
అంబర్ పేట్, వెలుగు: అంతర్రాష్ట్ర షట్టర్ లిఫ్టింగ్ ముఠాను సుల్తాన్ బజార్ పోలీసులు అరెస్టు చేశారు. ఈస్ట్ జోన్ డీసీపీ ఆఫీసులో ఏసీపీ మట్టయ్య తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ సుల్తాన్ బజార్‌లో లక్ష్మీ మొబైల్ షాపు యజమాని మసర రామ్ దేవసి ఎప్పటిలాగే ఈ నెల 4న ఉదయం షాపు తెరవడానికి వెళ్లాడు. షాపు షట్టర్ పగలగొట్టి ఉండటం, క్యాష్ కౌంటర్లో ఉండాల్సిన రూ. 9 లక్షల నగదు దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులు రాజస్థాన్‌కు చెందిన వారని గుర్తించారు.
ముఠా ప్రధాన నిందితుడు పరసరామ్, గతంలో అదే గల్లీలో పనిచేసిన అనుభవంతో షాపులో నగదు ఉంటుందని గుర్తించాడు. తన మిత్రుడు జైసా రామ్ సహాయంతో ముఠా ఏర్పాటు చేశాడు. -నాగాజీ రామ్, లీలారామ్, లక్ష్మణ్ రామ్, జబరా రామ్‌లను రైలులో హైదరాబాద్ రప్పించాడు. దిల్ సుఖ్ నగర్లో లాడ్జిలో ఉన్న వీరు ఈ నెల 3న రాత్రి మొబైల్ షాపులో దొంగతనానికి పాల్పడ్డారు. గతంలో వీరు కోఠిలోని వివిధ మొబైల్ షాపుల్లో పని చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠాలోని ఆరుగురిని పట్టుకొని వారి నుంచి రూ.8 లక్షల నగదు, 6 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. సమావేశంలో డీసీపీ బాలస్వామి, ఇన్ స్పెక్టర్ నర్సింహులు ఉన్నారు.