సెగ్మెంట్ సీన్.. భువనగిరి ఖిల్లాపై ఎగిరేది ఏ జెండా?

సెగ్మెంట్ సీన్.. భువనగిరి ఖిల్లాపై ఎగిరేది ఏ జెండా?
  • రెండు సార్లు కాంగ్రెస్.. ఒకసారి బీఆర్ఎస్ గెలుపు
  • జోరుమీదున్న అధికార కాంగ్రెస్ ​పార్టీ క్యాడర్​
  • టికెట్ ​రేసులో సీనియర్లు, వారసులు
  • మోదీ చరిష్మా, రామమందిరం, కేంద్ర పథకాలపైనే బీజేపీ ఆశలు
  • బీఆర్ఎస్ ​నేతల్లో కనిపించని ఉత్సాహం 

యాదాద్రి, వెలుగు: వచ్చే లోక్​సభ ఎన్నికల్లో భువనగిరిలో ఏ పార్టీ జెండా ఎగరనుందన్నది ఆసక్తికరంగా మారింది.  త్వరలో ఎలక్షన్ షెడ్యూల్ రానుండడంతో ఏ పార్టీ టికెట్​ఎవరికి దక్కుతుంది? ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయి? అనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఊపు మీదుంది. మోదీ చరిష్మాతోపాటు అయోధ్య రామమందిరం ఓపెనింగ్ తమకు కలిసొస్తుందని  బీజేపీ పూర్తి భరోసాతో ఉంది. రాష్ట్రంలో పవర్​కోల్పోయిన బీఆర్ఎస్ లో మాత్రం జోష్ కనిపించడం లేదు. బీఆర్ఎస్​టికెట్​కోసం నేతలు కూడా పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. 

ఐదు జిల్లాల సంగమం

నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో అంతకు ముందున్న మిర్యాలగూడకు బదులు భువనగిరి లోక్​సభ స్థానం ఏర్పడింది. రంగారెడ్డి, నల్గొండ, భువనగిరి, సూర్యాపేట, జనగామ జిల్లాల్లో విస్తరించి ఉన్న ఈ స్థానం పరిధిలో ఇబ్రహీంపట్నం, మునుగోడు, నకిరేకల్, భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, జనగామ అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. 2009 లోక్​సభ ఎన్నికల్లో ఇక్కడ నుంచి కాంగ్రెస్​అభ్యర్థిగా పోటీచేసిన  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలిచారు. 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి బూర నర్సయ్య గౌడ్​విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో ఈ స్థానాన్ని కాంగ్రెస్(కోమటిరెడ్డి వెంకటరెడ్డి)​ తిరిగి దక్కించుకుంది. ఈసారి రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో సిట్టింగ్​స్థానం ఈసారి కూడా తమదేనని కాంగ్రెస్​నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

కాంగ్రెస్​లో తీవ్ర పోటీ

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో భువనగిరి లోక్​సభ పరిధిలోని జనగామలో మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది. మిగిలిన ఆరుచోట్ల కాంగ్రెస్ విజయం సాధించింది. కాంగ్రెస్​పార్టీ అభ్యర్థులకు మొత్తం 8లక్షల17వేల279 ఓట్లు వచ్చాయి. ఇదే ఊపుతో లోక్ సభ సీటును గెలుచుకోవాలని హస్తం పార్టీ నేతలు, కార్యకర్తలు చూస్తున్నారు. కాంగ్రెస్​టికెట్ కోసం నేతల మధ్య పోటీ నెలకొంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి భార్య లక్ష్మి, కోమటిరెడ్డి మోహన్ రెడ్డి కొడుకులు సూర్య పవన్ రెడ్డి, చంద్ర పవన్ రెడ్డి, చామల కిరణ్​కుమార్​రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్​కుమార్​రెడ్డి కూతురు కీర్తిరెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్​రెడ్డిని పార్టీలో చేర్చుకుని ఆయనకు టికెట్​ఇస్తారన్న ప్రచారం కూడా నడుస్తోంది. అలాగే జనగామ డీసీసీ ప్రెసిడెంట్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, సూర్యాపేటకు చెందిన చెవిటి వెంకన్న యాదవ్, మాజీ జడ్పీ చైర్మన్ కసిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి కొడుకు సర్వోత్తమ్ రెడ్డి టికెట్​రేసులో ఉన్నారు. 

మోదీ చరిష్మాపైనే విశ్వాసం 

భువనగిరి పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీకి ఎక్కడా చెప్పుకోదగ్గ బలం లేదు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు చోట్ల కలిపి కేవలం 74,782 ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే.. లోక్​సభ ఎన్నికల సీన్  డిఫరెంట్​గా ఉంటుందని, మోదీ పేరు మీదే పోలింగ్ జరుగుతుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయోధ్యలో రామమందిర ప్రారంభం ఎన్నికల్లో తమకు కలిసి వస్తుందని చెప్పుకుంటున్నారు. బీజేపీ నుంచి పోటీ చేసేందుకు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్​సిద్ధంగా ఉన్నారు. అలాగే పార్టీ సీనియర్​నేతలు కాసం వెంకటేశ్వర్లు, పీవీ శ్యాంసుందర్​రావు, గంగిడి మనోహర్​రెడ్డి, వేదిరె శ్రీరామ్ కూడా బీజేపీ టికెట్ ఆశిస్తున్నారు.

బీఆర్ఎస్ ​డీలా

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత  బీఆర్ఎస్​లో మునుపటి ఉత్సాహం కనిపించడం లేదు. మొన్నటి దాకా భువనగిరి లోక్​సభ టికెట్​కోసం పలువురు ఆశలు పెట్టుకోగా.. ఇప్పుడు టికెట్ ఇస్తామన్నా పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. కచ్చితంగా గెలుస్తామన్న నమ్మకం లేకపోవడంతో, కోట్లల్లో ఖర్చు పెట్టేందుకు ఎవరూ ముందుకురావడంలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు చోట్లా కలిపి బీఆర్ఎస్​కు  5లక్షల60వేల2 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్​కన్నా 2.57 లక్షల ఓట్ల వెనుకబడి ఉంది. లోక్​సభ ఎన్నికల్లో జాతీయ అంశాల ప్రభావం ఉంటుందన్న ఆలోచనతో బీఆర్ఎస్​లీడర్లు వెనుకడుగు వేస్తున్నారని సమాచారం. పార్టీ మాత్రం మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ విజయావకాశాలపై సర్వే చేయించినట్టు చెబుతున్నారు.

ఆయనతోపాటు మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్​ రెడ్డి,  ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి, క్యామ మల్లేశ్, గొంగిడి మహేందర్​రెడ్డి పేర్లను హైకమాండ్​పరిశీస్తునట్లు సమాచారం. యాదగిరిరెడ్డి భువనగిరి నుంచి కాకుండా మల్కాజిగిరి నుంచి బరిలోకి దిగాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. వీరితోపాటు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు అమిత్ రెడ్డి, డాక్టర్ చెరుకు సుధాకర్, దుడిమెట్ల బాలరాజు, పొన్నాల లక్ష్మయ్య టికెట్ రేసులో ఉన్నట్లు బీఆర్ఎస్​వర్గాల్లో చర్చ నడుస్తోంది.

అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటర్లు

నియోజకవర్గం    ఓటర్ల సంఖ్య 
ఇబ్రహీంపట్నం    3,37,047
మునుగోడు    2,58,063
నకిరేకల్​    2,33,286
ఆలేరు    2,33,860
భువనగిరి    2,19,957
తుంగతుర్తి    2,57,999
జనగామ    2,41,145