సమస్యలకు, కడుపులోని మంటను తగ్గించడానికి ఉపయోగిస్తారు. వీటిని పౌడర్ రూపంలో కాస్మొటిక్స్​, కాల్షియం సప్లిమెంట్స్‌‌‌‌లో ఎక్కువగా వాడుతున్నారు.

ముత్యపు చిప్పలను ఇంటీరియర్ డిజైనింగ్, సంగీత పరికరాల అలంకరణ, బటన్లు, మొజాయిక్ కళాకృతుల తయారీలో ఉపయోగిస్తారు. ఆధ్యాత్మికంగా జపమాలలు, ప్రార్థన పూసలు, దేవాలయ ఆభరణాల తయారీలో ముత్యాలను వాడుతారు. మన దేశంలో డిమాండ్‌‌‌‌కు సరిపడా పెరల్ ప్రొడక్షన్​ లేదు. దీంతో చైనా, జపాన్, హాంగ్ కాంగ్ తదితర దేశాల నుంచి ఏటా 25 నుంచి 30 మిలియన్​ డాలర్ల విలువైన ముత్యాలను దిగుమతి చేసుకుంటున్నాం.

యువ గ్రాడ్యుయేట్ల సక్సెస్..
మహారాష్ట్రలోని సిరొంచకు చెందిన రవి బొంగోనివార్ బీఎస్సీ బయోటెక్నాలజీ పూర్తి చేసిన తర్వాత ప్రైవేట్​ ఉద్యోగాలు చేశాడు. వాటిలో సంతృప్తి లేకపోవడంతో పెరల్ ఫార్మింగ్ గురించి స్టడీ చేసి, ట్రైనింగ్ తీసుకుని ఐదేండ్ల కిందట తన పొలంలోనే ఫార్మింగ్ ప్రారంభించాడు. మొదట్లో రూ.5లక్షల పెట్టుబడితో స్టార్ట్ చేసి ఏటేటా పెంచుకుంటూ పోయాడు. ఇప్పటివరకు నాలుగు క్రాప్స్ తీశాడు. ప్రస్తుతం రూ.2 కోట్ల ఇన్వెస్ట్​మెంట్​తో ఐదు గుంటల విస్తీర్ణంలో 1.80 లక్షల ఆల్చిప్పలను వేశాడు. 12 నెలల తర్వాత రూ.4 కోట్ల ఆదాయం వస్తుందని తెలిపాడు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం మోదెడకు చెందిన ఠాకూర్ అజయ్​సింగ్ అగ్రికల్చర్ డిప్లొమా చదివాడు. కొంతకాలం ప్రైవేట్ జాబ్స్ చేశాడు. సొంతంగా అగ్రి ఎంట్రప్రెన్యూర్‌‌‌‌‌‌‌‌గా ఎదగాలనే పట్టుదలతో నాలుగేండ్ల కింద పెరల్ ఫార్మింగ్ స్టార్ట్ చేశాడు. ఈసారి రూ.40 లక్షల పెట్టుబడితో 51 వేల ఆల్చిప్పలు వేశాడు. అలాగే నాటుకోళ్ల ఫామ్ సైతం ఏర్పాటు చేసి మంచి ఆదాయం పొందుతున్నాడు.

వీళ్లను చూసి మంచిర్యాల జిల్లా చెన్నూర్, పెద్దపల్లి జిల్లా మంథని, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం, మహదేవపూర్ తదతర మండలాలకు చెందిన పలువురు రైతులు ఈ ఏడాది పెరల్ ఫార్మింగ్​కు ముందుకొచ్చారని చెప్పారు. వారికి ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు ఆల్చిప్పల సప్లై నుంచి బై బ్యాక్ వరకు మీడియేటర్‌‌‌‌‌‌‌‌గా వ్యవహరిస్తున్నారు.