హైదరాబాద్​లో తొలిసారి.. ఇంటర్నేషనల్​ థైక్వాండో ఛాంపియన్ ​షిప్​ పోటీలు

హైదరాబాద్​లో తొలిసారి.. ఇంటర్నేషనల్​ థైక్వాండో  ఛాంపియన్ ​షిప్​ పోటీలు

ఖైరతాబాద్, వెలుగు: ప్రపంచ దేశాల్లో ఎంతో గుర్తింపు పొందిన ఇంటర్నేషనల్​ థైక్వాండో చాంపియన్​షిప్ లీగ్(ఐటీసీఎల్) ​పోటీలను ​గచ్చిబౌలి ఇండోర్​ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు ప్రముఖ ఇంటర్నేషనల్​ మెజీషియన్​సామల వేణు తెలిపారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోని 206 దేశాల్లో ఈ మార్షల్​ఆర్ట్స్​క్రీడకు ఎంతో ఆదరణ ఉందని పేర్కొన్నారు. అంతటి ఆదరణ పొందిన క్రీడను దేశంలోనే హైదరాబాద్​లో తన ఆధ్వర్యంలో తొలిసారిగా  పరిచయం చేస్తున్నట్లు తెలిపారు.

ఇందులో శ్రీనగర్ ​టీమ్​కు యజమానిగా ఉన్నానని చెప్పారు.  ఈ నెల12,13,14 తేదీల్లో మూడ్రోజుల పాటు పోటీలు నిర్వహిస్తున్నామన్నారు.  ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 వరకు జరుగుతాయన్నారు. క్రీడలపై మక్కువ ఉన్నవారు ఎవరైనా రావొచ్చని , ఎంట్రీకి  ఎలాంటి ఫీజు లేదన్నారు. మొత్తం 12 టీమ్స్​ క్రీడల్లో పాల్గొంటున్నాయని, ఒక్కో టీమ్​లో 5 మంది సభ్యులు ఉంటారన్నారు. పోటీలు ముగింపు రోజు14న అబ్దుల్లా గ్రూప్ ​ఆఫ్​ కంపెనీస్​ చైర్మన్​అబ్దుల్లా హాజరై  విజేతలకు బహుమతులు, మెడల్స్ ​అందజేస్తారని చెప్పారు. ఈ సమావేశంలో ఐటీ హెడ్​మకరంద్, డైరెక్టర్స్ గిరిబాబు, సీహెచ్ సుప్రియ పాల్గొన్నారు.