
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) పరపతి సమీక్ష తర్వాత వడ్డీ రేట్లను సవరించడం లేదన్నారు గవర్నర్ శక్తికాంత దాస్. మూడు రోజుల పాటు పరపతి సమీక్షను జరిపిన బోర్డు నిర్ణయాలను ఇవాళ(శుక్రవారం) దాస్ తెలిపారు. ఆరుగురు సభ్యుల బృందం అక్టోబర్ 7 నుంచి పరపతి సమీక్షను ప్రారంభించింది. ఆర్బీఐ నిర్ణయాలను మీడియాకు చెప్పిన శక్తికాంత దాస్, రెపో రేటు 4 శాతం వద్ద, రివర్స్ రెపో రేటు 3.35 శాతం దగ్గర కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఆర్థిక వృద్ధి నిదానంగా సాగుతున్న వేళ, వడ్డీ రేట్లను మరింతగా తగ్గించాల్సిన అవసరం లేదని భావిస్తున్నామని, ద్రవ్యోల్బణం కూడా అదుపులోనే ఉందని ఆయన అన్నారు. ద్రవ్యోల్బణం రానున్న మూడు నెలల వ్యవధిలో మరింతగా తగ్గుతుందని అంచనా వేస్తున్నామని, 2021 నాలుగో త్రైమాసికం నాటికి ఆర్బీఐ టార్గెట్ కు దగ్గరకు వస్తుందని భావిస్తున్నామని అన్నారు. గత పరపతి సమీక్షల తర్వాత కీలక రేట్లను తగ్గించామని గుర్తు చేసిన శక్తికాంత దాస్… భారత రియల్ జీడీపీ 9.5 శాతం వరకూ తగ్గుతుందని అనుకున్నట్లు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో స్వల్ప రికవరీ నమోదైందని… ఇది రెండో అర్ధభాగంలో మరింతగా నమోదవుతుందని, ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభంకావడం మంచి పరిణామమన్నారు.