హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు జూనియర్ కాలేజీల్లో సైన్స్ ల్యాబ్‌ల నిర్వహణకు ఇంటర్ బోర్డు నిధులు విడుదల చేసింది. త్వరలో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జరగనున్న నేపథ్యంలో బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నది. ఒక్కో ప్రభుత్వ జూనియర్ కాలేజీకి రూ.50 వేల చొప్పున నిధులు రిలీజ్ చేసింది. ఈ నిధులతో ల్యాబ్‌లలో అవసరమైన పరికరాలు, ఇతర సౌకర్యాలు సమకూర్చుకోవాలని సూచించింది. దీంతో పాటు ప్రాక్టికల్స్ పరీక్షల నిర్వహణ, కెమికల్స్ ఇతర వస్తువుల కొనుగోలు కోసం బోర్డు ప్రత్యేకంగా రూ.2.10 కోట్లను విడుదల చేసినట్టు ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య తెలిపారు.
పేరెంట్ మొబైల్‌కు హాల్‌టికెట్ ప్రివ్యూ
ఇంటర్ బోర్డు నుంచి పేరెంట్ వాట్సాప్ మొబైల్ నంబర్ కు హాల్ టికెట్ డీటెయిల్స్ పంపించారు. ఇంటర్ బోర్డు నుంచి వచ్చిన లింకును ఓపెన్ చేసి విద్యార్థి ఎస్ఎస్సీ హాల్ టికెట్ నంబర్, డేటాఫ్ బర్త్ ఎంటర్ చేస్తే.. ఇంటర్ హాల్ టికెట్ కనిపిస్తుంది. ఏదైనా తప్పులు ఉన్నట్లయితే కాలేజీ మేనేజ్ మెంట్ కు తెలియజేయాలని అధికారులు సూచించారు. ఇది డమ్మీ హాల్ టికెట్ అని ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య చెప్పారు. దీనిలో హాల్ టికెట్ నంబర్, సెంటర్ పేరు, క్యూఆర్ కోడ్ మినహా మిగిలిన అన్ని వివరాలు ఉంటాయని వెల్లడించారు. ఎగ్జామ్స్ షెడ్యూల్, మీడియం, పేరెంట్స్ వివరాలతో పాటు సెకండియర్ హాల్ టికెట్లపై ఫస్టియర్ మార్కులు ముద్రించామని పేర్కొన్నారు. శనివారం దాదాపు పది లక్షల మందికి పంపామని వెల్లడించారు.
